Share News

Putin India Visit: ఆప్తమిత్రుని ఆగమనం

ABN , Publish Date - Dec 03 , 2025 | 02:37 AM

ఎంతోకాలానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన ఆప్తమిత్రదేశంలో అడుగుపెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన గతకాలపు మిత్రుడైన నరేంద్రమోదీని...

Putin India Visit: ఆప్తమిత్రుని ఆగమనం

ఎంతోకాలానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన ఆప్తమిత్రదేశంలో అడుగుపెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన గతకాలపు మిత్రుడైన నరేంద్రమోదీని పలురీతుల ఇరకాటంలో పెడుతూ, భారతదేశాన్ని ఇబ్బందుల పాల్జేస్తున్న నేపథ్యంలో, రష్యా అధినేత భారత పర్యటనకు ఎంతో ప్రాధాన్యం వచ్చింది. డిసెంబరు 4–5 తేదీల్లో జరగబోయే పుతిన్‌ పర్యటనకు సంబంధించిన పలు ఆసక్తికర, విశేష కథనాలను మీడియా అందిస్తోంది. ఆయన తినేతిండి, తాగేనీరు, వాడే టాయ్‌లెట్‌ సహా సర్వమూ రష్యా నుంచే తరలివస్తాయనీ, మలమూత్రాదులు సైతం వెనక్కు తీసుకుపోతారనీ, ఆయన ప్రయాణించే విమానం భద్రమైనదీ, దుర్భేద్యమైనదంటూ మాధ్యమాలు వివరిస్తున్నాయి. ఒక్కడు కాదు, అచ్చం ఆయనలాగే ఉండే అనేకులు కూడా వస్తున్నారన్న కథనాలు సైతం ఎప్పటిలాగానే దర్శనమిస్తున్నాయి. పుతిన్‌ వైభవాన్నీ, భద్రతనూ అటుంచితే, మన భద్రత, ఉభయదేశాల స్నేహం, వాణిజ్యం ఇత్యాది అంశాల్లో ఉభయదేశాధినేతలూ పలు కీలకమైన ఒప్పందాల మీద సంతకాలు చేయబోతున్నారు.

అమెరికా ఒత్తిడికి లొంగి, రష్యా ముడిచమురు కొనుగోళ్ళను విపరీతంగా తగ్గించేసిన పరిస్థితిలో, ఆర్థికంగా రష్యాను ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత భారత్‌ మీద ఉన్నాయి. భారీ రక్షణ, ఇంధన ఒప్పందాలతో పాటుగా, రష్యాకు వివిధ మార్గాల్లో చేయూతనివ్వగలిగే కొత్త తరహా అవగాహనలమీద ఉభయదేశాలు దృష్టిపెట్టాయి. రైఫిళ్ళ నుంచి సుఖోయ్‌ యుద్ధవిమానాలు, క్షిపణి రక్షణవ్యవస్థల వరకూ పలురకాల కొనుగోళ్ళతో పాటు, రష్యా సాయంతో నిర్మితమవుతున్న కూడాంకుళం అణువిద్యుత్‌ ప్లాంట్‌ తదుపరిదశలను వేగవంతం చేయడం, ఉపగ్రహనిర్మాణ, నిర్వహణలతో సహా అంతరిక్ష రంగంలో సహకరించుకోవడం వంటివి ఎజెండాలో ఉన్నాయట. ముడిచమురు స్థానాన్ని కొంతమేరకు సహజవాయువుతో భర్తీచేయడమే కాక, రష్యా ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా భారత్‌కు ఇంధన భద్రత, రష్యాకు నిలకడైన ఆదాయం అందే ఏర్పాటు జరుగుతోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.


ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఆగిన భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి నాలుగేళ్ళ తరువాత పుతిన్‌ వస్తున్నారు. యుద్ధంలో అణ్వాయుధాలు వాడతామంటూ పుతిన్‌ దూకుడుగా చేసిన వ్యాఖ్యలు భారత్‌ను అప్పట్లో మరింత ఇబ్బందిపెట్టాయి. అయితే, గత ఏడాది అక్టోబర్‌లో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు రష్యాలోనే జరగడంతో పుతిన్‌–మోదీ భేటీకి అడ్డులేకపోయింది. దీనికిముందు జూలైలో నరేంద్రమోదీ తన మూడవ పదవీకాలంలో జరిపిన తొట్టతొలి ద్వైపాక్షిక పర్యటనకు రష్యానే ఎంచుకున్నారు. నైబర్స్‌ఫస్ట్‌ అన్న గత విధానానికి భిన్నంగా ఆయన మన చిరకాల ఆప్తమిత్రదేశంలో తొలిగా కాలూనారు. అయితే, మోదీ అక్కడ ఉండగానే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని పిల్లల ఆస్పత్రిమీద రష్యా క్షిపణి దాడిచేసింది. ఈ పర్యటనలో పుతిన్‌ను మోదీ కౌగలించుకొని ఆప్తమిత్రుడుగా అభివర్ణించినందుకు జెలెన్‌స్కీ ఆగ్రహించి, ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాధినేత ఓ అత్యంత క్రూరుడైన నేరగాడిని ఆలింగనం చేసుకున్న దృశ్యం అంటూ దానినీ, ధ్వంసమైన చిన్నారుల ఆస్పత్రి చిత్రాన్నీ ట్విటర్‌లో పోస్టుచేశారు. రష్యాతో యుద్ధం మొదలైన తరువాత జెలెన్‌స్కీ భారతదేశాన్ని నేరుగా తప్పుబట్టడం అదే తొలిసారి. అనంతరకాలంలో పలుమార్లు ఇటువంటి సంకటస్థితినీ, పలురకాల అంతర్జాతీయ ఒత్తిళ్ళనూ ఎదుర్కొంటూనే, రష్యాను సాధ్యమైనంత కాపాడుకొస్తూ, మొత్తానికి ఈ యుద్ధకాలాన్ని భారత్‌ నెట్టుకురాగలిగింది. యుద్ధం ఆపేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తున్న ట్రంప్‌ భారత్‌, రష్యాలను తీవ్రంగా ఇక్కట్లపాల్జేస్తున్న తరుణంలో పుతిన్‌ పర్యటన భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి నిదర్శనమంటున్నారు నిపుణులు.

భారత్‌–అమెరికా వాణిజ్య చర్చలు కొలిక్కివచ్చాయని, త్వరలోనే ఒప్పందం కుదరబోతోందని వార్తలు వస్తున్నాయి. ట్రంప్‌ చొరవతో, పుతిన్‌ పక్షాన తయారైన శాంతి ప్రణాళిక పట్టాలెక్కబోతోందనీ వింటున్నాం. ఇవి రెండూ సవ్యంగా జరిగిపోయిన పక్షంలో, భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తీసుకొనే నిర్ణయాలు, కుదుర్చుకొనే ఒప్పందాల అమలులో అమెరికా వేలుపెట్టే, అడ్డంకులు సృష్టించే అవకాశాలు పెద్దగా ఉండవు. పునాది బలం దిట్టంగా ఉన్న భారత్‌–రష్యా స్నేహం ఎన్నటికీ చెరగనిది, చెదరనిది. గత ఏడాది జూలైలో మోదీ రాకకు రష్యా ఎంతో సంతోషిస్తూ ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామంగా దానిని అభివర్ణించింది. అదేవిధంగా, పుతిన్‌ ప్రస్తుత పర్యటన ఉభయదేశాల సంబంధాలను మరో ఎత్తుకు తీసుకుపోబోతున్న మాట వాస్తవం.

Updated Date - Dec 03 , 2025 | 02:37 AM