Population Planning: సరైన ప్రణాళికలుంటే, జనాభా వరమే
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:46 AM
జనాభా అంశంపై ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయాయి. కొన్ని దేశాలు ఇప్పటికే అధిక జనాభాతో ఉన్నట్లు భావించి నియంత్రణ చర్యలు పాటిస్తుండగా, మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి
జనాభా అంశంపై ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయాయి. కొన్ని దేశాలు ఇప్పటికే అధిక జనాభాతో ఉన్నట్లు భావించి నియంత్రణ చర్యలు పాటిస్తుండగా, మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. గతంలో జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన దేశాలు కూడా ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తున్నాయి. భారతదేశంలోని రాష్ట్రాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఉత్తర భారతానికి చెందిన యూపీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికీ జనాభా నియంత్రణకు ప్రాధాన్యమిస్తుండగా, దక్షిణాదికి చెందిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనాభా అనేది ప్రధాన సమస్య కాదని, ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళికలు లేకపోవడమే అసలు కారణమని తెలుస్తున్నది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని, సరైన ప్రణాళికలతో జనాభాను వినియోగించుకుంటే అది దేశానికి వరమే అని పలు దేశాలు నిరూపించాయి. 143 కోట్ల జనాభాతో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా, 142 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉన్నది. జనాభా పెరుగుదల సమస్యలు దేశాల ఆర్థిక, సామాజిక, పర్యావరణంపై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రణాళిక లేనప్పుడు జనాభా పెరుగుదల ఒత్తిడిని సృష్టిస్తుంది, కానీ సమర్థవంతమైన విధానాలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు.
జనాభాను అంకెల పరంగానే కాకుండా జనసాంద్రత పరంగా పరిశీలిస్తే కొన్ని దేశాలు సరైన ప్రణాళికలతో ఎలా అభివృద్ధిపథంలో నడిచాయో తెలుస్తుంది. ఇందులో అధిక జనసాంద్రత ఉన్నా, సింగపూర్ సమర్థవంతమైన ప్రణాళిక ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. ప్రపంచంలో జనసాంద్రత పరంగా సింగపూర్ మూడో స్థానంలో ఉంది. ఈ దేశ వైశాల్యం 719.9 చదరపు కిలోమీటర్లు కాగా, చదరపు కిలోమీటర్‌కు 8,595 మంది నివసిస్తున్నారు. అయితే అధిక ఆర్థిక వృద్ధి, అత్యుత్తమ గృహనిర్మాణం, ఆరోగ్య సేవలతో ప్రపంచంలోనే ఈ దేశం అగ్రగామిగా ఉంది. 1960–70లలో ‘స్టాప్ ఎట్ టూ’ కార్యక్రమం ద్వారా జనన రేటును తగ్గించగా, 1980ల నుంచి బేబీ బోనస్ స్కీమ్ ద్వారా జనన రేటును సమతుల్యం చేసింది.
జనసాంద్రత పరంగా చైనా ప్రపంచవ్యాప్తంగా 83వ స్థానంలో ఉంది. చదరపు కిలోమీటర్‌కు 153 మంది నివసిస్తున్నారు. 1980 నుంచి 2015 వరకు చైనా వన్ చైల్డ్ పాలసీని అమలు చేసి, దాదాపు 40 కోట్ల జనాభాను నియంత్రించింది. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఆ దేశం జనాభా వనరులను సమర్థవంతంగా ఉపయోగించింది. ఫలితంగా చైనా రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. అయితే కఠిన విధానాలు జనాభా నియంత్రణలో విజయవంతమైనా, దీర్ఘకాల సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సమస్యలను సృష్టించింది. వృద్ధ జనాభా ఎక్కువ కావడం, లింగ నిష్పత్తిలో తేడాలు రావడంతో వెంటనే అప్రమత్తమై 2015లో టూ చైల్డ్ పాలసీ, 2021లో ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇక, భారతదేశంలో జనసాంద్రత (485/చ.కి.మీ.) కూడా ఎక్కువే. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో యువ జనాభా 65 శాతం (35 ఏళ్లలోపు) ఉంది. ఈ అంశం సరైన ప్రణాళికతో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. సరైన అర్బన్ ప్లానింగ్ పాలసీ, ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక వినియోగం వంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎక్స్‌పోర్ట్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా యువ జనాభాను ఉత్పాదక శక్తిగా మార్చవచ్చు. సాంకేతికతను ఉపయోగించి, గ్రామీణ–నగర అసమానతలను తగ్గించవచ్చు. జనాభా సమస్యల సవాళ్ల నుంచి అభివృద్ధికి మార్గాలను వెతికితే.. కొన్ని దశాబ్దాల్లోనే భారతదేశం నంబర్ వన్ ఆర్థిక శక్తిగా మారే అవకాశముంది.
– ఫిరోజ్ ఖాన్ (నేడు ప్రపంచ జనాభా దినోత్సవం)