Share News

Pope Francis Legacy: పోప్‌ ఫ్రాన్సిస్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:02 AM

పోప్‌ ఫ్రాన్సిస్‌ ఒక వినమ్ర, హృదయవంతుడైన ఆధ్యాత్మిక నాయకుడిగా పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేశారు. మత, రాజకీయ, సామాజిక విభాగాలలో ఉదారవాద మార్గదర్శకునిగా సమాజంలో గుణాత్మక మార్పులకు దోహదపడ్డారు.

Pope Francis Legacy: పోప్‌ ఫ్రాన్సిస్‌

సంస్కర్త హృదయమున్న ఆధ్యాత్మిక పుణ్యమూర్తి పోప్‌ ఫ్రాన్సిస్‌. మొన్న సోమవారంనాడు మరణించిన ఈ పోప్‌ ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్లకు పైగా ఉన్న రోమన్‌ కేథలిక్‌ మతస్తులకు వహించిన మార్గదర్శకత్వం విప్లవాత్మకమైనది. ఆయన పేదల పక్షపాతి. ధరిత్రికి ముంచుకొస్తున్న ముప్పును గుర్తించి వాతావరణ మార్పు వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, ప్రజలకు ప్రేరణ కల్పించిన కార్యాచరణ ద్రష్ట. లాటిన్‌ అమెరికా నుంచి, ఆ మాటకొస్తే ఉభయ అమెరికా ఖండాల నుంచి క్రైస్తవ మత అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన తొలివ్యక్తి పోప్‌ ఫ్రాన్సిస్‌. జార్జి మారియో బెర్‌ గొగ్లియోగా 1936లో అర్జెంటీనాలో జన్మించిన ఫ్రాన్సిస్‌, పోప్‌గా ఎన్నికైన తొలి జెసూట్స్‌ క్రైస్తవుడు కూడా కావడం ఒక విశేషం. వర్తమాన క్రైస్తవ, క్రైస్తవేతర మత, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నాయకులలో ఆయన ఒక విలక్షణ వ్యక్తి. పోప్‌గా ఎన్నికైన తరువాత, తాను ఎంతగానో అభిమానించే పర్యావరణం, జంతువుల రక్షక ఋషిగా చిరంజీవి అయిన 13వ శతాబ్ది క్రైస్తవ సాధు పురుషుడు సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పేరును ఆయన స్వీకరించారు. పేదరికం నిర్మూలనకు, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ద్వారా ఆ పేరును సార్థకం చేశారు. పోప్‌గా నిరాడంబర జీవనం గడిపిన ఫ్రాన్సిస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు అమానుష స్థాయిలో పెరిగిపోవడాన్ని నిరసించారు. పేదల సంక్షేమం పట్ల ఉదాసీనత ప్రపంచీకరణ కావడాన్ని, సంపన్న దేశాలలో ‘ఆధ్యాత్మిక దుర్భిక్షాన్ని’ నిక్కచ్చిగా విమర్శించేందుకు ఆయన వెనుకాడేవారు కాదు. అర్జెంటీనాకు వలస వెళ్లిన ఇటాలియన్ వలసకారుల కుటుంబంలో జన్మించిన ఫ్రాన్సిస్‌ శరణార్థుల, నిరాశ్రయుల, మరీ ముఖ్యంగా వలసజీవుల శ్రేయస్సుకు స్వయంగా చొరవ తీసుకున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌ తన మొదటి పదవీ కాలంలో వలసకారులను అడ్డుకునేందుకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించడాన్ని ఫ్రాన్సిస్‌ హర్షించలేదు. ఆ చర్య క్రైస్తవ ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేశారు.


రెండోసారి అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసకారులు అంటూ ట్రంప్‌ ఎంతో మందిని మానవతా విలువలు పాటించకుండా బలవంతంగా అమెరికా నుంచి పంపించివేయడాన్ని ఫ్రాన్సిస్‌ ఆమోదించలేదు. ట్రంప్‌ చర్యను గట్టిగా వ్యతిరేకించాలని అమెరికాలోని బిషప్‌లకు రాసిన లేఖలో ఆయన కోరారు. కేథలిక్‌ చర్చ్‌ల్లో మహిళలకు పురోహిత బాధ్యతలు అప్పగించేందుకు పూర్వ పోప్‌ల వలే ఫ్రాన్సిస్‌ కూడా సమ్మతించలేదు. అయితే వాటికన్‌ ప్రభుత్వ వ్యవస్థలో మహిళలను మున్నెన్నడు లేని విధంగా అత్యున్నత స్థానాలలో ఆయన తొలిసారిగా నియమించారు. అలాగే స్వలింగ సంపర్కాన్ని నిరసించినప్పటికీ అటువంటి వారి మధ్య వివాహాలకు మతపరమైన ఆమోదాన్ని తెలుపాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదేశించారు. కెనడాలోని ప్రథమ జాతుల (మూల వాసులు) వారికి క్రైస్తవ మతాధికారుల మూలంగా వాటిల్లిన కష్ట నష్టాలకు పోప్‌ ఫ్రాన్సిస్‌ 2022లో క్షమాపణలు చెప్పారు. ఇంకా ఇలా ఉదారవాద దృక్పథంలో పలు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రోమన్‌ కేథలిక్‌ క్రైస్తవ మత వ్యవస్థలో గుణాత్మక విప్లవాత్మక మార్పులకు ఆయన దోహదం చేశారు. ప్రపంచ పర్యావరణ ఉద్యమాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ పలు విధాలుగా ప్రభావితం చేశారు. ధరిత్రిని ‘మానవాళి ఉమ్మడి నివాసం’గా ఫ్రాన్సిస్‌ అభివర్ణించారు.


ధరిత్రికి వాటిల్లుతున్న హానిని ప్రపంచ సమాజాలు సమష్టిగా ఎదుర్కోవాలని ఉద్బోధించారు. ఏటా జరిగే కాప్‌ సదస్సులలో చర్చలను ఆయన ప్రభావితం చేసేవారు. అమెజాన్‌ అరణ్యాల విధ్వంసాన్ని స్వయంగా చూసిన ఫ్రాన్సిస్‌ హరిత ధాత్రిని కాపాడుకునే విషయంలో మూలవాసుల అభిప్రాయాలకు విశేష ప్రాధాన్యమిచ్చారు. మతాల మధ్య సదవగాహనను పెంపొందించడానికి పోప్‌ ఫ్రాన్సిస్‌ కృషి చేశారు. ఈ కృషికి పరాకాష్ఠగా 2019లో అబుధాబిలో ‘మానవ సౌభ్రాతృత్వం’ సదస్సు జరిగింది. ఆ సందర్భంగా అల్‌ అఝర్‌ (ఈజిప్ట్‌) లోని గ్రాండ్‌ ఇమామ్‌ అహ్మద్‌ అల్‌ తయ్యబ్‌తో కలిసి ఆయన ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆ సదస్సు సందర్భంగా తనతో సమావేశమైన భారతీయ ప్రతినిధులకు భారత్‌ ఆధ్యాత్మిక సంస్కృతి పట్ల తనకెంతో గౌరవం ఉందని ఫ్రాన్సిస్‌ అన్నారు. వ్యక్తిగా, మత వేత్తగా ఆయన నిండు మానవతావాది. సమాజ జీవనంలో మానవత పరిపూర్ణంగా విలసిల్లేందుకు ఆయన అచంచలమైన అంకితభావంతో పాటుపడ్డారు. ఆయన ధర్మ ప్రవచనాలు క్రైస్తవులకే కాక క్రైస్తవేతరులకూ స్ఫూర్తిదాయకమైనవి. రాజకీయ సంబంధిత భావావేశాలతో మత ధర్మాలను తప్పుగా అర్థం చేసుకుంటున్న మన సమాజంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ విశాల భావాలను పరివ్యాప్తం చేయవలసిన అవసరమున్నది.

Updated Date - Apr 24 , 2025 | 12:02 AM