Share News

YSRCPs Persistent Attacks on Amaravati: అమరావతిపై అక్కసు వైసీపీకి కొత్త కాదు

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:57 AM

అమరావతి అనగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. అమరావతి నిర్మాణం పూర్తయితే చరిత్రలో చంద్రబాబు శాశ్వతంగా నిలిచిపోతారనే దుగ్ధ వైసీపీలో కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు సూపర్‌ సిక్స్‌ను అడ్డుపెట్టుకొని బతికారు...

YSRCPs Persistent Attacks on Amaravati: అమరావతిపై అక్కసు వైసీపీకి కొత్త కాదు

మరావతి అనగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. అమరావతి నిర్మాణం పూర్తయితే చరిత్రలో చంద్రబాబు శాశ్వతంగా నిలిచిపోతారనే దుగ్ధ వైసీపీలో కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు సూపర్‌ సిక్స్‌ను అడ్డుపెట్టుకొని బతికారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం సూపర్‌ సక్సెస్‌ కావడంతో డీలా పడిపోయిన స్థితిలో అధిక వర్షాలు వైసీపీకి ఆయుధంగా మారాయి. రాజధాని అమరావతి–వరదలు అంటూ నేడు కొత్త రాగం అందుకున్నారు. ప్రజారాజధాని అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి కొత్తమీ కాదు. అమరావతికి సంబంధం లేని ఫోటోలు చూపిస్తూ సోషల్‌ మీడియా వేదికగా రాజధాని మునిగిపోయిందంటూ దుష్ప్రచారం చేశారు. అయితే రాజధానిని సందర్శించిన అనేక మంది పరిశీలకులు, పాత్రికేయులు వెల్లడించిన విషయాలతో రాజధాని మునక వాస్తవం కాదని తెలుసుకొంటున్న ప్రజలు ‘ఎప్పుడూ కుళ్లు రాజకీయం ప్రదర్శించడమేనా?’ అంటూ వై‍సీపీని చీదరించుకుంటున్నారు. రాజధానిగా అమరావతి పేరును అసెంబ్లీలో ప్రతిపాదించినప్పుడు వర్షాలకు రాజధాని ప్రాంతం మునిగిపోతుందని కనీసం ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. పైగా నాడు ప్రతిపక్షనాయకునిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఆ తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా రాజధాని నిమిత్తం సేకరించిన 30వేల ఎకరాలు సరిపోవని, మరో 20వేల ఎకరాలు కూడా సమీకరించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేయడంతో అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై దాష్టీకం ప్రదర్శించడమే కాకుండా, అక్రమంగా కేసులు పెట్టారు. ఒక దశలో మూడు రాజధానులు లేవు.. ఉన్నది ఒకటే రాజధాని, అదే విశాఖపట్నం అంటూ కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల మాటలకు, చేతలకు విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమికొట్టారు. విశాఖపట్నం ప్రాంత ప్రజలు కూడా ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ అమరావతిపై అక్కసు ప్రదర్శించడం ప్రారంభించారు.


రాజధాని పరిధిలో ప్రస్తుతం సచివాలయ భవనాలున్న ప్రాం తాలలో చుక్క నీరు నిల్వలేదు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న హైకోర్టు, విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి విశ్వవిద్యాలయాలు యథావిధిగానే పనిచేశాయి. రాజధాని అమరావతి నగరం ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. 80 శాతం భూములు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. ఈ భూములలో ఏ కొద్దిపాటి వర్షం కురిసినా నీరు నిల్వడం సహజం. ఇలా నిలిచిన నీటిని చూపించి సోషల్‌ మీడియాలో లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా రాజధాని నగరాలలో రహదారులన్నీ సిమెంట్‌తో నింపివేస్తారు. దీంతో భారీ వర్షాలకు వచ్చిన నీరు ఎటూ పోయే అవకాశం లేక రోడ్లపైకి చేరుతుంది. పదేళ్ల క్రితం భారీ వర్షం నుంచి కోలుకోవడానికి ముంబాయి నగరానికి 10 రోజుల సమయం పట్టింది. రెండేళ్ల క్రితం చెన్నై నగరంలో అధిక వర్షంతో జన జీవనం మూడు రోజులపాటు స్తంభించి పోయింది. ఇక హైదరాబాద్‌ పరిస్థితి ప్రత్యక్షంగా మనందరికీ తెలిసిందే. ఉత్తరాదిలోని ఢిల్లీ, గురుగ్రామ్‌ వంటి నగరాలు భారీ వర్షం కురిసినప్పుడు అతాలకుతలం అవుతున్నాయి. ఈ విధంగా చెప్పుకొంటూపోతే ఏ నగరానికీ మినహాయింపు లభించదు. మద్యం కుంభకోణంతో వైసీపీ పీకల్లోతు అవినీతిలో మునిగిపోయింది. వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలలో ఆ పార్టీ నేతల నోటి దురద కూడా ఒకటి. 11 స్థానాలతో కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నప్పటికీ నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేయడం మాత్రం ఆ పార్టీ నేతలు మానలేదు. రాజధానిపై లేనిపోని విషప్రచారం చేస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించడం అవసరం. లేదంటే రాజధాని అభివృద్ధికి ఇటువంటి సోషల్‌ మీడియా ప్రచారాలు, విద్రోహుల చర్యలు అడ్డంకిగా మారతాయి.

-అన్నవరపు బ్రహ్మయ్య పాత్రికేయులు

Updated Date - Aug 30 , 2025 | 04:58 AM