Share News

రిజర్వేషన్లకు రాజకీయ రంగు ఎందుకు?

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:01 AM

తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్ల కల్పన ఒక గొప్ప సామాజిక లక్ష్యానికి దారిచూపే చర్య. ఇది ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర శాసనసభ, మండలిలో...

రిజర్వేషన్లకు రాజకీయ రంగు ఎందుకు?

తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్ల కల్పన ఒక గొప్ప సామాజిక లక్ష్యానికి దారిచూపే చర్య. ఇది ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర శాసనసభ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు. అయినప్పటికీ, ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందకముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయడం తగదు.

ఒకవైపు చట్టం తయారు చేస్తూ, మరోవైపు దాని అమలుపై తటస్థంగా ఉండటం... తరువాత దానికి విరుద్ధంగా కేంద్రాన్ని నిందించటం... ప్రజాస్వామ్య ధర్మానికి విరుద్ధం. గవర్నర్ ఆమోదం తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. బిల్లును అమలులోకి తీసుకురావాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి, రాజకీయ ఆరోపణల వైపు మళ్ళడం బాధాకరం. ఈ వ్యవహారంలో బాధ్యతను కేంద్రం మీదకు నెట్టడం రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యత నుంచి తప్పించుకోవడమే. అంతేకాకుండా, ఇది ప్రజల మధ్య అపోహలు పెంచే ప్రమాదం కలిగిస్తుంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పు వంటి అంశాలు చట్టం అమలులోకి వచ్చిన తరువాత మాత్రమే కేంద్ర ప్రభుత్వంతో చర్చించవలసినవి. చట్టానికి బలమైన న్యాయాధారాలు, సమగ్ర డేటా, నివేదికలు అవసరం. అవి లేకుండా ఏ ఇతర చర్యలకైనా వెళ్లడం సాంకేతికంగా ఇబ్బందికరం.


తెలంగాణలో బీసీల జనాభా సుమారుగా 56 శాతం పైనే. కానీ విద్యా, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్ 29 శాతం లోపే. అలాగే స్థానిక సంస్థలలో 21 శాతమే. ఈ అసమానతలకు నివారణగా 42 శాతం రిజర్వేషన్ల బిల్లు తేవడమేగాక, వాటిని చట్టబద్ధంగా అమలుచేయడమే లక్ష్యం కావాలి. కానీ రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేయకుండా, ప్రజలలో కేంద్ర ప్రభుత్వమే అడ్డంకి అనే అపోహలు కలిగించడం సమంజసం కాదు. ప్రజల చైతన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వక్రీకరించడం బీసీల చరిత్రలో జరిగిన అన్యాయాలకు మరో రూపమే అవుతుంది.

ఒక చట్టాన్ని న్యాయస్థానాల్లో నిలబెట్టాలంటే, శాస్త్రీయ డేటా, కమిషన్ నివేదికలు, సామాజిక పునర్వ్యాఖ్యలు తప్పనిసరి. ఈ విషయాన్ని ఇంద్రా సాహ్ని vs యూనియన్ ఆఫ్ ఇండియా (1992): 50శాతం గరిష్ఠ పరిమితి, మినహాయింపులకు మార్గం; కృష్ణమూర్తి vs యూనియన్ (2010): కమిషన్ నివేదికలు తప్పనిసరి; వికాస్ గవాళి (2021), రాహుల్ వాఘ్ (2023): డేటా లేకుంటే రిజర్వేషన్లు నిలవవు; IR కోయెలో vs తమిళనాడు (2007): 9వ షెడ్యూల్‌లో చట్టాలు కూడా కోర్టు పర్యవేక్షణలో ఉంటాయి; గౌరవ్ కుమార్ vs బిహార్ (2023): డేటా లేకుండా రిజర్వేషన్ చట్టం నిలవదు వంటి కీలక తీర్పుల ద్వారా స్పష్టమయింది.


తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం అనంతరం ఈ చట్టాన్ని తక్షణం అమలుచేయాలి. తరువాత డేటా ఆధారంగా పటిష్టంగా నిలబడేలా చేసి, ఆ పిమ్మట కేంద్రాన్ని ఆశ్రయించి 9వ షెడ్యూల్‌లో చేర్చే ప్రక్రియ ప్రారంభించాలి. గవర్నర్ ఆమోదం పొందకుండా అమలు ప్రకటనలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్‌ 243D ప్రకారం రాష్ట్రానికి స్థానిక రిజర్వేషన్లపై చట్టం చేసే అధికారం ఉంది. కానీ 9వ షెడ్యూల్‌లో చేర్పుపై ముందుగా చర్చించకూడదు.

బీసీలకు రిజర్వేషన్ అనేది దయకు పాత్రత కాదు. ఇది రాజ్యాంగ హక్కు. ప్రభుత్వాలు న్యాయబద్ధతను ప్రదర్శించాలి. బీసీ కమిషన్ నివేదికలు, కుల గణాంకాలు పబ్లిక్ డొమైన్‌లో పెడితే ప్రజల మద్దతు పెరుగుతుంది. అలాగే మహారాష్ట్ర, బిహార్‌లలో కోర్టులు డేటా లేకుండా తీసుకొచ్చిన రిజర్వేషన్లను కొట్టివేశాయి. తెలంగాణ ఈ తీర్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.

– వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

మాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 05:01 AM