Police Research: పోలీసులు ఎవరి కోసం పనిచేయాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:45 AM
రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతారని, తమ నియంత్రణలో లేని పనులు చేయడం వారికి కత్తిమీద సాములాంటిదని ‘ఇండియన్ పోలీస్ జర్నల్’ తాజా సంచికలో వచ్చిన ఒక వ్యాసం వ్యాఖ్యానించింది.
రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతారని, తమ నియంత్రణలో లేని పనులు చేయడం వారికి కత్తిమీద సాములాంటిదని ‘ఇండియన్ పోలీస్ జర్నల్’ తాజా సంచికలో వచ్చిన ఒక వ్యాసం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్’ (బీపీఆర్‌డీ) ఈ జర్నల్‌ను ప్రతి ఆరునెలలకోసారి ప్రచురిస్తుంటుంది. దాదాపు 72 శాతం మంది పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతారని, ఏది తప్పో, ఏది ఒప్పో ఆలోచించకుండా పనులు చేయాల్సి ఉంటుందని ఇది పోలీసుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఈ వ్యాసకర్తలు రాశారు. పోలీసులు తీసుకునే ప్రతి నిర్ణయమూ ఒక నైతిక యుద్ధంలాగా మారుతుందని, చట్టాన్ని అమలు చేయాలా లేక రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించాలా తేల్చుకోలేకపోతారని ఆ వ్యాసరచయితలు తెలిపారు. ‘మీరు అయిదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారు. కాని మేము అంతకంటే ఎక్కువ కాలం బాధ్యతల్లో ఉంటాం. రాజ్యాంగాన్ని కాపాడడం మా విధి’ అని ప్రభుత్వాధినేతలకు ధైర్యంగా చెప్పిన అధికారులు సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ కనపడకపోరు. రూల్ ఆఫ్ లా, ప్రాథమిక హక్కులను కాపాడేందుకు, రాజకీయ జోక్యాన్ని ఎదుర్కొనేందుకు, దర్యాప్తు నిజాయితీగా కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నించిన అధికారులు ఎందరో ఉన్నారు. అదే సమయంలో ఇందుకు విరుద్ధంగా చాలా సందర్భాల్లో పోలీసు అధికారులు పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తూ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తి అనేక దారుణాలకు పాల్పడిన సందర్భాలు కూడా మనకు ఎదురవుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులు గతంలో తాము చేసిన పాపాలకు సస్పెండ్ కావడం, విచారణను ఎదుర్కోవడం, శంకరగిరి మాన్యాలు పట్టడం మొదలైన పరిణామాలు సంభవిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు, వారిని భయభీతులను చేసేందుకు, మీడియాను నియంత్రించేందుకు, తమ వ్యక్తిగత కోరికలను తీర్చుకునేందుకు అధికార పార్టీ నేతలు పోలీసు యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకునే ఉదంతాలు గడచిన పది సంవత్సరాలుగా ఎక్కువైపోయాయి.
పార్లమెంట్ సభ్యులనే అరెస్టు చేసి చితకబాదేందుకు, గడచిన ప్రభుత్వాల హయాంలో జరిగిన పాపాలను కప్పిపుచ్చేందుకు, హార్డ్ డిస్క్‌ల వంటి సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు కూడా పోలీసులు వెనుకాడలేదు. ఒక వ్యక్తిని అరెస్టు చేసేందుకు అవసరమైన సాధారణ నిబంధనలను కూడా పాటించాలన్న విజ్ఞతను కోల్పోయి రాజకీయ బాస్‌లు చెబితే చాలు, తప్పుడు కేసులు బనాయించే విషయంలో నిర్విచక్షణగా, అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు చేసే నేరాలను విస్మరిస్తున్నారు. సామాన్యులపై హింసాత్మకంగా వ్యవహరించే పోలీసులు పలుకుబడిగల వారి పట్ల శీత కన్ను వేస్తున్నారు. గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘనలో భారత్ ముందువరుసలో స్థానం సంపాదించింది. ప్రజా ప్రయోజనాలకు, సుపరిపాలనకు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సి ఉండగా, దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడం దేశంలో రోజురోజుకూ ఎక్కువైపోతోంది. రాజకీయాలు, పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా నైతికత కోల్పోతున్నాయనడానికి ఈ సంఘటనలు ప్రత్యక్ష నిదర్శనం. నిజానికి గతంలో కూడా రాజకీయ ప్రయోజనాలకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు లేకపోలేదు. కాని అత్యంత కీలకమైన పరిస్థితుల్లోనే అలా జరిగేది. 2000లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టే విధంగా తరుణ్ తేజ్‌పాల్, అనిరుద్ధ్ బహల్ అనే ఇద్దరు జర్నలిస్టులు ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేరుతో కొన్ని సంచలనాత్మక వార్తలు రాశారు. ఈ జర్నలిస్టులు అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, మరికొందరు ఎన్డీఏ నేతలు, సీనియర్ సైనిక అధికారులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. దీనితో బంగారు లక్ష్మణ్ రాజీనామా చేశారు. వాజపేయి ప్రభుత్వం జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో పడింది. ఇదే సమయంలో ఈ కథనాలు రాసిన జర్నలిస్టులను హత్య చేస్తే ఆ పాపం కూడా వాజపేయి ప్రభుత్వంపై పడుతుందని, అంతర్జాతీయంగా సంచలన వార్తగా మారి మొత్తం ప్రభుత్వమే కుప్పకూలిపోతుందని పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్రపన్నింది. అప్పటికే 1993లో పీవీ హయాంలో ఐఎస్‌ఐకి ముంబైలో సీరియల్ పేలుళ్లకు పాల్పడిన చరిత్ర ఉంది.
దీన్ని నిర్వహించడంలో పాత్ర పోషించిన దావూద్ ఇబ్రహీం లాంటి వారు పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఇద్దరు జర్నలిస్టులను హత్య చేసే కుట్రలో ఈసారి బిహార్‌కు చెందిన మాఫియా నేత, ఆర్జేడీ పార్లమెంట్ సభ్యుడు షాబుద్దీన్ పాలుపంచుకుంటున్నారన్న విషయం సీబీఐ దృష్టికి వచ్చింది. షాబుద్దీన్ పేరు చెబితే అప్పుడు పోలీసులకే కాదు, అనేకమందికి సింహస్వప్నం. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను కొట్టి చంపించిన ఘనుడు షాబుద్దీన్. తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన మెజిస్ట్రేట్‌ను నిండు కోర్టులోనే హతమారుస్తామని హెచ్చరించినవాడు. నీరజ్‌కుమార్ అనే సీబీఐ జాయింట్ డైరెక్టర్ పాట్నా నుంచి ఢిల్లీ వస్తుండగా, షాబుద్దీన్‌ను విమానంలోనే చూశాడు. దీనితో ఢిల్లీలో స్పెషల్ పోలీసులకు వర్తమానం పంపించాడు. విమానం ఢిల్లీ చేరుకోగానే అతడ్ని అరెస్టు చేయాలన్నది నీరజ్ కుమార్ ప్లాన్. విచిత్రమేమంటే ఢిల్లీలో విమానం దిగిన తర్వాత అక్కడ ఢిల్లీ పోలీసులెవరూ కనిపించ లేదు. ఆరా తీస్తే షాబుద్దీన్‌ను ముట్టుకోవద్దని, నీరజ్ కుమార్‌కు సహకరించవద్దని ఢిల్లీలో రాజకీయ పెద్దలు చెప్పినట్లు తేలింది. ఈ విషయం గురించి తన పదవీ విరమణ తర్వాత నీరజ్ కుమార్ ‘ఖాకీ ఫైల్స్’ అనే పుస్తకంలోనే పూసగుచ్చినట్లు వివరించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన షాబుద్దీన్‌ను వాజపేయి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయకుండా అడ్డుకుంది? బిహార్‌లో అప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు స్థానిక రాజకీయనాయకులు షాబుద్దీన్‌తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారనీ, అదే అతడిని రక్షించిందని నీరజ్ కుమార్ రాశారు. తర్వాతి కాలంలో షాబుద్దీన్ అరెస్టు అయి, తిహార్ జైలులో మరణించాడు. అది వేరే సంగతి. షాబుద్దీన్ లాంటి ఓ మాఫియా డాన్ అటు ఆర్జేడీ రాజకీయ సమీకరణాలకు, ఇటు బీజేపీ రాజకీయాలకూ కూడా ఉపయోగపడడం, ఈ క్రమంలో పోలీసు అధికారులు నిస్సహాయ స్థితిలో పడడం భారత రాజకీయాల్లో వికృత పరిణామం. పప్పుయాదవ్, ఆనంద్ మోహన్, ముఖ్తార్ అన్సారీ, అతీఖ్ అహ్మద్‌తో పాటు అనేక మంది చట్టసభల్లో రాజ్యమేలారు. తానున్న వేదికపైనే మాఫియాడాన్‌లు ఉన్నారంటూ ఫైజాబాద్‌కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ గత ఏడాది ఆ సమావేశాన్ని బహిష్కరించి వార్తల్లో కెక్కారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో యూపీలో అనేకమంది మాఫియాడాన్ లను అంతం చేసినప్పటికీ బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు నేరచరితులకు చట్టసభల్లో స్థానం కల్పించాయని ‘అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. గత లోక్‌సభలో ఎన్నికైన 543 మందిలో 251 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. రాజ్యసభలో 36 శాతం మంది నేరచరితులే.
ఇవాళ అనేకమంది నేరచరితులైన రాజకీయనాయకులపై కేసులు ఏళ్లతరబడి కొనసాగేందుకు కేంద్ర సంస్థలు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు, దర్యాప్తు అధికారులు తమ పనులు తాము చేసేందుకు అనుమతిస్తే ఈ ఆరోపణలకు తావెక్కడుంటుంది? భారతీయ పోలీసులపై కేవలం 30 శాతం మంది ప్రజలకే విశ్వాసం ఉన్నదని లోక్ నీతి–సీఎస్‌డీఎస్ నిర్వహించిన సర్వేను ఇండియన్ పోలీసు జర్నల్ ఉటంకించింది. దాదాపు 42 శాతం మంది ప్రజలు పోలీసుల నిజాయితీని శంకిస్తున్నారని, పోలీసుల ప్రతి చర్యా ప్రజల దృష్టిని దాటిపోవడం లేదని తెలిపింది. ఈ విషయం తెలిసినందువల్లే అనేకమంది పోలీసులు మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారని, ఈ క్రమంలో భారతీయ పోలీసుల్లో ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయని ఈ జర్నల్ తెలిపింది. 2021లో 405 మంది పైగా పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డు చేసింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో పోలీసుల అత్యహత్యల సంఖ్య ఎక్కువ. 83 శాతం పోలీసులు తమ విధి నిర్వహణలో మానసిక ఆరోగ్య ప్రభావాలకు లోనైనట్లు 2024లో జరిగిన ఒక సర్వే పేర్కొంది. నిరంతర వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక కష్టాలు, తమ స్వంత వ్యవస్థ నుంచే మద్దతు లభించకపోవడం ఇందుకు కారణమని ఈ సర్వే తెలిపింది. ఇటీవల ఢిల్లీ పోలీసుల్లో వృత్తిపరమైన ఒత్తిళ్లపై కూడా ఒక సంస్థ శాస్త్రీయంగా సర్వే నిర్వహించింది. సిబ్బంది, వనరుల కొరత, పని పరిస్థితులు, సహచరుల నుండి మద్దతు లేకపోవడం, వ్యక్తిగత, సామాజిక జీవితం కోల్పోవడం, అలిసిపోవడం వల్ల అనేకమంది పోలీసులు ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు పేర్కొంది. అత్యధిక శాతం మంది డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి జబ్బులకు లోనయ్యారని గుర్తించింది. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు సమాజంలో శాంతి భద్రతలను సమర్థంగా కాపాడేలా చూడాల్సిన బాధ్యత రాజకీయ వ్యవస్థపై ఉన్నది. ఈ విధ్యుక్త ధర్మాన్ని విస్మరించి రాజకీయవేత్తలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకే పోలీసులను ఉపయోగించుకుంటే పోలీసులే కాదు, మొత్తం సమాజం మానసిక ఒత్తిళ్లకు గురికాక తప్పదు. గత కొద్ది సంవత్సరాలుగా చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా చూడడం తక్షణ కర్తవ్యం.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)