PM Kisan Scheme: పీఎం కిసాన్ రైతులందరికీ ఇవ్వాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:45 AM
భారతదేశంలో వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా సాయం
భారతదేశంలో వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా సాయం అందిస్తున్నా, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు పెట్టుబడి, సాగుకు అయ్యే ఖర్చు, శ్రమను తీసివేస్తే మిగిలేది చాలా తక్కువ. సకాలంలో వర్షాలు లేకపోవడం, ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి, నకిలీ విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర లేనప్పుడు చిన్న, సన్నకారు రైతులకు పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేకపోవడం, దళారీ వ్యవస్థ... మొదలైన కారణాల వల్ల రైతులకు వ్యవసాయం లాభసాటిగా లేదు. వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అంటూ సంక్షేమ పథకాలెన్ని తెచ్చినా క్షేత్ర స్థాయి అమలులో లోపాల వల్ల రైతులకు జరగాల్సిన న్యాయం జరగడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 నుంచి దేశంలో ఉన్న రైతులందరికీ భూ కమతం, విస్తీర్ణంతో సంబంధం లేకుండా, వ్యవసాయ అవసరాల నిమిత్తం ఏడాదికి ఆరువేల రూపాయల్ని మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇస్తోంది. అయితే 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులకు మాత్రమే ఈ సాయం అందుతోంది. ఆ తరువాత వ్యవసాయ భూమి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిన వారికి; వారసత్వంగా యాజమాన్య హక్కులు బదిలీ అయ్యి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన వారికీ ఈ సాయం అందట్లేదు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల్ని రైతులు సంప్రదిస్తే, పీఎం కిసాన్ సమ్మాన్ వెబ్‌సైట్‌లో కటాఫ్ తేదీ 2019 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉందని చెబుతున్నారు. కటాఫ్ తేదీ తర్వాత భూమి యాజమాన్య హక్కులు బదిలీ అయిన వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియదు.
తెలంగాణలో దాదాపు పది ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు 95 శాతమని ఏటా విడుదల చేసే తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర సగటు భూ కమతం 0.89 హెక్టార్లు (దాదాపు రెండు ఎకరాలు). తెలంగాణలో 70 లక్షల మంది రైతులున్నారు, వీరిలో ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు 63 లక్షల మంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ సాయం అందే రైతుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. 2020లో దాదాపు 37 లక్షల మంది రైతులు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉంటే, 2024 నాటికి అది 31 లక్షలకు తగ్గింది. భూమి యాజమాన్య హక్కులు బదిలీ కావడం, కొత్తగా పాసు పుస్తకాలు రావడం ఈ తగ్గుదలకు కారణం. కటాఫ్ తేదీని పెంచుతారని పలుమార్లు వార్తలు వచ్చినా ఆరేళ్లుగా పెంచలేదు. ఈ మధ్యే రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం పథకాల అమలులో సౌలభ్యం కోసం విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీని కోసం రైతులు తమ వివరాల్ని స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో నమోదు చేసుకోవాలి. తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతైనా కటాఫ్ తేదీని పెంచి, కొత్త రైతులకు అవకాశం కల్పించాలి. ఈ ఏడాది జనవరిలో పీఎం కిసాన్ సాయం పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బడ్జెట్‌లో దీని కోసం తగినన్ని నిధులు కేటాయించలేదు. ఏడాదికి ఆరువేల రూపాయలు, అదీ మూడు విడతల్లో అంటే రైతుల అవసరాలు ఎలా తీరుతాయి? ఈ సాయాన్ని ఏడాదికి రూ.12,000 వరకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలతో పోల్చితే రైతులకు చేసే సాయం చాలా స్వల్పం.
కరోనా మహమ్మారి విలయ తాండవం చేసినపుడు, 2020–21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక, సేవా రంగాల్లో తక్కువ వృద్ధిరేటు నమోదైంది. అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది వ్యవసాయ రంగమే. ఇప్పటికీ దేశ జనాభాలో సగభాగం వ్యవసాయంలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరి వల్లనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశానికి సరిపడా ఆహారధాన్యాలు అందుతున్నాయి. దీంతో పాటు బయటి దేశాలకు ఎగుమతి కూడా చేయగలుగుతున్నాం. అన్నం పెట్టే రైతులు చేసే వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తేనే దేశానికి శ్రేయోదాయకం.
– మంద అశోక్‌రెడ్డి, జనగామ