Share News

History of Iran: ప్రాచ్య–పాశ్చాత్య వారథి ప్రాచీన పర్షియా

ABN , Publish Date - Jun 20 , 2025 | 02:27 AM

పర్షియన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచపు అత్యంత ప్రాచీనమైన, ప్రభావవంతమైన నాగరికతలలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. పర్షియన్లు అంటే నేటి ఇరాన్ దేశ ప్రజలు.

History of Iran: ప్రాచ్య–పాశ్చాత్య వారథి ప్రాచీన పర్షియా

ర్షియన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచపు అత్యంత ప్రాచీనమైన, ప్రభావవంతమైన నాగరికతలలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. పర్షియన్లు అంటే నేటి ఇరాన్ దేశ ప్రజలు. ఇరాన్ భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో ఉన్నా, చరిత్రపరంగా ఇది ప్రాచ్య, పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యం, సంస్కృతి, తత్వవాదం, మతపర సహనానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప నాగరికతగా విలసిల్లింది. పర్షియా చరిత్ర క్రీ.పూ. 6వ శతాబ్దంలో సైరస్ మహారాజు ఆధ్వర్యంలో అఖేమెనిడ్ సామ్రాజ్య స్థాపనతో ప్రారంభమైంది. సైరస్ ధర్మపరుడు, న్యాయవాది, మానవహక్కుల పితామహుడిగా గుర్తింపు పొందాడు. అతని పాలనలో ధార్మిక స్వేచ్ఛ, ప్రజా సంక్షేమం వంటి విలువలకు ప్రాధాన్యం లభించింది. దరియస్, జెర్క్సిస్ వంటి రాజుల పాలనలో సామ్రాజ్యం మరింత విస్తరించి గ్రీకు, ఈజిప్ట్, భారత్ వరకు వ్యాపించింది. ఈశాన్య యూరోప్ వరకు విస్తరించిన ఈ సామ్రాజ్యం పరిపాలనా, న్యాయ, కౌశలాల పరంగా ప్రబలమైనదిగా చరిత్ర గుర్తించింది. పర్సెపోలిస్ వంటి నగరాలు శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి. పర్షియన్లు జొరాస్ట్రియన్‌ మతాన్ని అనుసరించేవారు. ఇది మంచి, చెడు మధ్య ధార్మిక యుద్ధాన్ని బోధించే తత్వవాద మతం. క్రీ.శ. 651లో సాసానియన్ సామ్రాజ్యం అరబ్బు ముస్లిం ఖలీఫా చేతిలో ఓడిపోయింది. ఇస్లాం పర్షియాలోకి ప్రవేశించడానికి ఈ ఓటమి మార్గం వేసింది. తరువాతి శతాబ్దాల్లో పర్షియన్ ప్రజలు ప్రధానంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఇస్లామీయ ధర్మశాస్త్రాల్లోని కరుణ, సమానత్వం, విద్యాభివృద్ధి, జ్ఞానప్రధానం వంటి అంశాలు పర్షియన్ తత్వవాదంతో కలిసి ఒక నూతన మానవతావాద సంస్కృతిని నిర్మించాయి. ఈ యుగంలో ఇబ్ను సినా, అల్–ఘజాలి, అల్–రాజీ వంటి గొప్ప తత్త్వవేత్తలు వైద్యం, తత్వం, మతం, న్యాయ రంగాల్లో అసాధారణ ప్రగతి సాధించారు. వారి రచనలు యూరోప్ దేశాల్లోకి ప్రవేశించి పునరుజ్జీవన యుగానికి దారితీశాయి. మత స్వేచ్ఛకు గౌరవం ఇచ్చే విధంగా జొరాస్ట్రియన్లు... క్రైస్తవులు, యూదులకు ‘ధిమ్మీ’ హోదా ఇచ్చి రక్షణ కల్పించారు. 1979లో సంభవించిన ఇస్లామిక్ విప్లవం ఆధునిక ఇరాన్ చరిత్రలో ఒక కీలక మలుపు. షా మహమ్మద్ రేజా పాలనను కూలదోసి, అయతుల్లా ఖోమేనీ నేతృత్వంలో దేశం ఇస్లామిక్ థియోక్రసీగా మారింది. అంటే, రాజ్యాధికారం పూర్తిగా మత నాయకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ విప్లవం తరువాత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, విద్యావ్యవస్థ, మహిళల హక్కులు... అన్నీ షరియత్ చట్టాల ఆధారంగా మతపరమైన పరిపాలనలోకి వెళ్లాయి. మత నియమాలు చట్టబద్ధంగా మారాయి. మహిళల దుస్తులపై, యువత జీవనశైలిపై, సాంస్కృతిక కార్యక్రమాలపై గట్టి నియంత్రణలు వచ్చాయి.


ఇరాన్–ఇరాక్ యుద్ధం (1980–1988)లో జిహాద్, షహీద్ వంటి మతపరమైన భావోద్వేగాలు అధికమయ్యాయి. సాంస్కృతిక పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలపై మత నియమాలను బలవంతంగా అమలుచేయటం ప్రారంభమైంది. ‘మతం ప్రమాదంలో ఉంది’ అనే ప్రచారంతో మత మౌలికవాదాన్ని నెమ్మదిగా బలపరిచారు. ప్రాచీన పర్షియా శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా విలువలను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఆధునిక ఇరాన్ మతమౌడ్యంలో చిక్కుకొని అభివృద్ధిలో వెనుకబడింది. ఇది కేవలం ఆ దేశానికే సమస్య కాదు, ప్రపంచ శాంతికి, మత సామరస్యానికి కూడా ముప్పుగా మారింది. పశ్చిమ దేశాలు ఒకప్పుడు ఈజిప్ట్, మెసపటోమియా, పర్షియన్‌ నాగరికత నుంచి ప్రేరణ పొందాయి. కానీ ఆ సౌందర్య సంస్కృతులే నేడు మత వైషమ్యం, అంతర్గత ఘర్షణల వల్ల తమ గొప్పతనాన్ని కోల్పోయాయి. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలయిన బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, తరువాత అమెరికా ప్రపంచవ్యాప్తంగా నెరపిన వలస పాలనలతో స్థానిక సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ధ్వంసమయ్యాయి. పశ్చిమ దేశాలు తమ ఆర్థిక స్వార్థం కోసం ప్రపంచంలోని అనేక జాతుల మధ్య దేశాల మధ్య వైరుధ్యాలు సృష్టించి నేటికీ యుద్ధాలు సాగిస్తున్నాయి. దానికి కొనసాగింపుగానే నేటి ‘ఇరాన్– ఇజ్రాయెల్’ యుద్ధాన్ని మనం చూడవచ్చు. ఇజ్రాయెల్ అనేది పశ్చిమ దేశాలు ఆడిస్తున్న పాత్రగానే మనం గుర్తించాలి. ప్రపంచ శాంతి కోసం మానవ మనుగడ కోసం ప్రతి దేశం కట్టుబడి ఉండేదాకా ప్రజలు పోరాడాలి. నేడు భారతదేశం లాంటి దేశాలు, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని, మతసహనం, శాస్త్రీయ దృక్పథం, తత్వవాదం, ఐక్యత వంటి విలువలను పరిరక్షించాలి. మతపరమైన విభజనలకి బలవకుండా, ప్రపంచ శాంతి కోసం నిలబడి, మానవ వికాసానికి దోహదపడే విధంగా అభివృద్ధి చెందాలి. మన చరిత్రను గౌరవించాలి. ఇతర సంస్కృతుల ఘనతను అర్థం చేసుకోవాలి. తద్వారా మన దేశాన్ని సమున్నత నాగరికత విలువల సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి.

-లెనిన్ కోగంటి కార్మిక నాయకులు,

టిఎన్‌టియుసి

Updated Date - Jun 20 , 2025 | 02:32 AM