Share News

Telangana Land Laws: స‌మ‌స్యలకు ప‌రిష్కారం చూపే భూభార‌తి

ABN , Publish Date - May 02 , 2025 | 07:10 AM

భూభార‌తి చ‌ట్టం ద్వారా భూ స‌మ‌స్య‌లకు శాశ్వ‌త‌మైన ప‌రిష్కారాన్ని అందించేందుకు ప్రభుత్వం నూత‌న చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జరిగింది. ఈ చ‌ట్టం ద్వారా భూ రికార్డుల స‌మ‌స్య‌లు, హ‌క్కుల స‌మ‌స్య‌లు సుల‌భంగా ప‌రిష్కారం పొందే దిశ‌లో ముందుకు వెళ్లింది.

Telangana Land Laws: స‌మ‌స్యలకు ప‌రిష్కారం చూపే భూభార‌తి

స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం రెండు ఆర్వోఆర్ చ‌ట్టాలు మాత్రమే వ‌చ్చాయి. 1948, 1971ల‌లో నాటి పాల‌కులు తెచ్చిన‌ ఈ చ‌ట్టాలు చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రస్తుతం భూ రికార్డుల‌కు ప్రామాణిక‌మైన ఖాస్రా పహాణి, షేత్వార్‌, సెసాల వంటివి 1948 చ‌ట్టం ద్వారానే రూపొందించారు. 1971చ‌ట్టం ద్వారా తెచ్చిన భూ రికార్డును తెలిపే 1–బి రిజిస్ట‌ర్‌ ఎంతో ఉపయోగకరం. 1948ఆర్వోఆర్ చ‌ట్టంలో స్వ‌ల్ప మార్పుల‌ను చేసి 1971 చ‌ట్టాన్ని రూపొందించారు. కొంత ఆల‌స్య‌మైనా చ‌ట్టాల‌కు అనుగుణంగా వాటికి రూల్స్‌ను కూడా రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. నాటి పాల‌కులు, అధికారులు ప్ర‌జ‌ల కోణంలో నుంచి ఆలోచించి తెచ్చిన చ‌ట్టాలు కావ‌డంతో అవి ప‌ది కాలాల పాటు ఉన్నాయి. ఈ చ‌ట్టాల అమ‌లుతో రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మైంది. కానీ ధ‌ర‌ణి–2020 చ‌ట్టం ఇందుకు పూర్తిగా భిన్నమైన‌ది.

ధ‌ర‌ణిలో ఎలాంటి రూల్స్‌ను రూపొందించ‌లేదు. ఇదే కాకుండా ఎలాంటి కొత్త రికార్డును త‌యారు చేయ‌లేదు. 1971 చ‌ట్టం ప్ర‌కారం హ‌క్కుల రికార్డుగా ఉన్న 1–బి రికార్డే ఇందులోనూ హ‌క్కుల రికార్డుగా కొన‌సాగింది. ధరణి పుణ్యమా అని గ్రామ‌, మండ‌ల స్థాయిలో అందాల్సిన సేవ‌లు జిల్లా, రాష్ట్ర రాజ‌ధానుల‌కు చేరాయి. రైతుకు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా సీసీఎల్ఏకు ప‌రుగులు తీయాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ధ‌ర‌ణిలో త‌ప్పుల స‌వ‌ర‌ణ‌కు రెవెన్యూ అధికారుల‌కు ఎలాంటి అధికారాలూ లేవు. అంతేకాదు, ఏ చిన్న భూ స‌మ‌స్య వ‌చ్చినా కోర్టు మెట్లెక్కాల్సిందే.

రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించే ల‌క్ష్యంతో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ నూత‌న చ‌ట్టం ‘భూమి హ‌క్కుల రికార్డు- 2025’ భూభార‌తి తీసుకొచ్చింది. నాటి పాల‌కులు ధ‌ర‌ణి అని పేరు పెడితే, నేటి పాల‌కులు భూభార‌తి అని పేరు పెట్ట‌కున్నారు అనుకోవ‌చ్చు. కానీ ఈ చ‌ట్టం కోసం దేశంలోని 18 రాష్ట్రాల్లో అమ‌లవుతోన్న ఆర్వోఆర్ చ‌ట్టాల‌ను అధికారులు అధ్య‌య‌నం చేశారు. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రెవెన్యూ చ‌ట్టాల్లో తేవాల్సిన మార్పులతో పాటు భూ సంస్క‌ర‌ణ‌ల‌పై కూడా ప్రభుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింది.


సామాన్య రైతుల‌కు అర్థమ‌య్యేలా, మ‌రోవైపు ఆధునిక టెక్నాల‌జీతో భూభార‌తి రూప‌క‌ల్ప‌న చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న భూ చ‌ట్టాల‌కు, ఆధునిక టెక్నాల‌జీకి అనుసంధానంగా ఉండేలా భూభార‌తిని తీర్చిదిద్దారు. గ‌త ప్ర‌భుత్వం సాదా బైనామాలను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తామ‌న‌డంతో సుమారు 10 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులొచ్చాయి. కానీ ధ‌ర‌ణిలో సాదా బైనామాల క్ర‌మ‌బద్ధీక‌ర‌ణ‌కు అవ‌కాశం లేదు. ఇదే కాకుండా 2017లో చేసిన‌ భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న స‌మ‌యంలో వివిధ ర‌కాల భూ స‌మస్యలున్న సుమారు 18 ల‌క్ష‌ల ఎక‌రాల భూమిని ‘పార్టు-–బి’లో చేర్చి వ‌దిలేశారు. అవి కూడా ధ‌ర‌ణికి దూర‌మ‌య్యాయి. ఇవే కాకుండా అసైన్డ్ భూముల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, ఇనాం భూముల‌కు ఓఆర్‌సీ పొందిన, వార‌స‌త్వంగా వ‌చ్చిన భూముల‌ను సైతం ధ‌ర‌ణిలో చేర్చే అవ‌కాశం లేదు. భూభార‌తిలో ఇలాంటి అన్ని ర‌కాల స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం ల‌భించ‌నుంది. వీటికి కావాల్సిన విధి విధానాల‌ను కూడా భూభార‌తిలో రూపొందించారు. జూన్ 2, 2014 కంటే ముందు సాదా బైనామా ప‌ద్ధతిలో భూమిని కొనుగోలు చేసి, క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్డీఓ స్థాయిలో విచార‌ణ చేసి ఈ భూభారతి ద్వారా ప‌ట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వనున్నారు. వార‌సత్వంగా వ‌చ్చిన భూముల‌కు త‌హ‌సీల్దార్ స్థాయిలోనే విచార‌ణ చేసి హ‌క్కుల రికార్డులో మ్యుటేష‌న్ చేయ‌నున్నారు. ఇదే త‌ర‌హాలో హ‌క్కుల రికార్డులో త‌ప్పుల స‌వ‌ర‌ణ‌కు కూడా ఆర్డీఓ, జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అధికారం ఇచ్చారు.

భూభార‌తిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లు, జారీ చేసిన పాసు పుస్తకాలు, భూదార్‌పై అభ్యంతరాలు ఉంటే ఆర్జీవోకు అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఆర్డీవో ఇచ్చిన తీర్పుపై జిల్లా కలెక్టర్‌కి రెండో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా క‌ల్పించారు. ఆర్డీవో చేసిన మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్ తీర్పుపై భూమి ట్రిబ్యునల్‌కు రెండో అప్పీల్‌కు కూడా పోయేలా భూభార‌తిలో అవ‌కాశాన్ని కల్పించారు.


ధ‌ర‌ణిలో ద‌గాప‌డిన వారికి భూభార‌తిలో అనేక వెసులుబాట్లు క‌ల్పించారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి ఏడాది పాటు అవ‌కాశం ఇచ్చారు.ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తే, దాన్ని విచారించి పాసు పుస్తకం రద్దు చేసే అధికారం సీసీఎల్ఎకు ఇచ్చారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు తహసీల్దార్, సంబంధిత అధికారులపై శాఖాపర‌మైన చ‌ర్య‌లతో పాటు క్రిమినల్ కేసుల‌ను కూడా బ‌నాయించే అవ‌కాశం ఉంటుంది. ఇదే కాకుండా రికార్డులను ట్యాంపర్ చేసినా, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినా అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. అవ‌స‌ర‌మైతే వారిని సర్వీసు నుంచి తొలగించే ప్ర‌మాదం కూడా ఉంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భూ స‌మ‌స్య‌ల‌కు సంబంధించి పేదలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు న్యాయ సేవా సంస్థలు, ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందించ‌నున్నారు. భూభార‌తి చ‌ట్టంతో పాటు ఏకకాలంలో రూల్స్‌ను కూడా తెచ్చి ప్ర‌భుత్వం మంచి ప‌ని చేసింది. ఇదే విధంగా రెవెన్యూ ట్రిబ్యున‌ల్స్‌ను కూడా మూడంచెల‌ల‌లో ఏర్పాటు చేస్తే భూభార‌తి ల‌క్ష్యం నూరు శాతం నెర‌వేర‌నుంది. ప్ర‌భుత్వం వెంట‌నే ఆ దిశ‌గా ఆలోచ‌న చేస్తే సివిల్ కోర్టుల‌తో సంబంధం లేకుండా జిల్లా స్థాయిలోనే అన్ని ర‌కాల సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

-ఎన్‌. యాద‌గిరిరావు

అద‌న‌పు క‌మిష‌న‌ర్‌, జీహెచ్ఎంసీ

Updated Date - May 02 , 2025 | 07:11 AM