Share News

Telugu Poet Vemuganti Murali: రక్తం చుక్కల పొద్దు

ABN , Publish Date - May 05 , 2025 | 02:26 AM

ఈ కవితలో యుద్ధ విపరీతతను, మానవత్వం విలువను స్పష్టంగా వెలుగులోకి తీసుకొచ్చారు. శాంతిని కోరుకుంటూ, కన్నీటి నిశ్శబ్దంలో నుంచి వాస్తవాలను ఎదుర్కొనాలంటున్నారు.

Telugu Poet Vemuganti Murali: రక్తం చుక్కల పొద్దు

హిమ హితులారా మీదొక పెదవి మాదొక పెదవి విప్పి శాంతిని గురించి మాట్లాడుదాం

రాజ్యం ఆయుధం పట్టుకొనే శాంతి అంటున్నది అయినా సరే మనం కన్నీళ్లు దోసిట్లో పట్టుకొని మాట్లాడుదాం

రక్తం చుక్కల పొద్దును ఎవరు కోరుకుంటారు యత్రికులైన, వ్యాపారులైన సుందరమైన మధ్యాహ్నం కొండచరియ విరిగినట్టు మనుషులు శవాలై రాలుతారని ఎవరు ఊహించగలరు దుఃఖం ఎవరిదైనా దుఃఖమే చంపిన చేతుల వెనక కుట్రను పసిగట్టి నిలదీయాల్సిందే

జీలంతో ముడిపడ్డ జీవితాలు రోజూ చెమట చుక్కల నిశ్శబ్దాన్ని ప్రేమిస్తాయి తూటాల శబ్దాన్ని కాదు

ఒరిగిన దేహాల సాక్షిగా మనమందరం నిర్లిప్త మానవ రూపాలమై సంచరిస్తున్నందుకు సిగ్గుపడుతూనే ఆ మట్టిపొరల్లో దాక్కున్న పురా దుఃఖాన్ని విందామా ఇప్పుడైనా

కరగడం బాగా తెలిసిన నేల అది కన్నీటిని దేవదారు బెరళ్లకింద దాచి నవ్వుతున్నట్టు కొమ్మల్ని కదుపుతున్నది చూడండి

నదంత సృజనశీలి ఉందా ఈ ప్రపంచం మీద పారే రక్తం ఎవరిదైనా రెండు చేతులతో దశాబ్దాలుగా శుభ్రపరుస్తూనే ఉన్నది శవాలని భుజంమీద మోస్తూనే ఉన్నది

ఆరిపోయిన వెలుతుర్లో శవాలైన జంటలు కుంకుంపువ్వు రహస్యాల్ని విప్పిచెబుతున్నాయి కొంచెం చెవుల్ని తడిచేసుకొని విందాం

-వేముగంటి మురళి

Updated Date - May 05 , 2025 | 02:29 AM