Share News

Panchayats democracy rural: ప్రజాస్వామ్యానికి పునాదిగా పంచాయతీలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:53 AM

పంచాయతొచ్చిందిరా పల్లోడా పల్లెకే విలువొచ్చెరా పల్లోడా, పట్టణాలకు పల్లె పోటీగా నిలువాలే అభివృద్ధిలో ముందు అడుగులే వెయ్యాలే, కూలికే..

Panchayats democracy rural: ప్రజాస్వామ్యానికి పునాదిగా పంచాయతీలు

పంచాయతొచ్చిందిరా పల్లోడా–పల్లెకే విలువొచ్చెరా పల్లోడా, పట్టణాలకు పల్లె పోటీగా నిలువాలే–అభివృద్ధిలో ముందు అడుగులే వెయ్యాలే, కూలికే తిరుగొద్దురా పల్లోడా–కూటికె ఇక కరువొద్దురా పల్లోడా, నీ ఊరి బాగోగు నీవే చూడాలెరా–నీ ఊరి మంచిచెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకొచ్చెరా పల్లోడా–భారీ హక్కే వొచ్చెరా పల్లోడా’ అంటూ తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్‌ జిల్లాకు చెందిన కవి, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ 1958లోనే పంచాయతి ప్రాముఖ్యాన్ని గేయ రూపంలో చాటారు. రాష్ట్రంలో పంచాయతి ఎన్నికల వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో గ్రామాల పరిస్థితిని అవలోకనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చినా, మౌలిక సదుపాయాల్లో ఒకడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి వేసింది. మద్యానికి దూరంగా ఉండటం, అక్షరాస్యత, పరిశుభ్రత, స్వచ్ఛత, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం ద్వారా గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ధ్వంసమైన గ్రామీణ వ్యవస్థను పునరుజ్జీవింప చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. దేశాభివృద్ధికి వెన్నెముక అయిన వ్యవసాయం నడుములు ఇరిగినాయి. వృత్తులు అంతరించిపోయినాయి. చెరువులు కబ్జాలపాలయినాయి. రియల్‌ ఎస్టేట్‌ భూతం కంచెలు వేసి కరాళ నృత్యం చేస్తోంది. చెరువులను చెరబట్టారు. నల్లతుమ్మలు, నల్ల మేకలు, నల్లగొంగడి టార్చిలైట్‌ వేసి వెతికినా కనిపిస్తలేవు. అదే దారిలో తాటి, ఈత వనాలు కనుమరుగైనాయి. కుటీర పరిశ్రమల స్థానంలో విదేశీ కాలుష్య పరిశ్రమలు వచ్చి గ్రామాలను సర్వనాశనం చేస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం పేరుతో వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థను, గ్రామీణ ఉపాధిని విధ్వంసం చేశారు. పచ్చని పల్లెల్లో కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటుతో ఏటా గ్లోబల్ వార్మింగ్‌కు కారణం అవుతోంది. ప్రకృతి విధ్వంసం అవుతోంది.


తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తొలుత పంచాయితీల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. లోకల్‌ పన్నులు గ్రామ పంచాయతీలకే చెందాలి. ఐదవ షెడ్యూల్‌ అమలవుతున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మేండాలేక వంటి గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ గ్రామంలో పంచాయతీరాజ్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న తీరు, గ్రామీణ వ్యవస్థకే ఆదర్శం. గ్రామంలో అధికారం గ్రామీణులదే. రాష్ట్ర ప్రభుత్వ అధికారం, జిల్లా కలెక్టర్‌ అజమాయిషీ చెల్లదు. గ్రామపంచాయతీ అనుమతి లేనిదే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా ఆ గ్రామంలో అడుగుపెట్టలేరు. గ్రామసభ తీర్మానం మేరకు పరిపాలన సాగాలి అని పంచాయతీరాజ్‌ చట్టం స్పష్టంగా పేర్కొంది. కానీ, తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఐదవ షెడ్యూల్ అమలు అటకెక్కింది. పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను పట్టించుకోవడం లేదు. పలు కమిటీల సిఫారసుల మేరకు ఎట్టకేలకు 1993లో 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా దక్కింది. 1993, ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం పొంది, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న ‘పంచాయతీరాజ్ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్మాణంతో పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా మారింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయి, జిల్లా స్థాయి అనే మూడు అంచెలను ఏర్పరిచారు. గ్రామ స్థాయిలో సభ్యులను ప్రజలు తమ ఓటు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మండల స్థాయి చైర్‌పర్సన్‌, జిల్లాస్థాయి చైర్‌పర్సన్‌ను మాత్రం పరోక్షంగా ఎన్నుకుంటారు.


పంచాయతీ సంస్థల కాలపరిమితిని 5 సంవత్సరాలుగా నిర్దేశించారు. ఏ కారణంతోనైనా అర్ధంతరంగా రద్దుచేస్తే తిరిగి 6 నెలల లోపు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించి నూతన పంచాయతీని ఏర్పాటుచేయాలి. జనాభా దామాషా ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, తెగల జనాభాను బట్టి రిజర్వేషన్లను కల్పిస్తారు. అదేవిధంగా మహిళలకు మొత్తం సభ్యుల స్థానాలు, ఛైర్‌పర్సన్ స్థానాల్లో 1/3వ వంతు తక్కువ కాకుండా రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం ఆయా రాష్ట్రాల విచక్షణకు వదిలేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సర్కార్‌ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ముందడుగు వేయడం బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడమే అవుతుంది. దీని అమలుకు ఏ మేరకు చిత్తశుద్ధి చూపుతుంది అనేదే అసలు ప్రశ్న. తెలంగాణలో గ్రామీణ నాగరికత పునర్వికాసం చెందాలంటే, ముచ్చర్ల సత్తెన్న పంచాయతి యావత్‌ తెలంగాణ పంచాయతి కావాలి. నగరపాలిక, గ్రామపాలిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. సమైక్యాంధ్రలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ధ్వంసమైన గ్రామీణ కుటీర పరిశ్రమలు తిరిగి తెరుచుకోవాలి. పారిశ్రామిక పునరుజ్జీవం జరగాలి. గ్రామాల్లోని గొలుసుకట్టు చెరువులు జలకళతో తిరిగి శోభిల్లాలి. బోసిపోయిన చెరువుకట్టల మీద నల్ల తుమ్మలు వికసించాలి. పంట పొలాలు పచ్చగా మారాలి. పట్టణాలకు వలసపోయిన ప్రజలు వెనక్కి పల్లెబాట పట్టాలి. పల్లెల్లో కరువును పారదోలడానికి కదురు, కవ్వం, కర్రు కదులుతూనే ఉండాలి.

-కౌడె సమ్మయ్య జర్నలిస్టు

Updated Date - Aug 19 , 2025 | 06:04 AM