పంచాయతీ కార్యదర్శుల పనిభారం పట్టించుకోరేం!
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:57 AM
పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన విధి నిర్వహణ బాధ్యతలను పంచాయతీరాజ్ – గ్రామీణ అభివృద్ధి శాఖ 18.5.2007లో నిర్దేశించింది. గ్రామ సచివాలయ ఏర్పాటు తదుపరి...

పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన విధి నిర్వహణ బాధ్యతలను పంచాయతీరాజ్ – గ్రామీణ అభివృద్ధి శాఖ 18.5.2007లో నిర్దేశించింది. గ్రామ సచివాలయ ఏర్పాటు తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు నెంబరు 149, 30.9.2019 ద్వారా గ్రామ సచివాలయ కార్యదర్శుల బాధ్యతలను నిర్దేశించింది. సదరు జాబ్ చార్ట్ ప్రకారం ప్రతి కార్యదర్శి 27 అంశాలకు సంబంధించిన విధులు నిర్వహించాలి. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు రాష్ట్రంలో 70శాతం గ్రామీణ ప్రజలు అందరికీ నేరుగా సేవలు అందిస్తూ మోయలేని పని భారాన్ని మోస్తున్నప్పటికి కొంతమంది ఉన్నతాధికారులు అసలు పంచాయితీ కార్యదర్శులకు ఏమి పని ఉంది అని అవహేళన చేస్తూ మాట్లాడడం బాధాకరం.
గ్రామపంచాయతీ కార్యదర్శులు నిర్వహించే విధుల్లో కొన్ని మాత్రమే: రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణ పనులు; రక్షిత మంచినీటి సరఫరా పనులు; రోడ్లు డ్రైన్‌ల నిర్వహణ; వీధి దీపాల నిర్వహణ; స్మశాన వాటికల నిర్వహణ; జనన మరణ వివాహ రిజిస్ట్రార్; ఆర్టీఐ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్; గ్రామ సచివాలయం డిడిఓ; గ్రామ సచివాలయం కన్వీనర్; గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక ఫెసిలిటేటర్; పంచాయితీ ఆస్తుల కస్టోడియన్ ఆఫీసర్; ఆక్రమణలు అడ్డగింపు, ఆక్రమణలు తొలగింపు; అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు నియంత్రించడం; నిబంధనలకు లోబడి భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం; హైకోర్టు, లోకాయుక్త కేసులు నిమిత్తం కౌంటర్లు సమర్పించడం; గ్రామ పంచాయితీ సమావేశాలు నిర్వహించడం; కార్యాచరణ కమిటీలు ఏర్పాటు; చట్టపరమైన గ్రామ సభలు నిర్వహించడం; లబ్ధిదారులను గుర్తించడం; సంక్షేమ పథకాలు అమలు పరచడం; గ్రామ పంచాయితీ తీర్మానాలు అమలుపరచడం; మహిళ, బాల, వృద్ధుల ప్రత్యేక గ్రామ సభలు; ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సమావేశాలు నిర్వహించడం... ఇవేగాక ఇంకా ఎన్నో లెక్కకు మిక్కిలి బాధ్యతలను భరిస్తున్నారు. అదనంగా గ్రామ సచివాలయం పనులు సైతం పంచాయితీ కార్యదర్శిపై మోపుతున్నారు. వారు అవీ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా కార్యదర్శులు ఇటు ఉద్యోగ ధర్మం, వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ తీవ్ర పని ఒత్తిడికి గురి అవుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ సచివాలయం పనుల నుంచి పంచాయితీ కార్యదర్శులను తప్పించాలి. వారిని మాతృశాఖ అయిన పంచాయితీరాజ్ శాఖ పనులకే పరిమితం చేయాలి. ఒకవేళ ప్రభుత్వం వారు ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు నిర్వహించే అన్ని విధులు వారి చేతే చేయించాలనుకుంటే అధిక సిబ్బందిని మంజూరు చేయాలి. అంతేగాక పంచాయతీ కార్యదర్శులకు అదనంగా 20శాతం బేసిక్ పే మంజూరు చేయాలి. పదోన్నతుల విషయంలో ఇప్పుడున్న విధానం ప్రకారం గ్రేట్ ఫోర్ పంచాయతీ కార్యదర్శి తన జీవితకాలంలో పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్–1 హోదా దాటి పదోన్నతి పొందే అవకాశం కనుచూపుమేరలో కనిపించదు. కావున పంచాయతీల సెక్రటరీ కేటగిరీలో నేడున్న గ్రేడ్లను రద్దుచేయాలి. అందుకుగాను ప్రభుత్వం వారు ప్రతి ఏడు సంవత్సరాల సర్వీస్ చేసిన గ్రేడ్–4 కార్యదర్శి నుంచి పై గ్రేడులలో ఉన్న కార్యదర్శులకు ఆటోమేటిక్ పదోన్నతి, వేతనం స్థిరీకరణ జరపాలి. మొదటి రెండు గ్రేడులలోని పంచాయతీలలో పనిభారం ఎక్కువ కాబట్టి సదరు పంచాయతీలలో ఆదనపు పంచాయతీ కార్యదర్శి పోస్టులు మంజూరు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పంచాయతీ కార్యదర్శుల ఇబ్బందులను అర్థం చేసుకొని తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.
టి.యం.బి. బుచ్చిరాజు
ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్
For AndhraPradesh News And Telugu News