Pahalgam Terror Attack: రగులుతున్న ప్రతీకారం
ABN , Publish Date - Apr 25 , 2025 | 05:35 AM
పహల్గాం ఉగ్రవాద ఘోరం భారత దేశాన్ని కుదిపేస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిలిపి, ప్రతీకార చర్యలు తీసుకోవడంతో పాటు, పాకిస్థాన్ మద్దతు చేస్తున్న సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో హెచ్చరిక చేశారు
పహల్గాంలో ఉగ్రవాదుల మారణకాండ దేశాన్ని కుదిపేస్తున్నది. ఆవేదనతోనూ, ఆగ్రహంతోనూ న్యూస్ చానెళ్ళలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రతీకారేచ్ఛతో ఊగిపోతోంది. అనుచిత వ్యాఖ్యలు, ఉచితసలహాలు, ఫేక్ విడియోలతో సామాజికమాధ్యమాలు నిండిపోతున్నాయి. జరిగిన ఘోరానికి ప్రతిస్పందన ఏ విధంగా, ఏ స్థాయిలో ఉండాలన్నది పాలకులు నిర్ణయించాల్సిన అంశం. ప్రజాగ్రహం అర్థంచేసుకోదగినదే కానీ, వారి చర్యలూ చేష్టలూ ఒత్తిడిపెంచేందుకు దోహదం చేయకూడదు. సౌదీ అరేబియాలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, ఈ ఘోరం జరిగిన విషయం తెలియగానే పర్యటనను కుదించుకొని భారతదేశానికి చేరుకున్నారు. కార్యాలయానికో, నివాసానికో చేరేవరకూ ఆగకుండా విమానం నేలూనగానే విమానాశ్రయంలోనే ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులతో సమావేశాన్ని నిర్వహించారు. గురువారం బిహార్‌లో ప్రసంగిస్తూ ఉగ్రవాదులను, వారిని వెనకేసుకొస్తున్నవారిని ఏ రీతిన శిక్షిస్తామో, ప్రపంచపు అంచులవరకూ ఎలా తరిమికొడతామో ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఈ కీలకమైన రాష్ట్రాన్ని ప్రధాని తన హెచ్చరిక సందేశానికి వేదికగా ఎంచుకోవడమేమిటని కొందరి అభ్యంతరం. అయితే, హిందీలో ధాటీగా ప్రసంగిస్తున్న ప్రధాని మధ్యలో ఇంగ్లిష్‌లోకి మారి ఆ నాలుగుమాటలు చెప్పడం ప్రపంచానికంతటికీ తన సందేశం చేరాలన్న లక్ష్యంతోనే. రాబోయే రోజుల్లో ఏ చర్యలుంటాయో తెలియదుగానీ, ఇప్పటికే కొన్ని తక్షణ ప్రతీకార చర్యలైతే ప్రభుత్వం తీసుకుంది. సరిహద్దుల మూసివేత, దౌత్యసంబంధాల కుదింపు ఇత్యాదివాటికి తోడుగా, సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థాన్‌కు పెద్ద హెచ్చరికే చేసింది. ఆరుదశాబ్దాలక్రితం ఆవిర్భవించిన ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చాలా ఒప్పందాలకు స్ఫూర్తి. అయితే, ఈ మనం నిర్మించిన కిషన్‌గంగ, రాత్లె విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్థాన్ అభ్యంతరపెడుతున్న తరుణంలో, ఈ ఒప్పందాన్ని పునఃస్సమీక్షించుకుందామంటూ భారత్ ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ, మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందానికి మొదటినుంచీ అనుకూలంగా లేని తరుణంలో, పహల్గాం ఘటన జరిగింది. ఇప్పుడు ఒప్పందాన్ని నిలుపుదల చేయడం ద్వారా తక్షణమే పాకిస్థాన్‌ను శిక్షించలేకపోవచ్చును గానీ, ఒక బలమైన హెచ్చరిక చేసినట్టయింది.
ఇప్పటికైతే ఇండస్, ఝీలమ్, చీనాబ్ నదులమీద భారీ డ్యాములేమీ లేవు కనుక, దిగువకు పోయే నీటిని అడ్డుకోవడం సాధ్యం కాదు. కానీ, 80శాతం సింధుజలాలకు ఈ మూడునదులే కారణం కనుక, వాటిని నియంత్రించగలిగినపక్షంలో తాగు, సాగునీటికి, విద్యుదుత్పత్తికీ పాకిస్థాన్ కటకటలాడక తప్పదు. ఈ సంక్లిష్టమైన ప్రాంతంలో, భారీ ఆర్థిక కేటాయింపులతో, ఓ నాలుగేళ్ళపాటు శ్రమించి ప్రాజెక్టులు కట్టగలిగితే పాకిస్థాన్‌ను ఇబ్బందిపెట్టాలన్న లక్ష్యం నెరవేరుతుందని నిపుణుల అంచనా. ఇక, ఒప్పందం ప్రకారం మనం వినియోగించుకోగలిగే జలాలు కూడా పాకిస్థాన్‌కు పోతున్న నేపథ్యంలో వాటిని రావి, బియాస్ లేదా సట్లెజ్‌లోకి మళ్ళించేందుకు ఈ సందర్భంగా ప్రయత్నం చేయవచ్చు. అఖిలపక్ష సమావేశంలో ఇంటలిజెన్స్ వైఫల్యం, కీలకమైన ప్రాంతాల్లో కెమెరాలు లేకపోవడం, సమాచారలోపం, వేలాదిమంది సైనికులు ఉన్నా యాభైమందిని కాపాడలేకపోవడం ఇత్యాదివి విపక్షాలు ప్రస్తావించినప్పటికీ, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఇక, పాకిస్థాన్ ప్రకటించిన ప్రతీకార చర్యల్లో సిమ్లా ఒప్పందం రద్దు ప్రధానమైనది. 1971నాటి భారీయుద్ధం అనంతరం మరుసటి ఏడాది జుల్ఫికర్ అలీ భుట్టో, ఇందిరాగాంధీ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలు అతుకుపడేందుకు ఉపకరించింది. ఉభయదేశాల మధ్య తలెత్తే ఘర్షణలు, సమస్యలు, వివాదాలు చర్చలద్వారా, పరిష్కారం కావాలని ఈ ఒప్పందం ఆకాంక్షిస్తోంది. కశ్మీర్ గురించి పాకిస్థాన్ మాట్లాడినప్పుడల్లా భారత్ ఈ ఒప్పందం వల్లనే గట్టిగా కొట్టిపారేయగలుగుతోంది. జమ్మూకశ్మీర్‌లో అధీనరేఖను గుర్తించడానికి కూడా ఇది ప్రాతిపాదిక. కొన్ని ఆదర్శాలు అటకెక్కిపోవడం, అడపాదడపా ఉల్లంఘనలను అటుంచితే, ఈ ఒప్పందం రద్దుకావడం కశ్మీర్ సహా చాలా అంశాలను సమస్యాత్మకంగా మార్చవచ్చు. పహల్గాం దారుణం ఇప్పటికే దిగజారిన భారత్–పాక్ సంబంధాలను ప్రమాదంలో పడవేసింది. రాబోయే రోజుల్లో దౌత్య, సైనికపరమైన సంక్షోభాలు అనేకం చూడవలసి రావచ్చు.