Share News

Operation Sindoor: సాంత్వననివ్వని క్వాడ్‌

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:19 AM

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాతికమంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపివేసిన ఘటనను క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం ఖండించినందుకు సంతోషించాల్సిందే.

 Operation Sindoor: సాంత్వననివ్వని క్వాడ్‌

మ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాతికమంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపివేసిన ఘటనను క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం ఖండించినందుకు సంతోషించాల్సిందే. ‘ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను క్వాడ్‌ ఖండిస్తుంది,ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మా సహకారం ఉంటుంది, ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిపై త్వరగా దర్యాప్తు పూర్తిచేసి, నేరస్థులనూ వారిని ప్రోత్సహించేవారినీ శిక్షించాలి’ అని ఆ ప్రకటన పేర్కొంది. అమెరికాలో జరిగిన ఈ సమావేశంలో భారతవిదేశాంగమంత్రి జయశంకర్‌ ప్రసంగిస్తూ, పహల్గాం ఉగ్రదాడి, అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి లోతుగా వివరించారు. ఉగ్రవాదులనుంచి తన ప్రజలను రక్షించుకొనే హక్కు భారత్‌కు ఉన్నదన్న భారత్‌ వాదనను క్వాడ్‌ భాగస్వాములు అర్థంచేసుకున్నారంటూ ఆయన కృతజ్ఞతలు కూడా తెలియచేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపింది నేనేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అదేపనిగా అంటున్నప్పటికీ, భారత్‌ ప్రతీకారదాడిని క్వాడ్‌ దేశాలు మౌనంగా ఆమోదించాయనే అనుకుందాం. అయితే, పహల్గాం దాడికి కారకులైనవారినీ, ఆ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నవారినీ శిక్షించాలన్న ఓ సాధారణ వ్యాఖ్యతో ఖండనను సరిపెట్టడం మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులకు నచ్చడం లేదు. ఉగ్రదాడి కారకులూ, ప్రోత్సాహకులు ఎవరో తెలిసికూడా, శిక్షపడాల్సినవారూ శిక్షించాల్సినవారూ కలసి చేసిన కుట్ర ఇది అన్న గుర్తింపు ఉండి కూడా పాకిస్థాన్‌ పేరు క్వాడ్‌ ప్రస్తావించకపోవడం సరికాదని వారి అభిప్రాయం.


బాధితులనూ, నేరస్థులనూ సమానంగా చూడకండని అంతగట్టిగా బల్లగుద్దిన విదేశాంగమంత్రి, పహల్గాం ఉగ్రఘాతుకాన్ని ప్రస్తావించి, ఖండించినందుకే సంతోషపడటం రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనామీద ఎన్నడూ లేనంతగా విరుచుకుపడిన ఆ సంయుక్త ప్రకటనలో, పహల్గాంతో ముడిపడిన పాక్‌ ప్రస్తావన కూడా కాస్తంత స్పష్టంగా ఉండివుంటే మరింత బాగుండేది. ఇది సీమాంతర ఉగ్రవాదం, పాకిస్థాన్‌ నుంచి చొరబడిన టెర్రరిస్టులు పర్యాటకులమీద ఈ దారుణానికి ఒడిగట్టారని భారత్‌ ప్రపంచానికి స్పష్టంగా చెబుతోంది. ఈ మధ్యనే జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సివో) సదస్సులో పహల్గాం ప్రస్తావన చేయనందుకు భారత్‌కు ఆగ్రహం కలిగింది. బలూచిస్థాన్‌ రైలుదాడి ఘటనను ప్రస్తావించి, పహల్గాం ఊసెత్తనందుకు అవమానం కూడా మిగిలింది. పైగా, బలూచ్‌ ఉగ్రవాదులకు భారత్‌ సహకరిస్తోందని పాకిస్థాన్‌ ఈ సదస్సులో విరుచుకుపడింది కూడా. అయినా, పాకిస్థాన్‌ను పల్లెత్తుమాట అననీయకుండా చైనా ఈ సదస్సులో అడ్డుపడిందన్నది సుస్పష్టం. రష్యా కూడా సభ్యదేశంగా ఉన్నా ఆ సదస్సులో మనకు అన్యాయమే జరిగింది. ఈ నేపథ్యంలో, సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చాలా మంచిపనిచేశారు. మరి, కరడుగట్టిన చైనా వ్యతిరేక క్వాడ్‌ కూటమి సమావేశంలో పాకిస్థాన్‌ను ఓ మాట అనకుండా ఆపిందెవరు? పాకిస్థాన్‌ ఊసెత్తకుండా పహల్గాం ప్రస్తావన చేయడానికి మనం అంగీకరించడంతో నాలుగుదేశాలూ కలిసి ఒక్కమాటగా ఈ నాలుగుమాటలైనా అనగలిగాయట.


అమెరికా అధ్యక్షుడికి మనమీద ప్రేమనశించి, పాకిస్థాన్‌మీద మనసు పడుతున్న ఈ కాలంలో ఈ మాత్రం సాధించడమే గగనమనుకోవచ్చు. పహల్గాం పాపానికి మేమేకారకులమని ప్రకటించిన రెసిస్టెన్స్‌ఫ్రంట్ పేరును కూడా ఆఖరునిముషంలో ఐక్యరాజ్యసమితి తీర్మానంనుంచి తీసివేయించిన గతాన్ని గుర్తుచేసుకుంటే క్వాడ్‌ తీర్మానం బాగున్నట్టే. ఎస్‌సివో, క్వాడ్‌ రెండూ భిన్న ధ్రువాలు. వాటి నిర్మాణం, నేపథ్యం, భౌగోళిక దృక్కోణం పూర్తిగా వేరు. ఆసియాలో పాశ్చాత్యదేశాల ప్రాభవ ప్రభావాలను అడ్డుకోవడానికి ఎస్‌సీవో ఏర్పడితే, చైనా వీరంగానికి ముకుతాడు వేయడానికి క్వాడ్‌ పుట్టుకొచ్చింది. భారత్‌ సహకారంలేకుండా ఈ సంస్థ ఆవిర్భావ లక్ష్యం నెరవేరదన్నది నిజం. చైనాను నియంత్రించాలంటే బలమైన భారత్‌ను మరింత బలోపేతం చేయాల్సిందే. ఇటీవలి ఎస్‌సివో సంయుక్త ప్రకటనను పాక్‌ అనుకూల తీర్మానంగా మన విశ్లేషకులు అభివర్ణించారు. మరి, క్వాడ్‌ తీర్మానం బాధలో ఉన్న భారత్‌ను సముచితంగా ఓదార్చిందా? అన్నది ప్రశ్న.

Updated Date - Jul 04 , 2025 | 12:29 AM