పేదల ఇంట కొత్త వెలుగు ‘పీ4’
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:09 AM
పేదల సాధికారత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉగాది నుంచి అమలు చేస్తున్న విశిష్ట పథకం–పీ4. స్వర్ణాంధ్ర–2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన పథకం ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యం (పీ–4)...

పేదల సాధికారత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉగాది నుంచి అమలు చేస్తున్న విశిష్ట పథకం–పీ4. స్వర్ణాంధ్ర–2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన పథకం ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యం (పీ–4). మరింత వివరంగా చెప్పాలంటే అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది, ఇంకా ఎన్‌ఆర్‌ఐల సహకారంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికాన్ని గణనీయంగా తగ్గించడానికి కృషి చేయడం కోసం చంద్రబాబు తెచ్చిన విధానమే పీ4. దీని అవసరం ఇప్పుడే ఎందుకు అనే అంశాన్ని చర్చించే ముందు దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న పేదరికం నేపథ్యాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత కేంద్రం, రాష్ట్రాలు ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో అభివృద్ధి కోసం, పేదరిక నిర్మూలన కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ప్రభుత్వాలు తాము చేసిన వ్యయాన్ని ప్రణాళికాబద్ధంగానే చేస్తున్నామని చెబుతాయి. కానీ, ఇన్ని నిధులు ఖర్చు పెట్టినా పేదరికం ఎందుకు తగ్గడం లేదు? ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు నానీ ఫాల్కీవాలా గతంలో చెప్పినట్లు.. మనం అమలు చేసిన అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా పేదరికం అనే విశాల సముద్రంలో సంపదతో తులతూగే కొన్ని ద్వీపాలను మాత్రం అభివృద్ధి పరుచుకోగలిగాం. ఫాల్కీవాలాతో పాటు పలువురు ప్రసిద్ధ ఆర్థిక, సామాజికవేత్తల అభిప్రాయం కూడా అదే.
మనం అమలు చేసిన ప్రణాళికల వల్ల దేశంలో సంపద పెరిగిన మాట నిజమే గానీ, అదే సమయంలో దేశంలో ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య అగాధాలు పెరిగిపోయాయి. ఒకవైపు జాతీయోత్పత్తి, సగటు తలసరి ఆదాయంలో పెరుగుదల కన్పించినా.. ఆర్థిక అసమానతలు అంతకంతకూ పెరిగిపోయాయి. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులు కావడంలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చునేమో గానీ పేదలు మరింత పేదలు కావడాన్ని ఎవరు మాత్రం ఆమోదిస్తారు? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా జాతీయ సంపద గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 90వ దశకం ముందువరకు జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు 3–4శాతం మించలేదు. కానీ సరళీకృత ఆర్థిక విధానాలు అమలయ్యాక ఆరికాభివృద్ధి రేటు 8–9శాతం చేరుకొంది. జాతి సంపద ప్రతియేటా 8–9శాతం పెరుగుతుంటే, పేదరికం ఆ దామాషాలో తగ్గాలి కదా? కానీ పేదరికం ప్రతియేటా సగటున 0.5శాతం కూడా తగ్గడం లేదు. మరి లోపం ఎక్కడున్నట్లు?
ప్రస్తుతం 200 దేశాల ఆకలి సూచీ జాబితాలో భారత్‌ది 180వ స్థానం. మనకంటే మెరుగైన స్థానాల్లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. ఇది భారత్‌కు అవమానం కాదా? త్వరలోనే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని గొప్పలు చెప్పుకుంటున్న భారత్‌లో 20శాతం మంది నిరుపేద ప్రజలు ప్రతిరోజూ అర్ధాకలితో ఉంటున్నారన్నది ఓ చేదు వాస్తవం. ‘పేదరికంతో సహజీవనం చేయడం కంటే అనాగరికత మరొకటి లేదు’– అన్నారు మహాత్మాగాంధీ. అభివృద్ధి, పేదరికం సమాంతరంగా కొనసాగడం ఏ సమాజానికి శ్రేయస్కరం కాదు. పేదరికాన్ని తగ్గించకపోతే శాంతిభద్రతలతో సహా అనేక సమస్యలొస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందంజ వేయడం తదితర మార్పులు ఆహ్వానించదగినవేగానీ.. అంతిమంగా అవన్నీ అన్ని వర్గాల ప్రజలకూ ఉపయోగపడాలి, పెరిగే సంపద హేతుబద్ధంగా ప్రజల మధ్య పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ వాదనను చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ పలు వేదికల ద్వారా వినిపిస్తూనే ఉన్నారు.
చంద్రబాబు తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా, ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. అటువంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు అప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో సమాజాన్ని స్వశక్తితో నిర్మించడానికి ‘జన్మభూమి’ కార్యక్రమం చేపట్టారు. ప్రారంభంలో ఆయన రాజకీయ ప్రత్యర్ధులు. ఆ ప్రయత్నాన్ని అవహేళన చేశారు. ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేదు గనుక ప్రజల శక్తి సామర్ధ్యాలను పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు వాడుకొంటున్నాడు.. అని ఎద్దేవా చేశారు.
సంప్రదాయ ఆలోచనాపరులు ‘ప్రభుత్వం వేరు.. ప్రజలు వేరు’ అనే భావన కలిగి ఉండటం సహజమే. ప్రజల్లో కూడా– ‘మనకెందుకు.. అన్నీ ప్రభుత్వం చూసుకొంటుంది’ అనే మైండ్‌సెట్ ఏర్పడి పోయింది. అయితే, చంద్రబాబునాయుడు జన్మభూమి కార్యక్రమాన్ని పట్టుదలతో చాలెంజ్‌గా తీసుకొన్నారు. తెలుగు ప్రజలలో జన్మభూమి స్ఫూర్తిని, చైతన్యాన్ని రగిలించడంలో చంద్రబాబు గొప్ప విజయం సాధించారు. దాంతో, వయస్సు తారతమ్యాలు, సాంఘిక హోదాలు లేకుండా ప్రజలు తమ ప్రాంతాలను బాగు చేసుకోవడానికి ముందుకు కదిలారు. శ్రమదానం కార్యక్రమాలు ఊరువాడా జరిగాయి. అధికార యంత్రాంగం ఆఫీసు గదుల నుంచి ప్రజాక్షేత్రానికి కదిలారు. ఫలితంగా ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో అన్నిచోట్లా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులుగా ఉండడానికి అలవాటు పడిన ప్రజలు జన్మభూమి స్ఫూర్తితో అభివృద్ధిలో భాగస్వాములు కావడం రాష్ట్ర చరిత్రలో ఓ ఉజ్జ్వల ఘట్టం. అంతేకాదు.. గ్రామాలలో పుట్టి పెరిగి, పల్లె బడి నుంచి పైకెదిగి దేశ, విదేశాలలో స్థిరపడిన పారిశ్రామికవేత్తలు, ఉన్నత విద్యావంతులు, వివిధ రంగాల ప్రముఖులు తాము పుట్టి పెరిగిన నేల తల్లి రుణం తీర్చుకోవడానికి అవకాశం లభించడం అదృష్టంగా భావించి.. కన్న తల్లి కంటే మిన్న అయిన జన్మభూమి రుణాన్ని కొంతైనా తీర్చుకొన్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ–4 ఒక విధంగా చెప్పాలంటే జన్మభూమికి కొనసాగింపే! అయితే జన్మభూమిలో వేల కోట్ల రూపాయల విలువైన సామాజిక పనులు జరిగాయి. సామాజిక ఆస్తులు రూపుదిద్దుకొన్నాయి. వేలాది గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అయితే, ‘పీ4’ మాత్రం నేరుగా పేదరిక నిర్మూలనకు సంబంధించి అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొని.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం లక్ష్యంగా అమలు జరుగుతుంది.
పీ–4లో నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సంపన్న వర్గాలు ముందుకు వస్తాయా? అనే ప్రశ్న తలెత్తడం కూడా సహజమే. నిజానికి, సమాజంలో ఏ ఆపద వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా.. ప్రభుత్వంతో పాటు ఆదుకోవడానికి ఎంతోమంది దాతలు, సంస్థలు ముందుకొచ్చి ఇతోధికంగా సాయం చేయడం ఎప్పట్నుంచో జరుగుతూనే ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) క్రింద ఎన్నో సంస్థలు పలు సామాజిక కార్యక్రమాలపై నిధులు ఖర్చు పెడుతున్నాయి. అందువల్ల ‘పీ4’ పథకంలో భాగస్వాములు కావడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే ‘దాత’లకు కొరత ఉండకపోవచ్చు. అంతేకాదు.. చంద్రబాబునాయుడు ప్రోత్సహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), బయోటెక్నాలజీ తదితర రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకొని దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ, విదేశాలలో ఉన్నత స్థాయిల్లో ఉన్నవారు తమ కృతజ్ఞతను చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారనడం అతిశయోక్తి కాదు. 2024 ఎన్నికల ముందు చంద్రబాబును నాటి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినపుడు హైదరాబాద్, బెంగుళూరు, చైన్నై వంటి భారతీయ నగరాలతోపాటు దాదాపు 80 దేశాలలో ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్ ఆయనకు సంఫీుభావం తెలుపుతూ వీధుల్లోకి రావడం యావత్ ప్రపంచం వీక్షించింది. చంద్రబాబు ఒక పిలుపునిస్తే.. వారందరూ పీ4లో భాగస్వాములు కాగలరు.
‘సాయం చేయడానికి డబ్బు కంటే మనస్సు ఉండటం ముఖ్యం’ అనేది ఓ నానుడి. అందువల్ల మనస్సున్న ప్రతి ఒక్కరూ పీ–4లో భాగస్వాములై తమవంతు సాయం అందించగలరని భావించవచ్చు. చంద్రబాబునాయుడు అమలు చేసిన సంస్కరణలు, రూపొందించిన విధానాలతో కోట్లాది మంది ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. ఆ క్రమంలోనే ‘పీ4’ పథకం రాబోయే ఐదేళ్లలో పేదల ఇంట కొత్త వెలుగులు పూయిస్తుందని భావించడం అత్యాశ కాబోదు.
సి. రామచంద్రయ్య
శాసనమండలి సభ్యులు