CM Chandrababu Naidu: పేదరిక నిర్మూలనకే పీ4
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:10 AM
యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భూతం పేదరికం. ఈ భూమి మీద పేదరికాన్ని నిర్మూలించిన దేశం లేదు
సమూలంగా, శాశ్వతంగా పేదరికం నిర్మూలించాలనే బలమైన లక్ష్యంతో పీ4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇప్పటికే ఈ విధానం ద్వారా 87 వేల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకొని, అభివృద్ధి చేసి పేదరికం నుంచి బయటపడేసేలా కృషి చేస్తోంది.
యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భూతం పేదరికం. ఈ భూమి మీద పేదరికాన్ని నిర్మూలించిన దేశం లేదు. కానీ పేదరికం తగ్గించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనకు భారతదేశంలో గత 75 ఏళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను రూపొందించినా, ఇంకా పేదరికం తాండవిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 50 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే... పేదరికం ప్రధాన సమస్యగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానిని సమూలంగా రూపుమాపే కార్యక్రమం రూపొందించాలని నిర్ణయించుకున్నారు. 2047 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థానంలో నిలిపేలా విజన్ 2047 డాక్యుమెంట్‌కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా పబ్లిక్–ప్రైవేట్–పీపుల్–పార్టనర్‌షిప్(పీ4)పై చంద్రబాబు తన ఆలోచన విధానాన్ని వివరించారు. 2029 నాటికి రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాలను అభివృద్ధి వైపు నడిపించి పేదరికం లేకుండా చేయాలన్నది ఆయన సంకల్పం. ఆ సంకల్పంతో పుట్టిందే పీ4. తెలుగు వారి పర్వదినం ఉగాది పండుగ నాడు ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఐక్యరాజ్యసమితి పేదరికం నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రపంచంలో పేదరికం లేని దేశాలు లేవు. కానీ కొన్ని దేశాలు పేదరికాన్ని చాలా తక్కువ స్థాయికి తగ్గించగలిగాయి. ఐస్‌లాండ్, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పేదరికం తక్కువగా ఉన్న దేశాలు. ఏం చేస్తే పేదరికాన్ని రూపుమాపొచ్చనే అంశాలను ఐక్యరాజ్యసమితి రూపొందించింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిందే పేదరికాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి రూపుమాపాలన్న ఒక మహోన్నతమైన ఆలోచనతో. పేదవాడికి కూడు, గూడు, బట్ట అందించాలన్న ఎజెండాతో ఆయన ముందుకెళ్లారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పింఛన్లు, జనతా వస్త్రాలు వంటి కార్యక్రమాలు అమలు చేశారు. అన్నగారి ఆశయాలను కొనసాగిస్తూనే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమం పేరుతో గ్రామీణ, పట్టణ రూపురేఖలనే మార్చేశారు. స్థానిక ప్రజల సమన్వయంతో గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాల్లోకి పంపి, ప్రజల సమస్యలను నేరుగా వినడం, వాటిని పరిష్కరించడం కోసం ‘ప్రజల వద్దకు పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజన్ 2020ని ప్రవేశపెట్టి 2020 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు కృషి చేసేలా ప్రణాళికలు రచించారు. మహిళలను స్వయం సహాయక బృందాలతో ఏకీకృతం చేసి, సూక్ష్మ రుణాలు అందజేయడం ద్వారా చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని బలోపేతం చేయడం, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. నిరుపేద కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం, గృహ నిర్మాణం కోసం రాయితీలు, ఆహార భద్రత కోసం రేషన్ వ్యవస్థను బలోపేతం చేశారు. జన్మభూమి, నీరు–మీరు, స్వయం సహాయక బృందాలు, రైతు బజార్ వ్యవస్థ ఏర్పాటు వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో పేదరికం నుంచి బయటపడ్డ కుటుంబాలు, గ్రామాలు అనేకం ఉన్నాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పూర్తిగా పేదరికాన్ని రూపుమాపే కార్యక్రమాలు ఒక్కటీ అమలు చేయడం లేదు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సమూలంగా, శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలనే బలమైన లక్ష్యంతో పీ4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇప్పటికే ఈ విధానం ద్వారా 87 వేల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకొని, అభివృద్ధి చేసి పేదరికం నుంచి బయటపడేసేలా కృషి చేస్తోంది. పీ4 విధానంలో భాగంగా తెలుగు ప్రవాసీయులు, హై–నెట్‌వర్త్ వ్యక్తులు 10 శాతం మంది సహకారంతో ఆదాయం తక్కువగా ఉన్న 20 శాతం వర్గాలను ఎంపిక చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయడం. ఇళ్ల నిర్మాణం, పరిశుభ్రమైన వనరులు, తాగునీరు, పారిశుధ్యం, డిజిటల్ కనెక్టివిటీ, సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు పేదరికంలో ఉన్న కుటుంబాలకు అందించడం, వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా నాయకత్వ శిక్షణ ఇవ్వడంతో పాటు స్థానికంగా కమ్యూనిటీ సహకారం అందించే లక్ష్యంతో పీ4 విధానం అమలవుతుంది. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి, విద్యుత్, వంట గ్యాస్, ఆరోగ్య బీమా కవరేజ్, మరుగుదొడ్లు, మురుగు కాల్వల సదుపాయాలు వంటి ప్రాథమిక సేవలు అందించేందుకు ‘కుటుంబానికో వ్యాపారి’ అనే లక్ష్యంతో ప్రతి ఇంటి ఆర్థిక స్వావలంబనకు పీ4 మార్గం చూపించనుంది. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి నియోజకవర్గంలో 10 వేల పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా అధికారులు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేందుకే ఈ పీ4 విధానం అమలు చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, లక్ష మంది మార్గదర్శులను గుర్తించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పీ4 కోసం ఇప్పటికే 28 లక్షల కుటుంబాలను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు 19,15,771 కుటుంబాలను ఎంపిక చేయగా 87,395 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.
పీ4 విధానం ద్వారా లబ్ధి పొందిన వారి కుటుంబాల గాథలను ప్రజల్లోకి తీసుకెళ్లి... పేదరికం లేని సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదరికంలో ఉన్న కుటుంబాలను 2029 నాటికి వృద్ధిలోకి తేవడం... 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కఠోర శ్రమను అభినందిద్దాం. పేదరికం లేని సమసమాజ నిర్మాణానికి మనవంతుగా ప్రచారం చేద్దాం.
-ఏలూరి సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే