Share News

Supreme Court: సుప్రీం ప్రశ్న

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:51 AM

పార్లమెంట్‌ సమావేశాలు మొదలైన రోజున ‘ఈ శీతాకాల సుందర ప్రకృతిని ఆస్వాదించండి’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను బ్యానర్లమీద ప్రదర్శిస్తూ...

Supreme Court: సుప్రీం ప్రశ్న

పార్లమెంట్‌ సమావేశాలు మొదలైన రోజున ‘ఈ శీతాకాల సుందర ప్రకృతిని ఆస్వాదించండి’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను బ్యానర్లమీద ప్రదర్శిస్తూ గురువారం విపక్షాలు ఢిల్లీ కాలుష్యంపై పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మొఖానికి నల్లటిమాస్క్‌లు పెట్టుకొని, ప్లకార్డులు చేతబట్టి, కాలుష్యంతో దేశరాజధానిలో పసికందులు మరణిస్తున్నారని, వృద్ధులు ఇబ్బందిపడుతున్నారని, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తెలివిగా తప్పించుకుంటోందని కాంగ్రెస్‌ ఆరోపణ. ఇది రాజకీయాంశం కాదు, ప్రభుత్వం చర్చకు సిద్ధపడితే చర్యలకు మా మద్దతు ఉంటుందని అది హామీ ఇస్తోంది. చర్చకు సిద్ధపడితే, విఫలమైనామని ఒప్పుకున్నట్టేనని ప్రభుత్వం అనుకోవడం సహజం. సవ్యంగా మాట్లాడుకోగలిగే అంశాలనే సభలోపల కలుషితం చేస్తున్న ఈ పార్టీలు, ఢిల్లీ పౌరులను పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యం గురించి హుందాగా, సయోధ్యతో చర్చచేసి, పరిష్కారాలను ప్రతిపాదిస్తాయని నమ్మడం మరీ కష్టం.

ఇండియాగేట్‌ ఏదీ? అంటూ దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పొగమంచు, కాలుష్యంతో సతమతమవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఢిల్లీవాసులారా, మీరు ఈ రోజు పదిహేను సిగరెట్లు కాల్చినంత కాలుష్యాన్ని భరిస్తున్నారంటూ కొన్ని వెబ్‌సైట్లు ఏవేవో లెక్కలుగట్టి జనాన్ని మరింత భయపెడుతున్నాయి. దేశ రాజధానిని డేంజర్‌ జోన్‌గా మార్చేసిన కాలుష్యం మీద సభలో నిజంగానే చర్చ జరిగినా, అది రాజకీయాలకు అతీతంగా సాగుతుందనుకోలేం. ఇది మీ పాపమే, మీ చేతగానితనమే అని పరస్పరం విమర్శించుకోవడానికే పార్టీలు పరిమితమవుతాయి. తప్పు తోసేయడం మీద ఉన్న శ్రద్ధ పరిష్కారంలో కనబడదు. సుప్రీంకోర్టు నాలుగు రోజుల క్రితం ఇటువంటి తీరుతెన్నుల గురించే కఠినంగా వ్యాఖ్యానించింది. పొరుగు రాష్ట్రాల్లో రైతులు పంటవ్యర్థాలు తగలబెట్టడమే రాజధాని కాలుష్యానికి కారణమని కేంద్రం అన్నందుకు ఆగ్రహించింది. కాలుష్యం పెరిగిన ప్రతీసారీ నెపం రైతుల మీదకు నెట్టివేసే ధోరణి మార్చుకోమని హితవు చెప్పింది. ప్రధాన కాలుష్య కారకాల లెక్కతేల్చమంటూ కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు ఆదేశాలు ఇవ్వడంతోపాటు, రైతుపక్షాన కోర్టు చేసిన ఆ వ్యాఖ్యలు మెచ్చవలసినవి. కరోనాకాలంలో ఢిల్లీ ఆకాశవీధులు అంత స్వచ్ఛంగా, నీలంగా ఎలా కనిపించాయంటూ కేంద్రాన్ని కోర్టు ప్రశ్నించింది. కరోనాకాలంలో వ్యర్థాల దహనం సాపేక్షంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, గాలి నాణ్యతకు లోటురాలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రాల రైతులే ఈ కాలుష్యానికి ప్రధాన కారకులంటూ తప్పుపూర్తిగా వారిమీదకు నెట్టేసే ప్రయత్నాన్ని ఆయన అడ్డుకున్నారు. వాహనాల రాకపోకలన్నీ ఆగిపోయి, నిర్మాణాలు నిలిచిపోయి, పరిశ్రమలు పనిచేయని లాక్‌డౌన్‌ కాలంలో, ఎప్పటిలాగానే తన పని మౌనంగా చేసుకుపోయిన ఒకే ఒక్కడు రైతు. మిగతా సమాజం ఆగినా, ఆయన కదిలాడు కనుకనే అన్నానికి లోటేమీలేకపోయింది. కాలుష్యానికి కారణమవుతున్న రైతును శిక్షించాల్సిందేనంటూ గత ఏడాది ఇదే కోర్టు వ్యాఖ్యానించినదానికి పూర్తిభిన్నంగా, అసలు కాలుష్యకారకాల మీదకు దృష్టిమరల్చి, రైతును రాజకీయం చేయవద్దన్న విస్పష్ట సందేశం ఇచ్చారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి.


పంటవ్యర్థాలను రైతులు తరతరాలుగా తగలబెడుతూనే ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్ళలో దాని స్థాయి, విస్తృతి ప్రభుత్వాల జోక్యం కారణంగా బాగా తగ్గినట్టు విశ్లేషణలు వెలువడ్డాయి. అయినా, రైతునే బూచిగా చూపే ప్రయత్నం అలాగే సాగుతోంది. ఆ ప్రక్రియ కాలుష్యాన్ని కలిగించడం లేదని కోర్టు కూడా అనడం లేదు. దాని ప్రభావం పరిమితమని, ఒక పెద్ద సమస్యకు బక్క రైతును బలిపశువు చేయకండని చెప్పడమే ప్రధాన న్యాయమూర్తి ఉద్దేశం. శీతాకాలం మాత్రమే ఆలోచించి, నాలుగు చర్యలూ చేష్టలతో వదిలివేయగలిగే సమస్య కాదిది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) వంటి చాలా సంస్థలు ఢిల్లీ కాలుష్యానికి స్థానిక అంశాలే కారణమని, వాహన, నిర్మాణ రంగాలు తొలిస్థానాల్లో ఉన్నాయని స్పష్టంగా చెబుతున్నాయి. కాలుష్య నియంత్రణ చర్యలను నెలకు రెండుసార్లు సమీక్షిస్తాననీ, కొత్త ఆలోచనలను స్వాగతిస్తాననీ అంటున్న ప్రధాన న్యాయమూర్తి ఈ విషానికి ఏ విరుగుడు కనిపెడతారో చూడాలి.

Updated Date - Dec 06 , 2025 | 04:51 AM