Sindhu Water Treaty: పాక్‌కు సింధు జలాలు... ఇంకానా
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:59 AM
భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించి దేశ భద్రతను చాటుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి, భారతీయుల నీటి హక్కులకు ప్రాధాన్యత ఇచ్చింది.
భారతదేశ సమగ్రతను, భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’.. మన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఏప్రిల్ 22న పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఉన్మాదానికి ప్రతీకారంగా.. మే 7వ తేదీ తెల్లవారుజామున (6వ తేదీ అర్ధరాత్రి తర్వాత), 9వ తేదీన పాకిస్థాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలు లక్ష్యంగా సంధించిన మిసైళ్లు, పాక్ సైనిక స్థావరాలపై జరిపిన మెరుపుదాడులకు యావత్ ప్రపంచం సాక్షీభూతంగా నిలిచింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో భారతదేశం చూపించిన పరిపక్వతకు, స్పష్టతకు యావత్ ప్రపంచం జేజేలు పలికింది. బ్రహ్మోస్, స్కాల్ప్ మిసైళ్లను వాడుతూ.. ఎస్–400, ఆకాశ్ ద్వారా వైమానిక రక్షణ వ్యవస్థతో స్వీయరక్షణ చేసుకుంది.
పహల్గాం ఘటన జరిగిన మూడురోజుల లోపే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారతదేశం చాలా స్పష్టంగా తెలియజేసింది, కఠినంగా వ్యవహరించింది. ‘ఆపరేషన్ సిందూర్’కు తాత్కాలిక విరామం ఇస్తూ.. కాల్పుల విరమణకు అంగీకరించిన సందర్భంలోనూ ‘సింధు జలాల ఒప్పందం’ నిలుపుదలపై యథాతథస్థితిని కొనసాగించింది. 1965, 1971 (బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా), 1999 (కార్గిల్), 2001 (పార్లమెంటుపై దాడి), 2008 (ముంబైపై ఉగ్రదాడి), 2016 (యురీ), 2019 (పుల్వామా) ఘటనల సందర్భంలోనూ భారత్, పాక్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ సింధునదీ జలాల ఒప్పందంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత, దేశవ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం నెలకొనడం, ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన సందర్భంలో మోదీ సర్కారు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ గొప్ప నిర్ణయం తీసుకుంది.
భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తొలినాళ్లలో జరిగిన ఓ చారిత్రక తప్పిదమే ఈ సింధు జలాల ఒప్పందం. నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ 19 సెప్టెంబర్ 1960లో సద్భావనాపూర్వక ఒప్పందంగా దీనిపై సంతకాలు చేశారు. సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటీ)లో భాగంగా.. సింధు నది, దాని అయిదు ఉప నదుల జలాల్లో.. 80 శాతం పాకిస్థాన్, 20 శాతం భారత్ వినియోగించుకోవాలి. పాకిస్థాన్‌కు సింహభాగం నీటిని అప్పగిస్తున్నందుకు బదులుగా రావి, బియాస్, సట్లేజ్ నదుల నీటిని భారత్, సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్థాన్ వినియోగించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
రావి, బియాస్, సట్లేజ్ నదుల నీటిని భారత్ వాడుకుంటున్నందున.. పాకిస్థాన్ భూభాగంలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో జీలం, సింధు, చీనాబ్ నదులకు లింక్ కెనాళ్ల నిర్మాణ ఖర్చులుగా రూ.83.3 కోట్లను భారతదేశం భరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది రూ.8వేల కోట్లతో సమానం. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు జోక్యంతో పాకిస్థాన్‌కు మరో రూ.400 కోట్ల నిధులు అందాయి. అదే సమయంలో భారతదేశం.. కెనాళ్ల నిర్మాణానికి రూ.100 కోట్ల సొంత నిధులను ఖర్చు చేసుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇందుకోసం భారత్‌కు ప్రపంచబ్యాంకు కేవలం రూ.30కోట్ల నిధులను ఇచ్చింది. అది కూడా రుణంగానే. ఈ ఒప్పందం పాకిస్థాన్‌కు అనుకూలంగా ఎంత ఏకపక్షంగా సాగిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ ఒప్పందంపై నెహ్రూ సంతకం చేయడంపై అప్పుడే కాంగ్రెస్ నాయకులతో పాటు దేశవ్యాప్తంగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తమైంది. 30 నవంబర్, 1960 నాడు.. సింధుజలాల ఒప్పందంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా.. కాంగ్రెస్ ఎంపీ హరీశ్‌చంద్ర మాథుర్ మాట్లాడుతూ.. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఈ ఒప్పందంలోని ప్రతి అంశం వివాదాస్పదమే. పాకిస్థాన్ ఆకాంక్షలను పూర్తి చేసేందుకు భారతదేశం తన ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ డబ్బులు వెచ్చిస్తోంది’ అని గుర్తు చేశారు. నాటి వాస్తవ పరిస్థితిని హరీశ్‌చంద్ర మాథుర్ మాటలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీనికితోడు భారత్, పాకిస్థాన్, ప్రపంచ బ్యాంకు మధ్య జరిగిన ఈ త్రైపాక్షిక ఒప్పందానికి భారతదేశమే చాలా రాయితీలు ఇచ్చింది. అందుకు ప్రతిఫలంగా మనకేమీ దక్కలేదు. ఇది సింధునదీ జలాల ఒప్పందంలో భారతదేశానికి జరిగిన తీవ్రమైన అన్యాయం.
ఇదే భావన.. నాడు పార్టీలకు అతీతంగా ప్రతి పార్లమెంటు సభ్యుడు ఎలుగెత్తి చాటారు. ఈ ఒప్పందం కారణంగా రాజస్థాన్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. చాలామంది సభ్యులు 1948లో దేశ విభజన సమయంలో జరిగిన ఒప్పందాలను ప్రస్తావిస్తూ అప్పటికే వినియోగంలో ఉన్న కెనాళ్ల ద్వారా భారత్ నుంచి పాకిస్థాన్‌కు నీటి సరఫరాకు అంతరాయం ఉండకూడదని, కొన్నాళ్లపాటు ఇలాగే నీటి సరఫరా జరగాలని పేర్కొన్న అంశాన్ని గుర్తుచేశారు. అయినా, నెహ్రూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు సరికదా, బకెట్ నీళ్లకోసం రాద్ధాంతం చేస్తున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అయినా ఎంపీలెవరూ వెనక్కు తగ్గకపోవడంతో, ఈ విమర్శల దాడిని తట్టుకునేందుకు, జపాన్ యువరాజు– యువరాణి భారత పర్యటనకు వస్తున్నారని, వారికి స్వాగతం పలికేందుకు వెళ్తున్నానని చెప్పి నెహ్రూ తప్పించుకున్నారు.
తీవ్రమైన గందరగోళం మధ్య నెహ్రూ పార్లమెంటు నుంచి నిష్క్రమించిన తర్వాత అటల్ బిహారీ వాజపేయి నాటి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రసంగించారు. ఈ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ‘సింధుతో పాటుగా రావి, సట్లేజ్, బియాస్, జీలం, చీనాబ్ నదీతీరాల ఉమ్మడి తనిఖీ విధానానికి భారత్ అంగీకరించడం ద్వారా పాకిస్థాన్ ఒత్తిడికి తలొగ్గింది. చీనాబ్, జీలం నదుల ఎగువ ప్రాంతంపై (భారత భూభాగంలో) ఉమ్మడి నియంత్రణకు అంగీకరించడం అంటే, ఈ ప్రాంతంపై ఇరు దేశాలకు హక్కు ఉంటుందని అంగీకరించడమేనని అర్థం’ అని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. దీనికి నెహ్రూ ఇచ్చిన సమాధానంపై వాజపేయి సంతృప్తి చెందలేదు. దీనికి సమాధానంగా.. ‘రెండు దాయాది దేశాల మధ్య సత్సంబంధాలను, స్నేహాన్ని ఏర్పర్చాలని భావిస్తే.. ఇలా సింధునదీ జలాల ఒప్పందం విషయంలో మన ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా వ్యవహరించడం సరికాదు. పాకిస్థాన్ తప్పుగా మాట్లాడినా, అక్రమ డిమాండ్లను ముందుపెట్టినా నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాల్సిందే’ అని వాజపేయి స్పష్టం చేశారు.
- జి. కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు
గనుల శాఖ మంత్రి
ఇది జరిగిన ఆరున్నర దశాబ్దాల తర్వాత.. ఇవాళ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం ఓ చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. ఈ సందర్భంగా భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందన.. ఒప్పందాన్ని సంపూర్తిగా గౌరవించినట్లుగా ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశం నమ్మకాన్ని పాకిస్థాన్ వమ్ముచేసింది. దేశ భద్రతను, దేశ సమగ్రతను సవాల్ చేసేలా వ్యవహరిస్తే.. ఇచ్చే సమాధానం కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క పాకిస్థాన్‌కే కాదు.. యావత్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్నిచ్చారు. ‘రక్తం, నీరు కలిసి ప్రవహించవు’ అని భారతదేశం ఆలోచనలను కుండబద్దలు కొట్టారు. భారతదేశ ప్రజల అవసరాలకు, వ్యవసాయ, నీటిపారుదల అవసరాలకు అనుగుణంగా.. ఇకపై మన దేశం సింధు జలాలను వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్లుగా.. మన అవసరాలకు, దేశాభివృద్ధికి ప్రాధాన్యతగా నిర్దేశించుకునే సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గతంలో చాలాసార్లు ప్రభుత్వాలు ఆలోచన చేశాయి. ముంబై దాడుల సందర్భంలోనూ.. సింధుజలాల ఒప్పందాన్ని రద్దుచేయాలనే డిమాండ్ వినిపించింది. కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ఈసారి భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ.. రెండో ఆలోచనకు తావులేకుండా ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని యావద్భారతం ముక్తకంఠంతో ఆమోదం తెలిపింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే ఎంతటి కఠినమైన నిర్ణయానికైనా భారత ప్రజల మద్దతు ఉంటుందని మరోసారి నిరూపితమైంది.