Irrigation Projects: ఒడిశాను ఒప్పిస్తే రెండు ప్రాజెక్టులకు మోక్షం
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:23 AM
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. గత ఐదేళ్లూ అంతులేని నిర్లక్ష్యానికి గురైన పోలవరం వంటి భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ముందుకు సాగుతున్నాయి. బనకచర్ల వంటి కొత్త ప్రాజెక్టులపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారిస్తున్నారు. ఇదే తరుణంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించే నేరడి, ఝంఝావతి ప్రాజెక్టుల క్లియరెన్స్‌లపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఝంఝావతి నదిపైనే ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. పొరుగునున్న ఒడిశా పాలకులతో మాట్లాడి, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోగలిగితే, ఈ రెండు జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. వంశధార నదిలో లభ్యమయ్యే 115 టీఎంసీల్లో చెరి సగం వాడుకోడానికి 1962 సెప్టెంబరు 30న ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలు, ఒడిశాలో సుమారు 30 వేల ఎకరాలకు సాగు నీరందించే నేరడి ప్రాజెక్టును ఏపీ అధికారులు ప్రతిపాదించారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలోని కాట్రగడ్డ వద్ద దీన్ని నిర్మించాలనుకున్నారు. ఒడిశా కూడా దీనికి తొలుత సుముఖత వ్యక్తం చేసింది. 1986లో అప్పటి సీఎంలు ఎన్టీ రామారావు, నవీన్ పట్నాయక్ నేరుగా చర్చలు కూడా జరిపారు. అనంతరం ఒడిశాలోని అప్పటి సంకీర్ణ ప్రభుత్వం మాట మార్చి, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసింది. 2010లో కేంద్ర ప్రభుత్వం వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను విన్న ట్రిబ్యునల్ 2017 సెప్టెంబరులో నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిచ్చింది.
బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన సుమారు 110 ఎకరాలను ఉమ్మడి సర్వే ద్వారా సేకరించి ఆంధ్రకు అప్పగించాలని కూడా ఒడిశాను ఆదేశించింది. కానీ నేటి వరకూ ఉమ్మడి సర్వేకు ఆ రాష్ట్రం సహకరించకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది. ఇక వంశధార నదిపై ఉన్న మరో పెండింగ్ ప్రాజెక్టు ఝంఝావతి. ఇది కూడా ఒడిశా సహకారం లేకపోవడం వల్ల నిలిచిపోయినదే. ఒడిశా సహకరించి, ప్రాజెక్టుకు అవసరమైన వెయ్యి ఎకరాల భూమిని అప్పగిస్తే, ఆ రాష్ట్రంలోని సుమారు పాతిక వేల ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిర్మాణ వ్యయం, పనుల నిర్వహణ, నిర్వాసితుల సమస్యలు, పునరావాసం, రివర్ గ్యాప్ పనులు... వంటివి పరిష్కారం కాలేదు. గత పదేళ్లలో పలుమార్లు ఈ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ పరిస్థితుల్లో ‘ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాల’ని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించడం స్థానిక రైతులకు ఊరట కలిగించే విషయం. ఇటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అటు కేంద్రంలోను రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి ఇదే మంచి సమయం.
– డొంకాడ గోపాల్