USA Housing Crisis: అమెరికా రియల్ సంక్షోభంలో మన ఎన్నారైలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:01 AM
కొంతకాలం కిందట అమెరికాలో రియల్ ఎస్టేట్ గృహాల కొనుగోళ్లు ఒక ఉద్యమంలా నడిచాయి.
కొంతకాలం కిందట అమెరికాలో రియల్ ఎస్టేట్ గృహాల కొనుగోళ్లు ఒక ఉద్యమంలా నడిచాయి. కరోనా దెబ్బకు వర్క్ ఫ్రం హోం కల్చర్ వచ్చిన తర్వాత ‘మూన్ లైటింగ్’ పేరుతో ఏకకాలంలో రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ ఇబ్బడిముబ్బడిగా సంపాదించినవారు చాలామంది ఉన్నారు. వారు ఆర్జన మొత్తం నగదుగా ఉంటే వృథా అయిపోతుందని జాగ్రత్త పడి ఇళ్లు కొనడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా లోన్ ద్వారా ఈఎంఐలతో కొన్న ఇళ్లు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగ ముఖచిత్రం ఇప్పుడు సమూలంగా మారిపోయింది. పెద్ద ఉద్యోగాల్లో ఉంటున్నవారు కూడా ఎంతకాలం స్థిరంగా ఆ స్థాయిలో ఉండగలమో చెప్పలేమని ఆందోళన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఇళ్లు కొన్న చాలామంది ఇప్పుడు వాటిని అమ్మకానికి పెడుతున్నారు. అలాగే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇల్లు కొనేశాక, లేఆఫ్‌లు అయిన సందర్భాల్లో, మరొక ఉద్యోగం వెతుక్కునేలోగా రుణానికి ఈఎంఐలు కడుతూ ఆస్తిని నిలుపుకోలేకపోతున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం కుదేలవుతున్న రియల్ ఎస్టేట్, గృహనిర్మాణరంగం ఇక్కడి భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇళ్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు వాటిని అమ్ముకోవడం వీలుకాక అగచాట్లు పడుతున్నారు.
కరోనా కాలంలో గృహ కొనుగోలుకు రుణాలిచ్చే సంస్థలు చాలా ఉదారంగా వ్యవహరించాయి. అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో ఆ సంస్థల వ్యాపారం మొత్తం శవాసనం వేసింది గనుక కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అతి తక్కువ వడ్డీరేట్లకు రుణాలు ఆఫర్ చేశారు. ఆ రోజుల్లో 2శాతం వడ్డీ వంతున తీసుకున్న రుణాలకే, వినియోగదారులు ఇప్పుడు 7శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే కొత్త వినియోగదార్లను ఆకర్షించడానికి అడ్జస్టబుల్ మార్ట్‌గేజ్ విధానాల్లో రెండుమూడేళ్ల పాటు మాత్రమే తక్కువ వడ్డీ వర్తించేలా రుణాలిచ్చారు. ఏదైతేనేం వడ్డీ తక్కువ కదా అని ఇళ్లు కొన్నవాళ్లు, వడ్డీలు పెరిగిన తర్వాత భరించలేకపోతున్నారు.
తాహతు చూసుకోకుండా ఇళ్లు కొనేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అమెరికాకు పిల్లల్ని పంపిన, భారతీయ నగరాల్లోని తల్లిదండ్రులు ‘‘అక్కడ ఎప్పుడు ఇల్లు కొంటున్నావు’’ అంటూ వెంటపడతారు. పరిచయస్తుల్లో ఎవరి పిల్లలైనా ఇల్లు కొంటే వెంటనే తమ పిల్లలను కూడా ఇల్లు కొనాలని ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి ఒత్తిడుల మధ్య అవసరాన్ని, తాహతును చూసుకోకుండా ఇల్లు కొనేసిన వాళ్లు ఇప్పుడు అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. అమ్మేవాళ్లు రోజురోజుకూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నారు గానీ కొనేవాళ్లే కనిపించడం లేదు. ఇందుకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఐటీ వాతావరణం నెమ్మదించిన తర్వాత ఇళ్ల కొనుగోళ్లకు రుణాలు పుట్టడం గగనంగా మారుతున్నది. ప్రత్యేకించి భారతీయ సమాజానికి ఈ పోకడ తీవ్రత బాగా తెలుస్తోంది. ఇళ్ల మార్కెట్ స్తంభించడానికి ఉన్న కారణాల్లో గంటల వారీ చెల్లించే వేతనాలు బాగా తగ్గడం కూడా ఒక కారణం. హెచ్1 ఉన్న వారికి ఇప్పటికీ రుణం వస్తుంది గానీ రుణ ప్రక్రియ క్లిష్టంగా మారింది. వారి ఉద్యోగాల కాంట్రాక్టు ఎప్పటిదాకా ఉందో గమనించి గానీ రుణం ఇవ్వడం లేదు. గతంలో చెల్లింపుల్లో తేడా వస్తే ఇల్లు దక్కుతుంది గనుక రుణసంస్థలు రుణాలు ఇచ్చేందుకు వెనకాడేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రుణాలు కట్టలేని వారి నుంచి ఇళ్లను స్వాధీనం చేసుకున్నా వాటిని మళ్లీ అమ్ముకోవడం ఆ సంస్థలకు కూడా భారమే. అందుకే ఆచితూచి అప్పులిస్తున్నాయి.
ఈ సమస్యకు మూలకారణం భారతీయ సమాజం ఆలోచనా ధోరణిలో కూడా ఉన్నదని చెప్పాలి. ఎన్నారైలు ఆర్థిక ఒత్తిడిని భరించగలమా లేదా అనే ఆచరణాత్మక దృక్పథం లేకుండా కొనుగోళ్లకు వెళుతున్నారు. కొత్తగా ఉద్యోగం ప్రారంభించిన యువతరం కూడా బీఎండబ్ల్యూ, బెంజి కార్లు కొనాలనుకుంటున్నారే తప్ప మధ్యశ్రేణి కార్లను తీసుకుని, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత అప్‌గ్రేడ్ అవుదాం అనుకోవడం లేదు. ఇళ్ల కొనుగోలు విషయంలోనూ ఇదే జరుగుతున్నది. తమ తాహతు చూసుకోకుండా కొనేయడం అన్నది వారిని అనివార్యంగా కష్టాల్లోకి నెడుతున్నది. ఇప్పుడు కొనకపోతే మళ్లీ ఇళ్లు దొరకవేమో అన్నంత ఆత్రంగా ఎగబడి కొంటున్నారు. నిజానికి అమెరికా చాలా విశాలమైన దేశం. అయినప్పటికీ ఇళ్ల కోసం విచక్షణ లేకుండా ఎగబడటం వలన ఇప్పుడు మార్కెట్ దారుణంగా తయారైంది. తమ సంపాదన వృథా కాకుండా పెట్టుబడులుగా మార్చుకోవాలనుకునే ఆలోచన మంచిదే గానీ.. ఆ పెట్టుబడులను స్వదేశంలో పెట్టుకోవటం మంచిది. భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలావరకు స్థిరంగా ఉంది. అమెరికాలో ఉన్నంత డోలాయమాన పరిస్థితులు లేవు. ఆచితూచి అడుగు వేస్తే నష్టపోకుండా ఉంటారు.
-కృష్ణమోహన్ దాసరి జర్నలిస్ట్, డల్లాస్