Jammu Kashmir Security Issues: నయాకశ్మీర్ పహల్గాంకు ఎలా చేరింది
ABN , Publish Date - Apr 25 , 2025 | 06:00 AM
జమ్మూ కశ్మీర్‌లో గత మూడు దశాబ్దాలుగా సాధారణ పరిస్థితి పునరుద్ధరించడంలో వివిధ రాజకీయ మార్పులు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి అయినా ప్రజల హృదయాలలో అవిశ్వాసం, భయం ఇంకా కొనసాగుతూనే ఉంది
జమ్మూ కశ్మీర్‌లో సుదీర్ఘకాలంగా ఎడతెగని హింసాత్మక సంఘర్షణను వర్ణించే, వివరించే, వ్యాఖ్యానించే పదజాలంలో ఒక మాట మళ్లీమళ్లీ ప్రస్తావితమవుతోంది. ఆ పునరావృత పదమే ‘సాధారణ పరిస్థితి’. కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితి ఎలా పునరుద్ధరింపబడిందో రాజకీయవేత్తలు, పరిశీలకులు, పాత్రికేయులు విజయోత్సాహంతో తరచు మాట్లాడుతుండడం కద్దు. వాస్తవమేమిటి? మూడున్నర దశాబ్దాలుగా కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పేందుకు వీలులేని భిన్న రీతిలోనే ఉంటూ వస్తున్నాయి. ఇదొక కఠోర సత్యం. హింసారిరంసతో రక్తమోడుతున్న కశ్మీర్ లోయలో పరిస్థితులు చక్కపడతాయనే ఆశాకుసుమాలు వికసించిన ప్రతిసారీ ఉగ్రభూతాలు వాటిని ఛిద్రం చేసేస్తున్నాయి. ఉగ్రవాద కాఠిన్యానికి పహల్గాంలో నిన్నగాక మొన్న కనీసం 28 మంది పర్యాటకులు హతమారిపోవడం ఆ విషాద, వికృత సత్యాన్నే మరొకసారి గుర్తుచేస్తూ జాతిని కలచివేస్తోంది. ప్రాణాంతకమైన ఒక విపత్కర పరిస్థితిలో కశ్మీర్ చిక్కుకున్నది. ఆగస్టు 2019లో జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణ 370ని రద్దు చేసిన అనంతరం ఒక కొత్త కశ్మీర్ (నయా కశ్మీర్) విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దార్శనికతను ఎలా ఆవిష్కరించారో గుర్తుచేసుకోండి. కశ్మీర్‌లో మామూలు పరిస్థితులను పునరుద్ధరించే దిశలో అదొక ప్రధాన ముందడుగు అని మోదీ పేర్కొన్నారు. త్వరలోనే పెట్టుబడుల వెల్లువను కశ్మీర్ చూడనున్నదని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. సత్వరమే మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరుస్తామని వాగ్దానం చేశారు. బాలీవుడ్ సినిమా మాంత్రికులు నీలాల నింగిని చుంబించే హిమవత్పర్వతాలు, కన్నుల పండువైన పచ్చిక మైదానాలకు తిరిగి వస్తారని నరేంద్ర మోదీ ఉత్సాహంగా చెప్పారు. ఇదొక ‘కొత్త సాధారణ’ మని, జమ్మూ కశ్మీర్ శీఘ్రగతిన ‘న్యూ ఇండియా’ ప్రధాన స్రవంతిలో కలిసిపోతుందని మోదీ నిశ్చిత స్వరంతో చెప్పారు. ప్రధానమంత్రి హామీ ఇచ్చిన ‘సాధారణ పరిస్థితి’ పైకి కనిపించే దృశ్యం. కొత్త రహదారులు, హైవేలు, కొండలు తొలిచి నిర్మించిన సొరంగాలు పెనుమార్పులకు ప్రతీకలే, సందేహం లేదు.
ఇప్పుడు శ్రీనగర్ నుంచి అనంతనాగ్ లేదా బారాముల్లాకు వాయువేగంతో వెళ్లవచ్చు. ఈ ప్రయాణ సౌఖ్యం కొద్ది సంవత్సరాల క్రితం అయితే కలలో కూడా ఊహించలేని విషయం మరి. అయితే ‘సాధారణ పరిస్థితి’ అనేది భౌతిక వసతులకు మాత్రమే పరిమితమైనది కాదు. అది, అంతిమంగా ప్రజల మనస్సును, హృదయాన్ని గెలుచుకోవడమే అని చెప్పి తీరాలి. అయితే ఇది జరగలేదు. కనుకనే కశ్మీరీలలో చాలా కాలంగా ఉన్న మనోక్లేశాలు, హృదయావేదనలు సమసిపోవడం లేదు. ఎలా సమసిపోతాయి? భారత్‌లో ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఏకైక రాష్ట్రమైన జమ్మూ–కశ్మీర్‌ను రాత్రికి రాత్రి శాసనవిహిత ఫర్మానాతో విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కుదించి వేసినప్పుడు అక్కడ ‘సాధారణ పరిస్థితి’ ఎలా ఉంటుంది? ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు అది ‘సాధారణ’మెలా అవుతుంది? వేలాది కశ్మీరీలను క్రూర చట్టాల కింద అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కివేసినప్పుడు కశ్మీర్‌లో ‘సాధారణ పరిస్థితి’ ఎలా మొలకలేస్తుంది? నెలల తరబడి పాఠశాలలను మూసివేసినప్పుడు, ఇంటర్నెట్ షట్‌డౌన్ నిత్య వ్యవహారమైనప్పుడు ‘సాధారణ పరిస్థితి’ ఎలా నెలకొంటుంది? కశ్మీర్ లోయలో అడుగడుగునా వేలాది సైనికులను మోహరించినప్పుడు భారత ప్రభుత్వ వాగ్దానాలను కశ్మీరీలు ఎలా విశ్వసిస్తారు? ఆ అందమైన లోయకు ‘సాధారణ’ జీవన సౌందర్యం మళ్లీ ఎలా సమకూరుతుంది? భయభీతులను వ్యాపింపచేసేందుకు, హింసాకాండను రగిలించేందుకు కశ్మీరీ యువకులకు ఆయుధాలు, శిక్షణ ఇవ్వడాన్ని పాకిస్థానీ దుష్ట రాజ్యవ్యవస్థ కొనసాగిస్తున్నప్పుడు ‘సాధారణ పరిస్థితుల’ దిశగా కశ్మీర్ ఎలా పురోగమిస్తుంది? గత ఏడాది తొలుత లోక్‌సభకు, ఆ తరువాత విధానసభకు జరిగిన ఎన్నికలలో అంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. కశ్మీర్‌లో నెలకొన్న సాధారణ పరిస్థితులను ఈ పరిణామాలు ప్రతిబింబించడం లేదా అని హిమాలయ శిఖరాల నెక్కి కన్యాకుమారిలోని వారికి కూడా వినపడేలా ప్రశ్నించారు. ఏ కశ్మీరీ వేర్పాటువాద పార్టీ కూడా ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వ లేదు. ఓటు వేయవద్దని ఓటర్లను ఒత్తిడి చేయలేదు.
వేర్పాటువాద పార్టీల సమష్టి వేదిక అయిన హురియత్ కాన్ఫరెన్స్ సర్వశక్తిమంతమైన భారత రాజ్య యంత్రాంగం పుణ్యమా అని కకావికలైపోయింది. జమ్ము–కశ్మీర్‌కు ఒమర్ అబ్దుల్లా ప్రజాస్వామ్యబద్ధంగా ‘ఎన్నికైన’ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్టీ పూర్తి మెజారిటీని సాధించుకున్నది. అయితే ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు, కనీసం కీలక అధికారులను నియమించేందుకు, బదిలీ చేసేందుకు సైతం అధికారాలు లేనప్పుడు అది ‘సాధారణ’ ప్రజాస్వామ్య పాలన ఎలా అవుతుంది? కశ్మీర్‌తో ఎటువంటి సంబంధమూ లేని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని లెఫ్టినెంట్ గవర్నర్‌కు శాంతిభద్రతల సంరక్షణతో సహా సమస్త అధికారాలను కట్టబెట్టడం ‘సాధారణ పరిస్థితి’ పునరుద్ధరణకు ఎలా దోహదం చేస్తుంది? ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన తమ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరుగుతుందనే ఆశాభావంతోనే జమ్ము–కశ్మీర్ ప్రజలు సంఖ్యానేకంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. కేంద్రం తన హామీని నెరవేర్చలేదు. కశ్మీరీల ఆశలు వమ్మయ్యాయి. ‘సాధారణ పరిస్థితులు’ నెలకొన్నాయనే విషయమై కేంద్ర ప్రభుత్వ కథనాలు, కోవిడ్ అనంతరం పర్యాటక రంగం పుంజుకోవడంలో భాగంగా కశ్మీర్ లోయకు పర్యాటకులు వెల్లువెత్తడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. శ్రీనగర్ ఉద్యానవనాలలో ట్యులిప్ పువ్వులు శోభాయమానంగా వికసిస్తున్నాయి. దాల్ సరస్సులో యాత్రికులు విహరిస్తున్నారు. పహల్గాంలో ట్రెక్కింగ్, గుల్మార్గ్‌లో స్కీయింగ్ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటక–స్నేహపూరిత గమ్యంగా జమ్ము కశ్మీర్‌ను ప్రమోట్ చేసేందుకు కేంద్రం మే 2023లో శ్రీనగర్‌లో ఒక జీ20 పర్యాటక సదస్సును నిర్వహించింది. అయితే పర్యాటక రంగం పుంజుకోవడమే సాధారణ పరిస్థితి’కి ఎంతమాత్రం చిహ్నం కాదు. ప్రజలు భయరహితంగా సంచరించడం, ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా సమసిపోవడం, ఉగ్రవాదులు తమ ఇష్టానుసారం దాడి చేయలేని అశక్తతలో పడడమే సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు నిదర్శనమవుతుంది. ఉగ్రవాద దాడులలో చనిపోయిన పౌరుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో బాగా తగ్గిపోయిందని కేంద్రం చెప్పడం సమర్థనీయమే.
అయితే ఉగ్రవాద మిలిటెంట్లు, సాయుధ బలగాల మధ్య ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయన్న నిష్ఠూర సత్యాన్ని ఆ అంకెలు మరుగుపరుస్తున్నాయి. ‘సాధారణ పరిస్థితులే’ ఉంటే ఉగ్రవాదులు లక్షిత దాడులకు ఎలా పాల్పడుతున్నారు? అక్టోబర్‌లో శ్రీనగర్‌లో ఒక ప్రముఖ కెమిస్ట్, ఒక ఆహార విక్రేత, ఒక టాక్సీ డ్రైవర్‌ను ఒక గంట వ్యవధిలోనే ఉగ్రవాదులు కాల్చివేసిన వైనాన్ని గుర్తుచేసుకోండి. హతుడైన కెమిస్ట్ మఖన్‌లాల్ బింద్రూ ఒక కశ్మీరీ పండిట్. 1990ల్లో లోయ నుంచి పండిట్‌లు పెద్ద సంఖ్యలో వేరే రాష్ట్రాలకు శరణార్థులుగా వెళ్లిపోయినప్పటికీ మఖన్‌లాల్ తన స్వస్థలంలోనే ఉండిపోయారు. కశ్మీరీ హిందూ కుటుంబాలు ఇప్పటికీ తమ పూర్వీకుల గృహాలకు తిరిగి రాలేకపోవడం ‘సాధారణ’ పరిస్థితులకు ఎలా అద్దం పడుతుంది? అమర్‌నాథ్ యాత్ర ఇప్పటికీ ఉగ్రవాద దాడుల భీతిలోనే జరుగుతుండడం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణను ఎలా సూచిస్తుంది? పాకిస్థాన్ ఐఎస్‌ఐ మద్దతుతో ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ ప్రభావ ప్రాబల్యాలను కశ్మీర్ లోయలో మరింతగా విస్తరించుకుంటున్నప్పుడు అదెలా ‘సాధారణ’మవుతుంది? లష్కరే మిలిటెంట్లకు పాకిస్థాన్ అన్ని విధాల ఆశ్రయమివ్వడం కొనసాగుతున్నప్పుడు పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరుస్తూ కశ్మీర్‌ను పాక్ కంఠ రక్తనాళంగా అభివర్ణిస్తున్నప్పుడు లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఎలా సాధ్యమవుతుంది? ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థానీ ‘విదేశీ’ ఉగ్రవాదులు, స్థానిక కశ్మీరీలతో కలిసి హింసాత్మక దాడులకు పాల్పడడం ప్రబలిపోయింది.
ఉపాధి, ఉద్యోగాలు లేని యువకులు ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటూ ఉపశమనం పొందడం ఎలా ‘సాధారణ’మవుతుంది? నిజమేమిటంటే సీమాంతర ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో వెనకటి ప్రభుత్వాలు విఫలమైనట్టే మోదీ సర్కార్ సైతం ఆ భయానక బెడదను నిర్మూలించలేకపోయింది. భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు, కశ్మీర్‌లో హింసాత్మక సంఘర్షణలకు పాకిస్థాన్ ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని పఠాన్‌కోట్ నుంచి పహల్గాం దాకా సంభవించిన ఉగ్ర బీభత్సాలు రుజువు చేస్తున్నాయి. పాకిస్థాన్ రాజ్య వ్యవస్థ ‘ఇస్లామీకరణ’ మాత్రమే కాకుండా మన సమాజంలో తీవ్రమవుతున్న మతపరమైన విభజనలు కూడా ఆ హింసాత్మక విధ్వంసాన్ని పురిగొల్పుతున్నాయి. రాజకీయ పక్షాలు, వాటి మద్దతుదారులు విద్వేషం, మత సంకుచితత్వాన్ని నిత్య వాస్తవాలుగా చేస్తున్నప్పుడు కశ్మీర్‌లో పరిస్థితులు ‘సాధారణస్థితి’లో ఎలా ఉంటాయి? హిందూ–ముస్లిం విబేధాలు మరింతగా పెరిగిపోయేందుకు దుష్ట పాకిస్థానీ సైనిక– రాజ్య వ్యవస్థ పహల్గాం ఉగ్రవాద ఘటనను ఉపయోగించుకుంటుంది. అటువంటి దుష్ట పన్నాగాలను మనం ముందస్తుగా ఎదుర్కోవాలి. పాకిస్థాన్ తన పైశాచిక చర్యలకు భారీ మూల్యం చెల్లించి తీరాలి. అవధులు లేని ఆగ్రహంలోను, అంతులేని ఆవేదనలోను మనం ఐక్యంగా ఉండాలి.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)