Adani Group: ఎల్‌ఐసీ పెట్టుబడులకు ఢోకా లేదు!
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:23 AM
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌతమ్ అదానీ కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టింది అంటూ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఆధారంగా...
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌతమ్ అదానీ కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టింది అంటూ అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఆధారంగా మన దేశ మీడియా ఎల్‌ఐసీ గురించి పలు అపోహలతో కూడిన ప్రచారాన్ని సాగిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అయితే, అతిత్వరలో ఎల్‌ఐసీ మునిగిపోతుందని ప్రచారం జరిగింది. వాషింగ్టన్ పోస్టు కథనం వెలువడిన మరుక్షణమే ఆదానీ సంస్థలో జరిగిన పెట్టుబడుల గురించి ఎల్‌ఐసీ పత్రికా ప్రకటన జారీ చేసింది కానీ ఈ ప్రకటనలోని అంశాలన్నీ సంపూర్ణంగా మీడియా ప్రచారంలోకి తేలేదు. ఎల్‌ఐసీ చట్టం: 1938 సెక్షన్ 27ఎ ప్రకారం మొత్తం నిధులలో 85శాతం ప్రభుత్వ ఆమోదం ఉన్న (గవర్నమెంట్ అప్రూవ్డ్) సెక్యూరిటీలలోను బాండ్లలోను పెట్టే నిబంధన ఉన్నది. మిగతా 15శాతం నిధులను మార్కెట్ అనుకూలతలను బట్టి ఇతర మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టే వెసులుబాటు ఉన్నది. ఎల్‌ఐసీ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టకూడదన్న నిబంధన ఏమీ లేదు. అయితే ఎల్‌ఐసీ పెట్టుబడులను నిర్దేశించడానికి సంస్థాగతంగా ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అజమాయిషీ ఉంటుంది. అన్ని నిర్ణయాలూ బోర్డ్ ఆమోదంతోనే జరుగుతాయి. నిర్ణయాలు పక్షపాతంతో జరిగినట్టు ఎప్పుడూ వెల్లడి కాలేదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది– స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇప్పటివరకూ ఎల్‌ఐసీ నామమాత్రమైన నష్టాన్ని కూడా చవిచూడలేదు. దీనికి ప్రధాన కారణం ఎల్ఐసీ ఒక దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయివుండటం. అంటే మార్కెట్లో ఎన్ని ఒడుదుడుకులు ఏర్పడినా సుదీర్ఘ కాలంలో పెరుగుదల తథ్యం.
ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడం ద్వారా ఏ కంపెనీకీ నిధులు బదిలీ చేయడం జరగదు. సాధారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినప్పుడు ప్రభుత్వ పెద్దల నుండి సూచనప్రాయ సందేశాలు ప్రజలకు వచ్చినట్టుగానే కంపెనీలకు కూడా వస్తాయి. అలాంటి సందర్భంలో మార్కెట్లను స్థిరపరచడానికి, కొన్ని కంపెనీల షేర్లు తక్కువ రేటుకు అందుబాటులో ఉన్న సందర్భంలో ఎల్‌ఐసీ వంటి సంస్థలు ముందుకొచ్చి ఆ షేర్లను కొనుగోలు చేస్తాయి. తర్వాత కాలంలో రెట్లు పెరగడం ద్వారా సంస్థ లాభపడి పాలసీదార్లకు పెద్ద మొత్తంలో బోనస్‌లు చెల్లించగలుగుతుంది. ఉదాహరణకు ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడులు పెట్టమని ప్రభుత్వం ఆదేశిస్తే, ఎల్‌ఐసీ ఆ పని పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం ఐడీబీఐ షేర్ రేటు స్టాక్ మార్కెట్లో పడిపోయినా, ఇప్పుడు ఎల్‌ఐసీ కొనుగోలు చేసిన రేటుకు ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఇలా గతంలో కూడా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యూటీఐ, సత్యం కంప్యూటర్స్ వంటి వాటి రేట్లు మార్కెట్లో తక్కువ ధర పలుకుతున్నప్పుడు ఎల్ఐసీనే కాక అనేక ఇతర సంస్థలు కూడా కొనుగోలు చేసి తాము లాభం పొందడమే కాక మార్కెట్‌లోనూ స్థిరత్వాన్ని నెలకొల్పారు. స్టాక్ మార్కెట్లను స్థిరంగా ఉంచడానికి ఎల్‌ఐసీ ఒక ప్రభుత్వరంగ సంస్థగాను, చిన్న మొత్తాలను పొదుపులుగా సేకరించి పెట్టుబడులుగా మార్చే సంస్థగాను ఇలాంటి పని బాధ్యతాయుతంగా నెరవేరుస్తూ ఉన్నది. అంతేగాక, కొత్తగా మార్కెట్‌లో నమోదవుతున్న కంపెనీలను ప్రోత్సహించడానికి కూడా ఎల్‌ఐసీ లాంటి సంస్థలు పరిమితులకు లోబడి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. ఈ ధోరణిని అనుసరించి– ప్రస్తుతం అదాని సంస్థలో ఎల్‌ఐసీ పెట్టినవి పెట్టుబడులే గాని నిధుల బదలాయింపు కాదు.
ఎల్‌ఐసీ ఒక పటిష్టమైన ప్రభుత్వ రంగ సంస్థ. కేవలం 3.5శాతం మాత్రమే వాటాలను స్టాక్ మార్కెట్లో విక్రయించింది. రానున్న రోజుల్లో మరో 10శాతం వరకు వాటాలను మార్కెట్లో ఉంచాలని, ఆ తదుపరి కాలంలో మొత్తంగా 25శాతం వాటాలను మార్కెట్లో ఉంచాలని సెబీ నిబంధనలు ఉన్నవి. ఇలా వాటాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగితే ప్రైవేట్ పెట్టుబడి పెరిగిపోతే, ఆ తరువాతి నిర్ణయాల్లో అధికారులపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎల్‌ఐసీ పెట్టుబడులకు ఇప్పుడున్న నిబంధనలు వర్తింపజేయడానికి కష్టం అవుతుంది. అందుచేతనే కాబోలు ఇన్సూరెన్స్ చట్ట సవరణలను సమూలంగా మార్పు చేయాలని, తద్వారా ఇప్పుడు ఏదైతే సెక్షన్ 27ఏ పెట్టుబడులను నిర్దేశిస్తున్నదో, దానిని పూర్తిగా మార్చివేసి ఇష్టానుసారంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వెసులుబాటును కల్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు సఫలీకృతమైతే అప్పుడు ప్రభుత్వం లేదా ప్రైవేట్ ప్రాబల్యంతో జరిగే నిర్ణయాలు ఎల్‌ఐసీ పెట్టుబడులను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతానికి ఎల్‌ఐసీ పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగానే ఉన్నది కాబట్టి తన నిధుల ఇన్వెస్ట్‌మెంట్‌ను నిబంధనలకు లోబడే కంపెనీలలో పెట్టుబడులుగా పెడుతున్నది. డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ (యుఎస్‌టీఆర్) ద్వారా భారత ఇన్సూరెన్స్ మార్కెట్‌ను నిర్దేశిస్తున్న ఐఆర్‌డీఏఐకి సూచనలు చేసే సాహసం చేస్తున్నది. ఇలా విదేశీ ఆర్థిక పెట్టుబడి ప్రాబల్యం పెరిగిన దరిమిలా, స్వదేశంలో జరుగుతున్న పెట్టుబడులపై ఆరా తీస్తూ వాషింగ్టన్ పోస్టు సదరు కథనాన్ని ఆశ్రిత పెట్టుబడి బదలాయింపుగా ప్రచురించినట్లు మనకు అర్థమవుతోంది. అందుచేత మీడియా సంస్థలు గానీ ప్రభుత్వ రంగ ఉన్నతిని కోరే మేధావులు గానీ దేశ అత్యున్నత సంస్థ ఎల్‌ఐసీ విధి విధానాలను లోతుగా అధ్యయనం చేకుండా దుష్ప్రచారాలకు ఆశ్రయమిస్తే– ప్రజల్లో గందరగోళం నెలకొని ప్రభుత్వరంగ ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తుంది.
-జి. తిరుపతయ్య