N.Krishna Reddy: తెలుగువారి అపురూప కళాస్రష్ట
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:54 AM
తెలుగులో ప్రాచీన చిత్రకళకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికి ఆధునిక చిత్రకళకు వందేళ్ల చరిత్ర మాత్రమే ఉంది.
తెలుగులో ప్రాచీన చిత్రకళకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికి ఆధునిక చిత్రకళకు వందేళ్ల చరిత్ర మాత్రమే ఉంది. రాజమహేంద్రవాసి దామెర్ల రామారావుతో ఆధునిక ఆంధ్ర చిత్రకళ చరిత్ర ప్రారంభమైంది. గత వందేళ్లలో వడ్డాది పాపయ్య, బాపు, కె. రాజయ్య, కె. లక్షాగౌడ్, అంట్యాకుల పైడిరాజు, సి.ఎస్.ఎన్. పట్నాయక్, బి.వి. నరసింహారావు, బి.ఎ. రెడ్డి, దేవగుప్తాపు శ్రీనాథ వుడయార్, జి. నరసింహారావు, గౌస్ బేగ్, పద్మశ్రీ ఎన్. కృష్ణారెడ్డి, పద్మశ్రీ ఎస్వీ. రామారావు, తోట నరసింహం తదితరులు మన చిత్రకళకు గుర్తింపు, గౌరవం తెచ్చారు.
వీరిలో కృష్ణారెడ్డి, ఎస్వీ రామారావులు చిత్రకళా సాధనతో పాటు బోధకులుగా కూడా పేరు పొందారు. కృష్ణారెడ్డి ప్రింట్ మేకింగ్‌లోను, రామారావు ఆధునిక చిత్రకళా రీతుల్లోను ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరిద్దరూ అమెరికాలో అత్యున్నత కళాకారులుగా పేరుపొందినా, మన రాష్ట్రంలో ఈ తరం చిత్రకారులకి వీరి గురించి అంతగా తెలియదు. అందుకు కారణం వీరు అమెరికాలో స్థిరపడటమే. చిత్రకళలో అనేక విభాగాలున్నాయి. అందులో ప్రింట్ మేకింగ్ అనేది భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అంతగా ప్రాచుర్యం పొందలేకపోయింది. విదేశాలలో ఈ కళాప్రక్రియకు ఎంతో ఆదరణ ఉన్నది. ఈ పద్ధతిలో చిత్రకారుడు అనుకున్న భావాన్ని ఒక జింక్ ప్లేటుపై గీసి, దానిని యాసిడ్‌లో ముంచితే, ఆ ప్లేటుపై చిత్రం గోచరిస్తుంది. దానిపై కావలసిన రంగులను వేసి, పేపరుపై ముద్రించడాన్ని ప్రింట్ మేకింగ్ అంటారు. ప్రింట్ మేకింగ్‌లో అనేక రకాలు, పద్ధతులు ఉన్నాయి. కాగితం, వస్త్రాలు, కలప, లోహం తదితరాలపై కూడా ముద్రించవచ్చు. ఎలక్ట్రానిక్ యుగం రాకముందు ప్రింట్ మేకింగ్ ద్వారానే ముద్రణలు జరిగాయి.
తెలంగాణకు చెందిన పి. గౌరి శంకర్, దేవరాజ్ డకోజీ, కె. లక్ష్మాగౌడ్, డి.ఎల్.ఎన్.రెడ్డి తదితరులు 1970 దశకంలో హైదరాబాద్ కేంద్రంగా ప్రింట్ మేకింగ్‌లో విశేష కృషి చేశారు. తరువాత దేవరాజ్ న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ గర్వి స్టుడియో విభాగాధిపతిగా పనిచేశారు. ప్రపంచంలో అగ్రశ్రేణి ప్రింట్ మేకరుగా గుర్తింపు పొందిన ఎన్. కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నందనూరులో 1925 జూలై 15న జన్మించారు. 1941లో శాంతినికేతన్‌లో ప్రఖ్యాత చిత్రకారుడు నందలాల్ బోస్ వద్ద శిష్యరికం చేసి, 1946లో ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందారు. తరువాత 1947–50 వరకు మద్రాసు కళాక్షేత్రంలోని కళా విభాగానికి అధిపతిగా వ్యవహరించారు.
అనంతరం లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన స్లేడీ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. పారిస్‌లో శిల్పకళలో ప్రసిద్ధి పొందిన శిల్పి జడ్కిన్‌తో, మిలాన్‌లో మెరినో మెరినోతో ప్రింట్స్ రూపొందించడంలో కలిసి పనిచేస్తూ చిత్రకళను అధ్యయనం చేశారు. 1965 నుంచి పారిస్‌లోని అటులియర్ 17 స్టూడియోకు అసోసియేట్ డైరెక్టర్‌గా, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్ విభాగానికి ప్రొఫెసర్‌గా పనిచేశారు. కృష్ణారెడ్డి రూపొందించిన ప్రింట్ మేకింగ్‌లో టెక్నిక్, శిల్పకళలోని ప్రతిభ అతనికి ఎనలేని గుర్తింపు తెచ్చాయి. ఆయన చిత్రాలలోని లావణ్యం, రంగుల సొగసు, భావనలో సౌందర్యం, నూతన రీతులు కళాభిమానులు, విమర్శకుల్ని మెప్పించాయి. వారి చిత్రాలు, శిల్పాలు నైరూప్యంగా ఉంటాయి. అలాగే చిత్రాల్లో వాడిన రంగులు ప్రత్యేకంగా ఉండి ఆలోచింపచేస్తాయి.
కృష్ణారెడ్డి చిత్ర, శిల్పకళా ప్రతిభ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1980లో విశ్వభారతి విద్యాలయం గగన్ అబానీ పురస్కారాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా బహుకరించారు. అదే సంవత్సరం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన్ని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1997లో అఖిలభారత లలిత కళల సంఘం వారిని ‘కళారత్న’ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రసిద్ధ చిత్రశాలల్లోనూ ఆయన చిత్రాలు ఉన్నాయి. ఆ మహాకళాకారుడు న్యూయార్క్‌లో 2018 ఆగస్టు 22న కన్నుమూశారు.
-సుంకర చలపతిరావు ,
కళారత్న అవార్డు గ్రహీత