Share News

Nitish Kumar Controversy: బిహార్‌లో నితీశ్‌ నైతిక దుర్మార్గం

ABN , Publish Date - Dec 25 , 2025 | 02:52 AM

ఒక ముఖ్యమంత్రి అలా ప్రవర్తించవచ్చునా? బిహార్‌లో పది రోజుల క్రితం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తన విధి నిర్వర్తిస్తూ అనూహ్యంగా అనుచిత రీతిలో వ్యవహరించడం...

Nitish Kumar Controversy: బిహార్‌లో నితీశ్‌ నైతిక దుర్మార్గం

ఒక ముఖ్యమంత్రి అలా ప్రవర్తించవచ్చునా? బిహార్‌లో పది రోజుల క్రితం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తన విధి నిర్వర్తిస్తూ అనూహ్యంగా అనుచిత రీతిలో వ్యవహరించడం పూర్తిగా ఆక్షేపణీయం. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో కొత్త ఆయుష్‌ (ఆయుర్వేద, హోమియోపతి, యునాని) వైద్యులకు నియామక లేఖల పంపిణీ కార్యక్రమమది. కొత్తగా నియమితురాలైన ఒక ముస్లిం మహిళా ఆయుష్‌ డాక్టర్‌కు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందజేస్తూ నితీశ్‌ మహాశయుడు ఆమె ధరించిన హిజాబ్‌ను పట్టుకుని ‘ఇదేమిటి?’ అని అడుగుతూ లాగివేశారు! ముఖ్యమంత్రి వెనుక నిలుచున్న ఉప ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి ముఖ్యమంత్రి ఆ అనుచిత చర్యకు పాల్పడకుండా నివారించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడే ఉన్న ఆరోగ్యమంత్రి మంగళ్‌ పాండేతో పాటు మరొక ఉన్నతాధికారి సైతం ముఖ్యమంత్రి వింత ప్రవర్తనను వారించకుండా నవ్వుతూ చూస్తుండిపోయారు. ముఖ్యమంత్రి నితీశ్‌ బహిరంగంగా పాల్పడిన ఆ చెడ్డ పని న్యాయస్థానం శిక్షింపదగిన నేరం. మామూలు నేరానికి మించిన అపరాధమది. ఆ మహిళా డాక్టర్‌ వ్యక్తిగత స్వేచ్ఛ, శారీరక సమగ్రత, గౌరవంపై దాడి అది (స్త్రీల శారీరక సమగ్రత లేదా స్వయంప్రతిపత్తిని గుర్తించడం కనీస సంస్కారం. పునరుత్పత్తి ఎంపికలు అంటే గర్భధారణ, గర్భనిరోధకం, గర్భస్రావం మొదలైన విషయాలలో స్వంత శరీరం గురించి స్వయంగా నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉన్నది. స్త్రీ స్వాభావిక విలువను గౌరవించకపోవడం, లైంగిక వేధింపులకు పాల్పడడం స్త్రీ వ్యక్తిత్వంపై అమానవీయ దాడి అవుతుంది. స్త్రీల శారీరక స్వయం ప్రతిపత్తిని ఆమె ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగ అధికరణ 21 గుర్తించింది. శారీరక సమగ్రతను గోప్యత, స్వేచ్ఛ మానవ గౌరవంతో అనుసంధానించింది). మహిళ నమ్రత లేదా సౌమ్యతకు భంగం కలిగించడానికి వ్యతిరేకంగా, స్ర్తీలకు రక్షణలు కల్పిస్తున్న నేర విచారణా చట్టం పరిధిలోకి స్త్రీ వ్యక్తిగత స్వేచ్ఛ, శారీరక సమగ్రత, గౌరవంపై దాడి చర్యలు వస్తాయి. అంతేకాదు, ప్రాథమిక న్యాయసూత్రాల వివేకం ప్రకారం మహిళా ఆయుష్‌ డాక్టర్‌ పట్ల ముఖ్యమంత్రి నితీశ్‌ అనుచిత ప్రవర్తన నైతిక దుర్మార్గం అవుతుంది. అటువంటి సిగ్గుమాలిన నైచ్యానికి పాల్పడిన వారిని పదవులు లేదా ఉద్యోగాల నుంచి తొలగించేందుకు దీన్ని తగిన కారణంగా న్యాయస్థానాలు దశాబ్దాల నుంచీ పరిగణిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్‌ బహిరంగ అనైతిక ప్రవర్తన రాజ్యాంగ హక్కులు అయిన గౌరవం, స్వేచ్ఛ, గోప్యతలను ఉల్లంఘించడమే, సందేహం లేదు. బిహార్‌ ముఖ్యమంత్రి ఉదంతంలో ఈ ఉల్లంఘన మనం గుర్తించవలసిన మరీ ముఖ్యమైన నేరం.


చెప్పవచ్చినదేమిటంటే ముఖ్యమంత్రి నితీశ్‌ చర్య ఆ బాధిత మహిళా డాక్టర్‌కే కాకుండా, ఆమె వలే ప్రభుత్వ సర్వీసుకు ఎంపికైన ఇతర మహిళా డాక్టర్లకూ మతస్వేచ్ఛ పరంగానే కాకుండా, జెండర్‌ సమానత్వం విషయంలో కూడా తక్షణ, ప్రతికూల పర్యవసానాలను తప్పక సృష్టించే అవకాశాన్ని సూచిస్తోంది. తప్పుడు ప్రవర్తనా రీతులకు కారకుడు అయిన ముఖ్యమంత్రి పాలనలో ఉండే పరిస్థితులు ముస్లిం మహిళలకు సురక్షితమైనవేనా? పాలనా వ్యవహారాలను నిర్దేశించే మంత్రి పదవులలో ఉన్నవారు, ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు బహిరంగంగా నైతిక నైచ్యానికి నిర్భయంగా పాల్పడేందుకు అనుమతిస్తున్న పరిస్థితులలో, మహిళలు నిశ్చింతగా విధులు నిర్వర్తించేందుకు వీలైన పని ప్రదేశాలు ఉంటాయా? ఇప్పుడు సమస్త న్యాయస్థానాలూ స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయని వక్కాణిస్తున్నాయి. మహిళా గౌరవం, స్వయం ప్రతిపత్తి గురించి గంభీరంగా మాట్లాడుతున్నాయి. అయితే కోర్టుల వెలుపల విశాల సమాజంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

నైతిక దుర్మార్గ చర్య (Act of Moral Turpitude)ను ఒక సుప్రసిద్ధ అమెరికన్‌ నిఘంటువు ఇలా నిర్వచించింది: ‘సమాజం మనోభావాలను, ఆమోదిత ప్రవర్తనా ప్రమాణాలను ఉల్లంఘించే చర్య’. మరింత స్పష్టంగా చెప్పాలంటే సాధారణ లేదా కనీస నైతికతకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వడమే. మరొక ప్రసిద్ధ నిర్వచనాన్ని కూడా చూద్దాం. ఒక మనిషి తోటి మనుషులు, సమాజం పట్ల నిజాయితీని, న్యాయవర్తనను నీచంగా, హీనంగా, క్షుద్రంగా ఉల్లంఘించడమే నైతిక దుర్మార్గం. అంగీకృత, ఆచారబద్ధమైన విధులు, విధ్యుక్త ధర్మాలకు విరుద్ధంగా వ్యవహరించడం నైతిక దుర్మార్గమవుతుందని Black's Law Dictionary పేర్కొంది. ‘చట్టపరమైన శిక్షతో సంబంధం లేకుండా, స్వాభావికంగా దుర్మార్గమైన చర్య’ నైతిక దుర్మార్గమని మరొక నిఘంటువు నిర్వచించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే నైతిక దుర్బలత్వాన్ని కలిగి ఉన్న చర్య నైతిక దుర్మార్గం కిందకు వస్తుంది. న్యాయం, నిజాయితీ, సువ్యవస్థిత ప్రవర్తనా ప్రమాణాలకు విరుద్ధమైన చర్యలు నైతిక దుర్మార్గాలు. నైతిక దుర్మార్గ చర్యల అపరాధాలకు పాల్పడిన వ్యక్తులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ, సర్వీసు ప్రయోజనాలను నిరాకరిస్తూ తీర్పులు వెలువరించినప్పుడు న్యాయస్థానాలు తరచూ ఈ నిర్వచనాలను పునరుద్ఘాటించడం పరిపాటిగా ఉన్నది.


ఒక మహిళ నమ్రత లేదా సౌమ్యతకు భంగం కలిగించే నేరాన్ని భారతీయ న్యాయసంహిత సెక్షన్‌ 74 (ఐపీసీ సెక్షన్‌ 354) ఇలా నిర్వచించింది: ‘ఒక మహిళ నమ్రత లేదా సౌమ్యతను దెబ్బతీసే ఉద్దేశంతో చేసే దాడి లేదా నేరపూరిత బలప్రయోగం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక మహిళ మర్యాదకు భంగం కలిగించే ఉద్దేశం ఏ విధంగా వ్యక్తమైనా అది శిక్షార్హమే అవుతుంది. ఇందుకు ఏడాది కాలం జైలుశిక్షతో పాటు, జరిమానా అనివార్యమవుతుంది. ఈ శిక్షను ఐదు సంవత్సరాల పాటు పొడిగించేందుకు అవకాశమున్నది’. కేరళ హైకోర్టు గత ఆగస్టులో వెలువరించిన ఒక తీర్పు ఇలా పేర్కొంది: ‘354 ఐపీసీ ప్రకారం... జరిగిన నేరాలు కేవలం ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తిగత అపరాధాలు మాత్రమే కాదు, అవి సమాజం అంతరాత్మను దెబ్బతీసే నేరాలు. వీటి విషయంలో ఎటువంటి రాజీ అభిలషణీయం కాదు. ఎందుకంటే రాజీ అనేది అటువంటి నేరాలను మరింత నిర్భయంగా పాల్పడేందుకు ప్రోత్సహిస్తుంది’.

బిహార్‌ ముఖ్యమంత్రి ప్రవర్తన ఆ మహిళా ఆయుష్‌ డాక్టర్‌ను బహిరంగంగా అవమానించడమే అవుతుంది. పైగా ఆ సమయంలో అక్కడ ఉన్నవారు మౌనంగా, నవ్వులు చిందిస్తూ ఉండిపోవడం మరింత ఘోరం. ఇది పూర్తిగా గర్హనీయం. ఈ నైతిక అపరాధానికి పాల్పడిన వారిని న్యాయస్థానం స్వయంగా చొరవ తీసుకుని శిక్షించాలి. ప్రభుత్వ బాధ్యతల నిర్వహణ నుంచి తొలగించడమే కాకుండా జరిమానాలు విధించాలి.

ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ చర్య భారత రాజ్యాంగ అధికరణ 25 కింద హామీపడిన మత స్వేచ్ఛపై దాడి కూడా అనడంలో సందేహం లేదు. ముస్లిం మహిళల హిజాబ్‌ విషయమై భారతీయ న్యాయస్థానాలలో ఏకాభిప్రాయం లేదు. నిజమే, అయితే దేశ చట్టాలలో ఏదైనా హిజాబ్‌ను లాగివేసేందుకు అనుమతిస్తుందా అనే విషయమై పౌరులుగా మనమూ, సమస్త న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా పరిశీలించాలి. హిజాబ్‌ను, దాన్ని ధరించిన మహిళ అనుమతి లేకుండా తొలగించడం లేదా లాగివేయడమనేది విస్తృత పర్యవసానాలకు దారితీసే దురాగతం. ముఖ్యమంత్రి లాంటి ఉన్నతపదవిలో ఉన్న వ్యక్తి అటువంటి చర్యకు పాల్పడితే... అది దుష్ట తలంపులు ఉన్న మూకలు అలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు ప్రేరణాత్మకం కాదా?


మానవ గౌరవం (హ్యూమన్‌ డిగ్నిటీ) భారత రాజ్యాంగ ప్రాథమిక, నియమబద్ధమైన ప్రాతిపదిక అని పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు తీర్పు స్పష్టం చేసింది. మానవ గౌరవం అనేది మానవ హక్కులకు మూలంగా, మార్గదర్శక సూత్రంగా, ఏకీకృతశక్తిగా పనిచేస్తుందని ఆ తీర్పు ఉద్ఘాటించింది. 2017లో తొమ్మిదిమంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా గోప్యత అనేది అధికరణ 21 కింద హామీపడిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని ధ్రువీకరించింది. ఆ తీర్పు ఇంకా ఇలా పేర్కొంది: వ్యక్తిగత గోప్యత లేదా ఏకాంత జీవనహక్కు అనేది ఒక వ్యక్తి గౌరవంలో చాలా విశిష్టమైన విషయం. అది లేకుండా గౌరవం అనేది ఉండదు. అవి అవినాభావ సంబంధమున్న జీవిత విలువలు. మానవ గౌరవం రాజ్యంగ ఆత్మ. అది రాజ్యాంగాన్ని చైతన్యవంతం చేస్తుంది. చట్టపరమైన నియమాలను, స్వేచ్ఛ సమానత్వ, న్యాయం కోసం బాధ్యతలుగా మారుస్తుంది’. దేశ రాజకీయ పరిస్థితులు అంతకంతకూ మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా మారిపోతోన్న ప్రస్తుత తరుణంలో మానవ గౌరవం, ప్రాథమిక హక్కుగా గోప్యతకు సంబంధించిన న్యాయశాస్త్ర సిద్ధాంతాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరమున్నది. గోప్యతను చట్టపరమైన భావనగా కాకుండా ప్రజాస్వామ్య సమాజంలో మానవ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛను సాధించేందుకు ఒక అనివార్యమైన షరతుగా పటిష్ఠపరచాలి. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బహిరంగ దుష్ప్రవర్తన పర్యవసానాలను తక్కువగా అంచనా వేయకూడదు. ఆయన చర్య వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి. అవును, అది వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి. ప్రతి ఒక్కరూ దానిని అలానే అర్థం చేసుకోవాలి.

కల్పన కన్నబిరాన్‌

సామాజిక శాస్త్రవేత్త

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..

Updated Date - Dec 25 , 2025 | 06:01 AM