Share News

ఇసుక అక్రమాలను ఈ విధానం అరికడుతుందా?

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:06 AM

‘ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని... కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచొచ్చని..’ హైదరాబాద్‌ ఐసీసీసీలో ఇటీవల జరిగిన గనుల శాఖ సమీక్షా సమావేశంలో...

ఇసుక అక్రమాలను ఈ విధానం అరికడుతుందా?

‘ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని... కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచొచ్చని..’ హైదరాబాద్‌ ఐసీసీసీలో ఇటీవల జరిగిన గనుల శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇది మంచి విషయమే. కానీ, క్షేత్ర స్థాయిలో జరిగే అక్రమ, చట్ట విరుద్ధ ఇసుక దోపిడీకి అవధులు లేవు. ‘కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించడం, ఆ తరువాత రేట్లు పెంచి అమ్ముకోవడం, నకిలీ వే బిల్లులు, నంబర్‌ ప్లేట్లు మార్చి ఇసుక రవాణా, తదితర అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని యోచిస్తున్నది...’ అని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ, ఈ కొత్త పాలసీ నిజంగా అక్రమ, చట్ట విరుద్ధ ఇసుక తవ్వకాలను అడ్డుకొంటుందా?


గత ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ అక్రమార్కులకు కాసులు కురిపించింది. స్థానిక నేతలు, క్రింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు మామూళ్ళు భారీగా చేతులు మారటంతో అంతా చూసీ చూడనట్లుగానే వ్యవహారం సాగిందనేది విదితమే. ఇసుక టెండరుదారులు కొన్ని చోట్ల లారీ యజమానుల నుంచి లోడింగ్‌ ఛార్జీ పేరుతో ప్రతి లారీకి రూ.2,500 వరకు వసూలు చేశారు. అలాగే 10 టైర్ల లారీలు 19.5 టన్నులు, 12 టైర్ల లారీలు 26 టన్నులు, 14 టైర్ల లారీలు 32 టన్నుల ఇసుక తరలించాల్సి వుండగా, ‘అదనపు బకెట్‌’ పేరుతో ప్రతి లారీలో ఐదారు టన్నుల ఇసుకను అదనంగా నింపారు. ఇందుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేశారు. అలాగే లారీల నెంబరు ప్లేట్లు మార్చటం, నకిలీ వే బిల్లులతో వందలాది లారీల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకొన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి హయాంలోనూ జరుగుతున్నదదే. విచ్చలవిడిగా అక్రమార్జన కోసం చేస్తున్న సహజ వనరుల విధ్వంసం భవిష్యత్‌ తరాలకు విధ్వంసమే మిగిలించే ప్రమాదం ఉంది.

రాష్ట్రంలో గోదావరి నదికి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు 1465 కిలోమీటర్ల తీరం ఉంది. కానీ, ఇసుక అక్రమ తవ్వకాల వల్ల తీరని నష్టం జరుగుతున్నది. దీనిని అరికట్టాలి. ‘సొసైటీల’ పేరిట బినామీ కాంట్రాక్టర్లు గోదావరి తీరంలో ఇష్టారీతిన వ్యవహరిస్తూ అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ, అమాయక సొసైటీ సభ్యులను నష్టపరుస్తూ, కోట్లు గడిస్తున్నారు. వీరు వాస్తవానికి 3.5 మీటర్లు గల ఇసుక మేటలనే తీయాలి. కానీ, హద్దూ పద్దూ లేకుండా తోడేస్తున్నారు. ఈ విధానం, ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నది. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఒక కొత్త జీవో ద్వారా ఇసుక అమ్మకాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూనుకొన్నది. ఇందుకోసం టీజీఎండీసీతో బినామీలకు కాంట్రాక్టు దక్కే విధానం నిర్ణయించింది. వీటి ద్వారా 2014–15లో 1.83 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చి, రూ.19.12 కోట్లు గడించింది. 2023–24లో రూ.1000 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కాంట్రాక్టర్లు అక్రమంగా లెక్కలేనన్ని కోట్లు సంపాదించారు. ఇక్కడ అటవీ, ఆదివాసీ చట్టాలతోపాటు వాల్టా చట్టం కూడా ఉల్లంఘిస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో యంత్రాలను వాడరాదు. మితిమీరిన ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటడమేగాక, గోదావరి నీటి ప్రవాహ గమనం కూడా మారుతున్నది. తీరంలో గతంలో నీటి నిల్వలున్న ప్రాంతం ఎడారిగా మారుతున్నది. ఈ సంవత్సరం మార్చిలోనే భద్రాచలం వద్ద గోదావరి పీలికలాగా కనపడీ కనపడనట్లున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహజ వనరులకు పుట్టినిల్లు. గోదావరి, కిన్నెరసాని వంటి నదులతో పాటు పాములేరు, ముర్రేడు, బుగ్గవాగు, తాలిపేరు, పెద్దవాగు వంటి నదులున్నాయి. వీటి నుంచి పరిసర గ్రామాల పేదలు ఒకప్పుడు ఎడ్లబండ్లతో ఇసుక సరఫరా చేస్తూ జీవనోపాధి పొందేవారు. అయితే, కాలక్రమంలో ఇసుక మాఫియా పుట్టింది. ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక తరలించి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. ‘లైసెన్స్‌ ఉంద’నే పేరిట చట్టవిరుద్ధంగా వారు పొందిన హద్దులు దాటి ఒక పర్మిట్‌తో ఎన్నో రెట్లు తోడుకొంటున్నారు. దీంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. నది ప్రవాహం ఉన్నప్పుడు ఇసుక గోతుల్లో పడి ప్రజలు చనిపోతున్నారు. 2025లో ఈ ప్రాంతంలో ఇసుక లారీ ప్రమాదాలలో ఆరుగురు చనిపోయారు.


అక్రమ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనివల్ల రైతుల బోర్లు, చెరువులు ఎండిపోతున్నాయి. పంట నష్టం జరుగుతున్నది. అక్రమ ఇసుక రవాణా కోసం నదిలోనే రోడ్లు వేస్తున్నారు. ఇసుక క్వారీల నుంచి ఆర్‌ అండ్‌ బి రోడ్లు మీదికి అమితమైన బరువుతో (32టన్నులకు మించి 72టన్నుల వరకు) లారీలు ప్రయాణించడం వల్ల రోడ్లు గుల్లవుతున్నాయి. దుమ్ము, ధూళితో పరిసర గ్రామస్తులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటలపై దుమ్ము పడి దిగుబడి తగ్గుతున్నది. సంబంధిత అధికార్లకు తెలిపినా వారు పట్టించుకోవడం లేదు. ఇది ముఖ్యంగా చర్ల ప్రాంతంలోని సి–కత్తి గూడెం ఇసుక క్వారీలో జరుగుతోంది. వాస్తవానికి నదుల్లో మేటవేసిన ఇసుకనే తీయాలి. అది కూడా నిర్ణీత పరిమాణంలో తీయాలి. కానీ, ఇందుకు భిన్నంగా జరుగుతున్నది. ఈ విషయం ఎవరైనా గ్రహిస్తారేమోననే గుండాలను సైతం కాపలా పెట్టుకొంటున్నారు. ఇసుక క్వారీ ప్రాంతాలను పరిశీలించడానికి ఎవరినీ రానీయటం లేదు.

అక్రమ ఇసుక తవ్వకాల వల్ల కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాలు వేగంగా క్షీణించటంతో యాసంగి పంటలకు పెనుముప్పుగా మారుతోంది. ప్రస్తుతం వివిధ పంటలు కీలక దశలో వుండగా, భూగర్భ జలాలు ఇంకిపోవడం వీటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ మండలాల్లో భూగర్భ జలాలు భూగర్భ మట్టానికి 5.09 మీటర్ల దిగువన నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఇవి 5.44 మీటర్లకు పడిపోయాయి. రైతులు కొత్త బోరు బావులను అధిక లోతుతో తవ్వుతున్నా ఫలితం కనిపించక ఆవేదన చెందుతున్నారు.

ఈ పరిస్థితుల్లో నదీ జలాల రక్షణ చాలా ముఖ్యమైన విషయం. జీవవైవిధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పర్యావరణం, వ్యవస్థలను పోషించటంలో నీటి పాత్ర ఎనలేనిది. అడవులు, మైదానాలు, చిత్తడి నేలలు, తీర ప్రాంతాలతో పాటు సముద్రాల్లోని జీవులకు అవసరమైన పోషకాలను అందించేవి ఈ జలవనరులే. తాగునీటికి, సాగునీటికి మనం ఎక్కువగా ఆధారపడుతున్నది నదులపైనే. అందుకే నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది. ‘మన రాజ్యాంగంలోని 51వ అధికరణం ప్రకారం నదులు, సరస్సులు, అడవులతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించడం పౌరుల బాధ్యత. నదులను పూజించే మన దేశంలో ఏ నదీతీరాన్ని చూసినా కాలుష్యం, ఇసుక దోపిడీ కనిపిస్తాయి’. పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు పట్టణీకరణ వేగంగా విస్తరిస్తుండటంతో దేశంలోని నదులకు హాని కలుగుతోంది. తీరప్రాంతాల్లో వెలసిన గ్రామాలు కాలక్రమంలో పట్టణాలు, నగరాలుగా విస్తరించాయి. ఈ పరిణామంతో నదులు ఆక్రమణకు, కాలుష్యానికి గురవుతున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి నియంత్రణ) చట్టం 1957 ప్రకారం ఇసుక చిన్న ఖనిజాల జాబితాలోకి వస్తుంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1996, పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) 2006 నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు పొందిన నిర్దేశిత ప్రాంతాలలో పరిమితులలోనే ఇసుక తవ్వకాలు జరపాలి. 1980 ఫారెస్టు కన్సర్వేషన్‌ యాక్టును కూడా పరిగణనలో ఉంచుకోవాలి.


గోదావరిలో ఇసుక అక్రమ తవ్వకాలను నివారించాలన్నా, సహజ వనరులను రక్షించుకోవాలన్నా మైనింగ్‌, అటవీ పరిరక్షణ, పెసా వంటి చట్టాల నిబంధనలు కచ్చితంగా అమలు జరుపాలి. రాష్ట్ర ప్రభుత్వమే ఇసుక తవ్వకాలు చేపట్టాలి. స్థానిక అవసరాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలి. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల జరిగే రహదారుల నష్టాలను, రైతులకు జరిగే పంటల నష్టాలను అరికట్టాలి. ప్రస్తుత అక్రమాలపై సీబీసీఐడి చేత విచారణ చేపట్టి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కాక, భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలా ప్రభుత్వాలు చేయని ఎడల రాజ్యాంగంలోని 51వ అధికరణ పౌరులకు కల్పించిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజలే వనరుల రక్షణకు ఉద్యమించాలి.

కెచ్చెల రంగారెడ్డి

సీపీఐ(ఎం.ఎల్‌) నాయకులు

Updated Date - Apr 09 , 2025 | 05:06 AM