Pakistan Saudi Defense Pact: పాక్ సౌదీ కొత్త దోస్తీ
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:16 AM
పాకిస్థాన్ మీదకు భారత్ యుద్ధానికి వస్తే, పాకిస్థాన్ పక్షాన సౌదీ అరేబియా కూడా ఇకమీదట పోరాడుతుంది కనుక, గతంలో మాదిరిగా కాక...
పాకిస్థాన్ మీదకు భారత్ యుద్ధానికి వస్తే, పాకిస్థాన్ పక్షాన సౌదీ అరేబియా కూడా ఇకమీదట పోరాడుతుంది కనుక, గతంలో మాదిరిగా కాక, రాబోయే రోజుల్లో భారత్ జాగ్రత్తగా మెలగాల్సిందేనని పాక్ రక్షణమంత్రి వ్యాఖ్యల పరమార్థం. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నియమం ఏమీ లేదని కూడా ఆయన గుర్తుచేశారు. సౌదీ దగ్గర అణ్వాయుధాలున్నాయో లేదో అనవసరం కానీ, పాకిస్థాన్ వద్ద కచ్చితంగా ఉన్నాయి కనుక, సౌదీ మీదకు ఇరాన్, ఇజ్రాయెల్ సహా ఎవరు దాడికి దిగినా అణ్వస్త్రాలను ఎదుర్కోవాల్సిందేనని అర్థం. ఎందుకూ కొరగాని ఈ తరహా ఒప్పందాలు చాలా దేశాల మధ్య జరుగుతూంటాయి కనుక భారత్ దీనిని ఏ మాత్రం ఖాతరుచేయనక్కరలేదని రక్షణరంగ నిపుణుల అభిప్రాయం. ఈ ఒప్పందం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు, కాబోదని కూడా పాకిస్థాన్ హెచ్చరిస్తున్నందున మరిన్ని దేశాలు వచ్చిచేరి ఇస్లామిక్ నాటో ఆవిర్భవించవచ్చునని కొందరు అతిగా లెక్కలేస్తున్నారు కూడా. పహల్గాం ఉగ్రదాడికి భారత్ దీటుగా సమాధానం ఇవ్వడంతో పాకిస్థాన్‌లో వొణుకుపుట్టి ఈ ఒప్పందం చేసుకుందని నరేంద్రమోదీ అభిమానులు అంటున్నారు. ఆ ఘర్షణలో చైనా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాకిస్థాన్‌కు సర్వసహాయాలూ అందించిన తరువాత, అమెరికా కూడా పాకిస్థాన్ వైపే ఉంటున్న ఈ కాలంలో సౌదీ సాయం దానికి ఎందుకు అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఏతావాతా, పాక్ ఆర్మీతో మరో దఫా మనం తలపడాల్సివస్తే సౌదీని కూడా లెక్కబెట్టుకొని మరీ రంగంలోకి దిగాలన్నమాట. ఒకరిని కొడితే మరొకరిని కొట్టినట్టేనని ఈ రక్షణ ఒప్పందం అంటోంది మరి. ఈ మిత్రదేశాల మధ్య ఇప్పటివరకూ అనధికారికంగా అమలులో ఉన్న అవగాహన ఈ ఒప్పందంతో అధికారికమైంది. రెండుదేశాల మధ్య ఉన్న సైనికబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1960లలో మక్కామదీనాను కాపలాకాయడం నుంచి సౌదీ రాజకుటుంబానికి రక్షణకల్పించడం వరకూ పాక్ సైనికబలగాలు ప్రశస్తమైన పాత్ర పోషించాయి. అలాగే, సౌదీ సొమ్ము పాకిస్థాన్‌లోకి నిరవధికంగా ప్రవహించి అది తన అణ్వస్త్రకార్యక్రమాన్ని సజావుగా సాగించడానికి కూడా ఉపకరించిందంటారు.
ట్రంప్ దయవల్ల పాకిస్థాన్‌తో ఇప్పుడు చాలా దేశాలు స్నేహాన్ని పెంచుకుంటున్న తరుణంలో, సౌదీతో ఈ అధికారిక ఒప్పందం దానికి రక్షణకంటే, పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ వేదికమీద మరింత విలువ, గౌరవం పెంచుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఒక ప్రాంతీయశక్తిగా కాక, అరబ్‌ప్రపంచానికి గుండెకాయవంటి ఒక దేశానికి రక్షణకల్పిస్తున్న దేశంగా పాక్ అవతరించినట్టయిందని అంటున్నారు. ముస్లిం ప్రపంచాన్ని కాపాడుతున్నది తామేనని పాక్ ప్రజలకు ఆత్మసంతృప్తి కలిగించడంతోపాటు, ప్రస్తుత పాలకుల పట్ల వారిలో ఉన్న చులకన భావాన్ని తగ్గించేందుకు కూడా ఈ ఒప్పందం ఉపకరించవచ్చు. అమెరికాను, మరీ ముఖ్యంగా ట్రంప్ ఏలుబడిలో అది ఉన్నంతకాలం, దానిని తన రక్షణకవచంగా నమ్ముకొని కూచుంటే మునిగిపోతామన్న భయం సౌదీకి కలగడంలో ఆశ్చర్యమేమీలేదు. ట్రంప్ అండతో ఇజ్రాయెల్ సరిహద్దులు దాటుతోంది, శ్రుతిమించిపోతోంది. ఖతార్‌లోకి కూడా చొరబడి దెబ్బతీసేంత దుస్సాహసానికి కూడా తెగబడింది. పైగా, ట్రంప్ దానిని తేలికగా తీసిపారేయడం గల్ఫ్ దేశాలకు భద్రత భయం కలిగించింది. ఈ పరిస్థితుల్లో ఒక అణ్వస్త్రదేశంతో అధికారిక రక్షణ ఒప్పందం సౌదీకి భరోసానివ్వడంతోపాటు, శత్రువులను హద్దుల్లో ఉంచడానికి ఉపకరిస్తుంది. నిజంగానే సౌదీకి విపత్తు ఏర్పడితే, పాకిస్థాన్ తన భద్రతను కూడా ఫణంగా పెట్టి సౌదీ పక్షాన కదనరంగంలోకి దూకుతుందా, అణ్వాయుధాలు వాడుతుందా అన్న ప్రశ్నలకు నిర్దిష్టమైన సమాధానాలు ఉండవు. కానీ, ఒకరికోసం ఒకరు నిలబడి, ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని ఈ ఒప్పందం చెబుతోంది కనుక, సౌదీ శత్రుదేశాలతో, మరీముఖ్యంగా ఇరాన్‌తో, ఇంకా అవసరమైతే ఇజ్రాయెల్‌తోనూ అది ఘర్షణకు దిగవలసి ఉంటుంది. ఖతార్ మీద ఇటీవలి ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో, సౌదీ ఈ ఒప్పందం ద్వారా అరబ్ దేశాలకు కొత్తదారి చూపించింది. ఇక, భారతదేశంతో పాకిస్థాన్ ఏ స్థాయిలో ఘర్షణపడినా, భారీ ఆర్థికసాయంతో ఆదుకోవడం, దౌత్యపరంగా భారత్ మీద ఒత్తిడిపెంచడం వినా ప్రత్యక్షంగా పాకిస్థాన్ పక్షాన, భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధరంగంలోకి సౌదీ దిగే అవకాశాలు లేవు. కనుకనే, సౌదీతో తనకున్న దశాబ్దాల మైత్రి గురించి ఓ నాలుగు మంచిమాటలు వల్లించడం వినా ఈ ఒప్పందం గురించి భారత్ లోతుగా వ్యాఖ్యానించలేదు, ఆందోళన పడుతున్నట్టు కనబడలేదు.