Share News

Minister Sridhar Babu: క్షతగాత్ర దేశాన్ని నిలబెట్టిన నాయకత్వం

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:13 AM

నవ భారత రూపశిల్పి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టినరోజు సందర్భమిది. తరాలెన్ని గడుస్తున్నా పసిపిల్లల హృదయాల్లో ఎప్పటికీ చాచాగా సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న అరుదైన నేత ఆయన.

Minister Sridhar Babu: క్షతగాత్ర దేశాన్ని నిలబెట్టిన నాయకత్వం

నవ భారత రూపశిల్పి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టినరోజు సందర్భమిది. తరాలెన్ని గడుస్తున్నా పసిపిల్లల హృదయాల్లో ఎప్పటికీ ‘చాచా’గా సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న అరుదైన నేత ఆయన. బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు మాత్రం దాదాపు పదకొండేళ్లుగా ఆయనంటే ద్వేషం. చరిత్రలో లేనివన్నీ నెహ్రూకు ఆపాదించి ఆయనను కించపరచాలని చూస్తాయి. ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం. జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు సర్దార్‌ పటేల్‌ ప్రయత్నించగా నాటి ప్రధాని నెహ్రూ అనుమతించలేదని ఆయన చెప్పిన మాట పూర్తిగా కట్టుకథ. నిజానికి వారిద్దరూ సమష్టిగా జమ్మూకశ్మీర్‌ విలీనానికి కృషి చేశారు. అంతేకాదు, అప్పట్లో బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్, హిందూమహాసభ, ఆరెస్సెస్‌ నేతలు కశ్మీర్‌లో త్రివర్ణ పతాకానికి బదులు మహారాజా హరిసింగ్‌కు సంబంధించిన జెండా ఎగురవేశారు. పైగా దాన్ని స్వతంత్ర దేశంగా మనగలిగేలా చూడమని డిమాండ్‌ చేశారు. ఆ ప్రాంత ఆక్రమణ కోసం పక్కనే పాకిస్థాన్‌ కాచుకుని కూర్చున్నప్పుడు ఇటువంటి అనాలోచిత డిమాండ్‌ ఎవరైనా చేస్తారా? చరిత్ర తెలియదు. తెలుసు కునే ప్రయత్నం చేయరు. కనీసం నెహ్రూ–పటేల్‌ మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాలను చదవరు. కేవలం నెహ్రూపై ద్వేషమే వారితో ఇన్ని అబద్ధాలాడిస్తోంది. ఇదొక్కటే కాదు, ‘వందేమాతరం’ గీతంలో కేవలం రెండు చరణాలే ఉంచాలని 1937లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్‌ శాసించిందట! అది అనంతరకాలంలో దేశ విభజనకు బీజం వేసిందట! చరిత్రలోని ముఖ్య ఘట్టాలన్నిటికీ సాక్ష్యాధారాలు ఉంటాయని, అవి బయటికి వస్తే నగుబాటు పాలవుతామని సంఘ్‌ పరివార్‌ నాయకులకు కాస్తయినా బెదురూ, భయం ఉండవు. ఆనాటికి వివిధ సంస్థానాల్లో ఎవరికి తోచిన రీతిలో వారు జాతీయగీతాలుగా వేర్వేరు గీతాలను పాడుతుండగా అన్నిచోట్లా ఒకటే ఉండేలా 1937 అక్టోబర్‌లో కలకత్తాలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ సమావేశంలో గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, రాజేంద్రప్రసాద్, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వంటి హేమాహేమీలున్నారు.


కాంగ్రెస్‌ బెంగాల్‌ ప్రొవిన్షియల్‌ మహాసభ బరిశాల్‌లో 1906లో ఎ.రసూల్‌ ఆధ్వర్యంలో జరిగినప్పుడు... ఆ గీతాన్ని పాడినందుకు పోలీసులు అత్యంత క్రూరంగా లాఠీచార్జి చేయగా, ప్రతినిధులు రెచ్చిపోయి ఆ గీతాన్ని మరింత ఎలుగెత్తి ఆలాపించారు. ఆనాటి నుంచీ ‘వందేమాతరం’ బెంగాల్‌లో రాజ్య ధిక్కారానికి ప్రతీక అయింది. స్వాతంత్య్రోద్యమం సమయంలో బ్రిటిష్‌వారి పంచన చేరి ద్రోహం చేసినవారి వారసులకు ఇదంతా ఎలా తెలుస్తుంది? నెహ్రూను నిందించటమంటే ఆయన చేతులమీదుగా పురుడుపోసుకున్న నవ భారత నమూనాను తృణీకరించటమే. నెహ్రూ 1947లో దేశ సారథిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి దేశం శకలాలుగా విడిపోయి వుంది. 560 సంస్థానాలను కొత్తగా ఆవిర్భవించిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాల్సిన బృహత్తర కర్తవ్యం ఆయన ముందుంది. ఇందుకోసం ఆయన, సర్దార్‌ పటేల్, సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారి వి.పి.మీనన్‌ ఒక్కటిగా కలిసి నడిచి ఏకశిలాసదృశమైన ప్రజాతంత్ర భారత్‌ ఆవిర్భవించడానికి దోహదపడ్డారు. దేశ స్వాతంత్య్రం కోసం నెహ్రూ దాదాపు తొమ్మిదేళ్లపాటు కారాగారవాసం చేశారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. కానీ బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ ఆరెస్సెస్‌ నాయకులు దీనికి దూరంగా ఉండిపోయారు. ‘అతి సామాన్యుడు దారిద్య్రాన్ని, అజ్ఞానాన్ని, వ్యాధులనూ ఎదుర్కొనటానికి, వాటిని రూపు మాపటానికి సాగించే పోరాటం కోసం అతడికి స్వేచ్ఛ, అవకాశమూ కల్పించాలంటే మనం ఏ దిశగా పోవాలి? మన ప్రయత్నం ఏమై ఉండాలి?’ అని ప్రశ్నించారాయన. సంపద్వంత, ప్రజాతంత్ర, పురోగామి దేశ నిర్మాణానికి ఇవే గీటురాళ్లని ప్రకటించారు. ఈ దార్శనికత పంచవర్ష ప్రణాళికల్లో ప్రతిఫలించింది. దేశాభివృద్ధికి కారణమైంది. ‘మార్కెట్‌ నిర్మించలేని చోటకు రాజ్యం వెళ్లితీరాలి’ అన్నది నెహ్రూ దృఢ విశ్వాసం. ఈ విశ్వాసమే ప్రభుత్వరంగ సంస్థల సముచ్ఛయానికి దారితీసింది. 1956లో బీహెచ్‌ఈఎల్‌ పరిశ్రమల అభివృద్ధికి అంకురార్పణ చేసింది. హెచ్‌ఏఎల్‌, బెల్‌, హెచ్‌ఎంటీలు కచ్చితత్వ ఇంజనీరింగ్, విమానయాన రంగాలకు పునాదిగా నిలిచాయి.


భిలాయ్, రూర్కేలా, దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగారాలు భారత స్వావలంబనకు ప్రతీకలుగా భాసిల్లాయి. ఎయిరిండియా, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీల సృష్టి రవాణా, ఇంధన మౌలిక సదుపాయాలను దృఢతరం చేశాయి. విఖ్యాత శాస్త్రవేత్త హోమీ బాబా సారథ్యంలో 1948లో నెహ్రూ అణు ఇంధన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దేశ అణు పరిశోధనకు ఇది పునాదిగా నిలిచింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడే స్థితి కొనసాగరాదన్న నిశ్చయంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్‌) వ్యవస్థలను రూపుదిద్దారు. 1962లో విక్రం సారాభాయ్‌ ఆధ్వర్యంలోని ఇన్‌కోస్‌పార్‌ అనంతరకాలంలో ఇస్రోగా రూపాంతరం చెందింది. ఆనకట్టలనూ, సాగునీటి ప్రాజెక్టులనూ నెహ్రూ ‘ఆధునిక భారత దేవాలయాలు’ అన్నారు. ఈ రెండూ మన ఆహార ముఖచిత్రాన్నే సమూలంగా మార్చాయి. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జునసాగర్‌లు సాగు ఉత్పాదకతను అనేక రెట్లు పెంచాయి. ఆయన ఏర్పరచిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కరువుల్ని అధిగమించటానికి, తర్వాతకాలంలో జరిగిన హరిత విప్లవానికి బాటలుపరిచింది. అలీనోద్యమం ద్వారా అంతర్జాతీయంగా మన దేశం ఒక స్వతంత్ర స్వరం వినిపించేలా చేసింది నెహ్రూ మహాశయుడే. ఎటుచూసినా నిరక్షరాస్యతే నిండి, నిరుపేద దేశంగా, విభజన గాయాలతో నిలబడిన దేశానికి నెహ్రూ నాయకత్వం వహించి సలక్షణంగా పనిచేసే సంస్థల్ని, విద్యుత్‌ కేంద్రాలను, విశ్వవిద్యాలయాలను, జాతీయ ప్రయోజనమనే భావనను వదిలివెళ్లారు. ఆధునిక భారత పటుత్వం దాని నిర్మాతలను గుర్తించి గౌరవించటంలోనే ఉంటుంది తప్ప వారిని కించపరచటంలో కాదు. చరిత్రను పునరుల్లేఖించటానికి పూనుకుంటున్నవారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి– ‘పర్వతశిఖరంపై ఉమ్మివేయటం ద్వారా మీరు దాని ఖ్యాతిని మసకబార్చలేరు’.

- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి

Updated Date - Nov 14 , 2025 | 04:17 AM