Share News

Vadodara Bridge Collapse: నిర్లక్ష్యం కూల్చిన వంతెన

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:34 AM

గుజరాత్‌లోని వడోదరలో మహి నదిపైన నలభైయేళ్ళక్రితం నిర్మించిన బ్రిడ్జి పాక్షికంగా కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది.

Vadodara Bridge Collapse: నిర్లక్ష్యం కూల్చిన వంతెన

గుజరాత్‌లోని వడోదరలో మహి నదిపైన నలభైయేళ్ళక్రితం నిర్మించిన బ్రిడ్జి పాక్షికంగా కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉన్నదని, గాలింపుచర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నా, ఆశలూ అవకాశాలూ అంతంతమాత్రమే. భారీశబ్దాలతో ఓ భాగం కూలడం, దానిపైన ప్రయాణిస్తున్న వాహనాలు వరుసపెట్టి నదిలో పడిపోవడం అతిదగ్గరగా గమనించిన మత్స్యకారులు భయంతో వొణికిపోయారు. ఈ వంతెనకు రిపేర్లు, తనిఖీలు, నాణ్యత పరీక్షలు ఎప్పుడు, ఎవరు నిర్వహించారన్న వివరాలు తెప్పించుకొని మరీ నలుగురు ఇంజనీర్లను ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్‌ గురువారం సస్పెండ్‌ చేశారట. ఆ నివేదికలో ఇంకా ఏమున్నదో, పాపులు వీరని ఎలా నిర్ణయించారో మనకు తెలియదు. అయితే, సరిగ్గా మూడేళ్లక్రితం వడోదరకు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఈ బ్రిడ్జి నిర్వహణకు సంబంధించి ఒక అధికారితో చేసిన సంభాషణ ఈ ప్రమాదం నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. వంతెన పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున తనిఖీలు, మరమ్మతులు వెంటనే చేపట్టాలంటూ తాము ఇప్పటికే ప్రతిపాదనలు పంపామంటూ సదరు అధికారి వివరిస్తున్న సంభాషణ అది. ఈ వంతెన ఏడాదికంటే నిలవదని, కూలడం ఖాయమని ఆ అధికారి అప్పట్లోనే చెబితే, అది మరో మూడేళ్ళు నిలిచి, ఎవరూ ఎంతకూ పట్టించుకోని కారణంగా ఇప్పటికి ఇలా కూలిందని అర్థం.


ఇది కాంగ్రెస్‌ ఏలుబడిలో నిర్మించిన బ్రిడ్జి అనీ, వారి చేతిచలువవల్లనే, నాలుగుదశాబ్దాలకే దానికి నూరేళ్ళూ నిండిపోయాయని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇది పూర్తిగా నిర్వహణ లోపమనీ, రాష్ట్రంలో గత నాలుగేళ్ళలో ఈ తరహాఘటనలు కనీసం ఏడు జరిగిన నేపథ్యంలో సిట్‌ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్‌ అంటోంది. గుజరాత్‌లో అవినీతి పతాకస్థాయిలో ఉన్నందున, ప్రతీదానినీ డబ్బుతో ముడిపెడుతూ చివరకు ప్రజల ప్రాణాలకు కూడా రక్షణలేకుండాపోయిందని కాంగ్రెస్‌ విమర్శ. గతంలో బ్లాక్‌లిస్ట్‌ చేసిన కంపెనీలు కూడా ఇప్పుడు కాంట్రాక్టులు సంపాదిస్తున్నాయని, అవి కట్టినవి కూలిపోతున్నా, మరమ్మతులు నిలవకున్నా పాలకులు నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్నారని కాంగ్రెస్‌ వాదన. మధ్య గుజరాత్‌ను సౌరాష్ట్రతో అనుసంధానించే అతి కీలకమైన ఈ బ్రిడ్జి నిర్వహణలోనూ అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నది విమర్శ. ఆనంద్‌–వడోదర జిల్లాలను కలిపే ఈ బ్రిడ్జి కూలిన కారణంగా ఈ మార్గం గుండావెళ్ళే వాహనాలు ఇప్పుడు యాభైకిలోమీటర్లు చుట్టూ తిరిగిపోవలసి వస్తోంది. ఈ వంతెనలో నిర్మాణపరమైన లోపాలేమీ లేవని, కూలిన భాగాలు ముందే దెబ్బతిన్న సూచనలూ కనబడలేదని, వందేళ్ళు నిలవాల్సిన ఈ నిర్మాణానికి గత ఏడాది కూడా చిన్నచిన్న రిపేర్లతో నిర్వహణ సుబ్బరంగా చేశామని, సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారాలను ఏ మాత్రం నమ్మవద్దని అత్యున్నత ఇంజనీర్‌ ఒకాయన గురువారం మీడియాకు వివరణ ఇచ్చారు. ఏ లోపమూ లేదు, ఏ లోటూ చేయలేదు కానీ, అదే తనకుతానుగా కూలిందన్నట్టుగా ఆయన మాట్లాడారు. మానవతప్పిదాలు, నిర్లక్ష్యాలు, లేదా కుట్రలు లేనిదే ఈ స్థాయి ప్రమాదాలు జరగవు. రాకపోకలు ఆపకుండా, ప్రయాణానికి పనికిరాదని నిర్థారించకుండా, మరోవైపు మరమ్మతులు చేయకుండా నిర్వహణను గాలికి వదిలేసి ఇప్పుడు ఎందుకు కూలిందో తెలియదన్నట్టుగా మాట్లాడటం విచిత్రం. నష్టపరిహారాలు ఇవ్వడం, కమిటీలు వేయడం ఇటువంటి సందర్భాల్లో సహజంగా జరిగిపోతాయి. బలంగా ఉన్నదనీ, నూరేళ్ళు నిలవాల్సినదనీ అంటున్న బ్రిడ్జి అర్థంతరంగా ఇలా ఎందుకు ఒరిగిందన్న సత్యం ఎప్పుడు తెలుస్తుందో, ఎవరు ఆ గుట్టు విప్పుతారో చూడాలి. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి సరిపోయింది కానీ, రద్దీ వేళల్లో అయితే మృతుల సంఖ్య చాలా హెచ్చుగా ఉండేది. రద్దీసమయాల్లో అతివేగంగా వాహనాలు పోతున్నప్పుడు ఈ భాగం నుంచి భారీ శబ్దాలు వెలువడేవని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రమాదఘంటికలు ఎంతోకాలంగా వినిపిస్తున్నా ఎవరికీ పట్టకపోవడం ఆశ్చర్యం. 2022లో మోర్బీ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన నుంచి గుజరాత్‌ ఏ పాఠాలూ నేర్చుకోలేదని, ప్రజల భద్రత పాలకులకు పట్టలేదని ఈ ఘటన తెలియచెబుతోంది.

Updated Date - Jul 11 , 2025 | 01:34 AM