Share News

Pensioners Raises Concern: ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉద్యోగులు, పెన్షనర్లు బలి

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:12 AM

ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కుల గణనపై ఢిల్లీలో పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్ నిర్వహించి నా దగ్గర కుల గణనకు సంబంధించి కొన్ని కోట్ల పేజీలకు సరిపడే సమాచారం ఉంద’ని సగర్వంగా తెలిపారు....

Pensioners Raises Concern: ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉద్యోగులు, పెన్షనర్లు బలి

ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కుల గణనపై ఢిల్లీలో పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్ నిర్వహించి ‘నా దగ్గర కుల గణనకు సంబంధించి కొన్ని కోట్ల పేజీలకు సరిపడే సమాచారం ఉంద’ని సగర్వంగా తెలిపారు. కానీ అంతటి సమాచారాన్ని ఆయనకు అందించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా?! వారి సమస్యల గురించి సీఎం పట్టించుకోకపోవడం విచారకరం. తాము అధికారంలోకి వస్తే ‘ఆరు గ్యారంటీ’ల అమలుతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం మరిచిపోయినట్లున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ఎందుకు అంతటి ఉదాసీనత? ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, మరో మూడు లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి తొమ్మిది లక్షల మంది వరకు ఉంటారు. వారిపై ఆధారపడిన వారిని కూడా కలుపుకుంటే మొత్తం ప్రభావితులు రాష్ట్ర జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మంది! గత ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక పోకడలు పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల తీరును విశ్లేషిస్తే వందకు పైగా స్థానాల్లో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ అభ్యర్థులకు అండగా ఉద్యోగులు ఓటు వేసి గెలిపించుకున్నారన్న విషయం సీఎం విస్మరించకూడదు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలోనే అయిదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి! తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ మాటనే మరిచింది. 2026 జనవరి నుంచి ఎనిమిదో పీఆర్సీ అమలుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. 16వ పీఆర్సీలో ఉండాల్సిన రాష్ట్ర ఉద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగు పీఆర్సీలు నష్టపోతున్నారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డుల ద్వారా ఏ ఆసుపత్రిలోనూ చికిత్సలు జరగడం లేదు. గత ప్రభుత్వం తెచ్చిన జోనల్ విధానం వల్ల నష్టపోయిన (జీవో 317) ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపిస్తామని, సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్‌కు తుంగలో తొక్కినట్టే కనిపిస్తోంది. గత 16 నెలల్లో 12,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వీరికి ఒక్కొక్కరికి సరాసరిన రూ.50 లక్షల చొప్పున పెన్షన్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటే తప్ప ప్రభుత్వం వీటిని చెల్లించకపోవడం దురదృష్టకరం. ఉద్యోగుల జీపీఎఫ్, సరెండర్ లీవు వేతనం, మెడికల్ రియింబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులు కూడా జరగడం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గతంలో ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది.


కానీ ఫలితం శూన్యం. పెండింగ్‌లో ఉన్న అయిదు డీఏలను ఆరు నెలలకొకటి చొప్పున ఇస్తామంటూ జీవో విడుదల చేయడం విడ్డూరం. నేడు రాష్ట్రంలో దాదాపు 1 లక్షా 60 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులే ఆ ఖాళీల పని భారాన్ని మోయాల్సి వస్తున్నది. ప్రభుత్వం త్వరగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి.

– పులి సరోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

Updated Date - Sep 18 , 2025 | 06:12 AM