Share News

Andhra Pradeshs Aqua Industry in Crisis: అయోమయంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా

ABN , Publish Date - Aug 30 , 2025 | 04:52 AM

మనదేశ ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ రంగంపై ఆధారపడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా 15 లక్షల మంది ఉపాధి పొందుతుండగా..

Andhra Pradeshs Aqua Industry in Crisis: అయోమయంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా

నదేశ ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ రంగంపై ఆధారపడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా 15 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, పరోక్షంగా దాదాపు 20లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. మన దేశ ఆక్వా ఎగుమతులకు ఎంతో కాలంగా అమెరికా ప్రధాన కేంద్రంగా ఉంది. ఇటీవల ట్రంప్‌ విధించిన దిగుమతి సుంకాల దెబ్బతో ఈ రంగం తీవ్రంగా ప్రభావితమవుతున్నది. ఆక్వా ఎగుమతుల పరంగా అమెరికాపై ఎక్కువగా ఆధారపడటం, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వాలు ముందస్తుగా దృష్టి సారించకపోవడం, అంతర్గతంగా దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల వినియోగంపై బుద్ధిపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వంటి అనేకానేక కారణాలు నేడు ఏపీలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న అయోమయ, ఆందోళనకర పరిస్థితులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారణమవుతున్నాయి.


మనదేశం నుంచి అమెరికాకు చేసే ఇతర ఎగుమతులతో పోలిస్తే ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి నిర్ణీతమైన కాల పరిమితులున్నాయి. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుని, ఆక్వా ఉత్పత్తులను విక్రయించే సౌకర్యాలు ఏ మాత్రం అందుబాటులో లేవు. ఈ ఉత్పత్తుల్లో అధిక వాటాను ఆక్రమించే రొయ్యలను ఒడ్డుకు చేర్చిన నిర్ణీత గడువులోగా మార్కెటింగ్‌ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ ఆహార పదార్థాలు వినియోగానికి పనికిరాకుండా పోయి, ఉత్పత్తిదారులు పూర్తిస్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం ఎగుమతి చేసిన 62,408 కోట్ల రూపాయల విలువైన మొత్తం ఉత్పత్తుల్లో దాదాపు 44 శాతం రొయ్యల ఎగుమతులున్నాయి. ఈ ఉత్పత్తుల్లో అమెరికాకు 36.4 శాతం, చైనాకు 17.2 శాతం, యూరప్‌ దేశాలకు 15శాతం ఎగుమతులు నమోదయ్యాయి. గత ఏడాది మన దేశం ఉత్పత్తి చేసిన 17లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు 11లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యల ఉత్పత్తి నమోదయ్యింది. మన దేశ చేపల ఉత్పత్తిలోనూ ఒక్క ఏపీ మాత్రమే దాదాపు మూడోవంతు ఉత్పత్తిని సాధిస్తూ, దేశం ఆర్జిస్తున్న విదేశీ మారక ద్రవ్యంలోనూ సుమారు మూడోవంతు భాగస్వామ్యాన్ని రాష్ట్ర ఆక్వా రంగం జోడిస్తున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల వ్యాప్తంగా 5,72,065 ఎకరాల్లో చేపల చెరువులు విస్తరించి ఉన్నాయి. రెండు లక్షల ఎకరాల్లో సంప్రదాయ నీటి వనరుల నుంచి చేపలు, రొయ్యల సాగును కొనసాగిస్తున్న లక్షలాది మంది మత్స్యకారులున్నారు.


ఇంతటి ప్రాధాన్యాన్ని కలిగిన ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోకుండా ప్రభుత్వాలు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన అమలు పరచాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తాత్కాలిక ఉపశమనాలకంటే దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించడమే ఎక్కువగా మేలు చేకూరుస్తుంది. ఏపీ నుంచి అనేక దశాబ్దాలుగా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తున్న ‘వెనామి’ రొయ్యల సాగుపై మాత్రమే దృష్టి కేంద్రీకరించకుండా, పలు దేశాల్లో వినియోగానికి ఆస్కారం ఉన్న ఇతర రకాలైన చేపలు, రొయ్యల వంగడాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తున్న శీతలీకరణ పద్ధతుల్లో రొయ్యలు ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు వీలున్న ఇతర మార్గాలను అన్వేషించడంతో పాటుగా, ఆ రంగానికి ఉపకరించే ప్రోత్సాహకాలనూ ప్రభుత్వపరంగా అందించాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ప్రధానంగా ‘వాక్యూమ్ ఫ్రీజ్ డ్రైయింగ్’ లాంటి అత్యాధునిక విధానాలను అనుసరించడం ద్వారా ప్రాసెస్ చేసిన రొయ్యలను దాదాపు ఇరవై ఏళ్ల పాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది! ఫలితంగా మార్కెటింగ్‌లో ఒత్తిళ్లు పూర్తిస్థాయిలో తగ్గిపోయి అంతిమంగా రైతులకు, సరఫరాదారులకు, ఎగుమతిదారులకు కాలపరిమితులకు సంబంధించిన వెసులుబాటు లభిస్తుంది.


ఎన్నో ఏళ్లుగా కేవలం అమెరికా మార్కెట్ మీద మాత్రమే ఆధారపడిన ఎగుమతుల విధానాన్ని సవరించుకుని మన దేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను చేసుకోగలిగే ప్రత్యామ్నాయ మార్కెట్ వెసులుబాటు ధోరణులను అనుసరించడం మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇంతకాలంగా బుద్ధిపూర్వకంగా విస్మరించిన దేశీయ మార్కెట్లలో స్థానిక ఆక్వా ఉత్పత్తులను ‘రెడీ టు కుక్’, ‘రెడీ టు ఈట్’ లాంటి విలువల జోడింపు (వాల్యూ యాడెడ్) విధానాల్లోకి మార్చుకునే ఆధునిక సాంకేతిక ‘ఫుడ్ ప్రాసెసింగ్’ పద్ధతులను అనుసరించడం ఆక్వా రంగ రైతులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆక్వా రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

-పిట్టల రవీందర్ ‘తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్’ పూర్వ అధ్యక్షుడు

Updated Date - Aug 30 , 2025 | 04:52 AM