Share News

Nallamala Sagar: నల్లమల సాగర్.. ముందస్తు జాగ్రత్తలు తప్పవు

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:12 AM

పోలవరం బనకచర్ల అనుసంధానం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగడం శుభ సూచికమే! దీంతో రాయలసీమ వాసుల ఆకాంక్షలు పాక్షికంగా నెరవేరాయి. ఇక పెండింగ్ ప్రాజెక్టుల...

Nallamala Sagar: నల్లమల సాగర్.. ముందస్తు జాగ్రత్తలు తప్పవు

పోలవరం బనకచర్ల అనుసంధానం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగడం శుభ సూచికమే! దీంతో రాయలసీమ వాసుల ఆకాంక్షలు పాక్షికంగా నెరవేరాయి. ఇక పెండింగ్ ప్రాజెక్టుల పనులు మొదలుపెడితే చాలు. వాస్తవంలో బనకచర్ల అనుసంధాన పథకం నిర్మాణం కష్టతరమూ, అసాధ్యం కూడా. కూటమి ప్రభుత్వానికి ఈ టర్మ్ సన్నాహాలకు సరిపోతుంది. ముందుకు సాగినా టెండర్లు పిలవగలరు. తీవ్ర అభ్యంతరాల మధ్య అనుమతులు పొందటం అంత సులభం కాదు. 2029 తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ అయిదేళ్లలో కూడా నిర్మాణం పూర్తి కాదు. దీనికి పోలవరం ఓ ఉదాహరణ. పైగా టన్నెల్స్ తవ్వడం బహు క్లిష్టమైనది.

వెలుగొండ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఫాల్ట్‌జోన్లు ఏర్పడి ఏళ్లూ పూళ్లూ గడిచిన అనుభవముంది. పైగా అంతర్రాష్ట్ర జల వివాదాలు జటిలంగా తయారయ్యాయి. దీనికి తోడు వరద జలాల ఆధారంగా డీపీఆర్ ఆమోదం వీటన్నింటికీ మించి క్లిష్టమైనది. తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాల అభ్యంతరాల కన్నా ప్రజల భావోద్వేగాలకు జడిసి కేంద్ర ప్రభుత్వం తటస్థంగా ఉండిపోయింది. కేంద్ర పర్యావరణ శాఖ, గోదావరి –కృష్ణా యాజమాన్య బోర్డులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీల చేత అడ్డంగా రాయించి కేంద్ర జల సంఘం చేతులు దులుపుకున్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టకేలకు సరైన నిర్ణయం తీసుకున్నది. అయితే ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన ‘పోలవరం, నల్లమల సాగర్‌’కు బాలారిష్టాలు లేకపోలేదు. ముందుగా వరద జలాలు ఆధారం అనే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలి. దేశంలో ఇంతవరకు వరద జలాల ఆధారంగా ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం ఆమోదించలేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నప్పటికీ, ఏపీకి అనుకూలంగా ఏదైనా ఆమోదం ఇస్తే – అది దేశవ్యాప్తంగా ఒక సంప్రదాయంగా మారిపోయే అవకాశముంది. అందుకే కేంద్ర జల సంఘం అలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహసించకపోవచ్చు. పైగా ట్రిబ్యునల్ అవార్డు మేరకు గోదావరి వరద జలాలకు బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకూ హక్కు ఉంది. పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం వరద జలాల ఆధారంగా డీపీఆర్ ఆమోదించిన వెంటనే తెలంగాణ, మహారాష్ట్ర రెండూ (ఈ పాటికే కోరి ఉన్నందున) వరదజలాల ఆధారంగా తమ డీపీఆర్‌లు సమర్పిస్తాయి. ఈ విషయం కేంద్ర జలసంఘం పరిగణనలోకి విధిగా తీసుకుంటుంది.


బనకచర్ల అనుసంధానం విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేవనెత్తిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకుంటున్నది. ఇది కూడా సులభంగా అధిగమించలేనిదే! ప్రస్తుతం నిర్మాణంలోని పోలవరం తొలిదశ ఆధారంగా పోలవరం నల్లమల సాగర్‌కు అయినా నీళ్లు వచ్చే అవకాశం లేదు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లు ఎత్తు నిర్మాణం జరిగి, పూర్తిస్థాయిలో నీళ్లు నిలిపినపుడు మాత్రమే సాధ్యం. పోలవరం హెడ్‌వర్క్స్ పూర్తి చేయవచ్చు గానీ, పూర్తిస్థాయిలో నీళ్లు నింపేందుకు నిర్వాసితుల తరలింపు ఎన్ని సంవత్సరాలు పడుతుందో! ఇవన్నీ అటుంచి పోలవరం రిజర్వాయర్ నుంచి గోదావరి వరద జలాలను తరలించడం సాధ్యం కాదు. అలా చేయాలంటే పోలవరం ఆపరేషన్ షెడ్యూల్ మార్పు చేయవలసి ఉందని. అంటే తిరిగి డీపీఆర్ ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. ‘పోలవరం, నల్లమల సాగర్ పథకం’ పోలవరం ప్రాజెక్టులో భాగమైనపుడే అది సాధ్యం.

పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు అయినా, మనం అధికారయుతంగా ఉపయోగించుకునే పరిధి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ నీటి నుంచి నల్లమల సాగర్ అనుసంధానం ప్రాతిపదిక చేసుకొంటే ఎవరి వైపు నుంచీ అభ్యంతరాలు ఉండవు. కేంద్ర జలసంఘం సులభంగా డీపీఆర్ ఆమోదిస్తుంది. బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మరో చిక్కుముడి ఉంది. పోలవరం నుంచి తరలించే జలాలు కృష్ణానదిలో కలపకూడదు. కృష్ణా వద్ద ఏ పాయింట్‌కు తెచ్చినా, ఆక్విడెక్ట్ (నీటి మార్గ వంతెన) నిర్మించి నదిని దాటించాల్సి ఉంటుంది. ఒకవేళ 80టీఎంసీలకు మించితే కృష్ణా నికర జలాలను ఎగువ రాష్ట్రాలు తన్నుకుపోతాయి. దీన్ని గోదావరి ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టంగా పొందుపర్చింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుతో పాటు ఇంతవరకు కేంద్ర జలసంఘం పాటిస్తున్న నియమ నిబంధనలు పోలవరం, నల్లమల సాగర్ అంశంలో పాటించకపోతే బనకచర్ల అనుసంధానానికి ఎదురైన ఇబ్బందులు ఇక్కడా తప్పవు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికోసం ఉద్దేశించి బనకచర్ల అనుసంధానంపై ఇంత హడావుడి చేశారో, ఆ ప్రాంతమైన రాయలసీమలోనే ఆ ప్రాజెక్టుపై సానుకూలత లేదు. ‘మన ఇంటి ముంగిట పోయే కృష్ణానది నీళ్లు ఇవ్వకుండా, గోదావరి జలాలు ఎందుకు’ అనే తీవ్ర మథనం ఉండేది. ఒక విధంగా వారి మనోభావాలను కూటమి ప్రభుత్వం మన్నించినట్లే భావించాలి. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు ఇచ్చి, మిగిలిన నీళ్లు తమకు కృష్ణా ద్వారా ఇవ్వాలనేది రాయలసీమ వాసుల కోర్కె. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతోంది. కనీసం అయిదారు మాసాల్లో ట్రిబ్యునల్ తీర్పు వస్తుంది. ఆ తీర్పు తర్వాత బొల్లాపల్లి వరకు వచ్చే గోదావరి జలాలు డెల్టాకు, సాగర్ కుడికాలువ ఆయకట్టుకు ఇచ్చి, మిగిలే నీళ్లు రాయలసీమకు భేషుగ్గా ఇవ్వవచ్చు. ఈలోపు రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వాటికి పంట కాలువల నిర్మాణం పూర్తిచేయడం సముచితమైన చర్యగా వుంటుంది.

వి. శంకరయ్య (విశ్రాంత పాత్రికేయుడు)

Updated Date - Nov 22 , 2025 | 04:12 AM