Share News

Multi Zonal System: పదోన్నతుల్లో మల్టీ సమస్య

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:28 AM

తెలంగాణ ఏర్పాటు అనంతరం ఏర్పడ్డ కొత్త జిల్లాల వల్ల స్థానికులకే ఉద్యోగాలు దక్కుతాయన్న ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తాయి. పదోన్నతులు

Multi Zonal System: పదోన్నతుల్లో మల్టీ సమస్య

తెలంగాణ ఏర్పాటు అనంతరం ఏర్పడ్డ కొత్త జిల్లాల వల్ల స్థానికులకే ఉద్యోగాలు దక్కుతాయన్న ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తాయి. పదోన్నతులు స్థానిక జిల్లా వారికే దక్కుతాయని ఉద్యోగులూ ఆశపడ్డారు. కానీ 317, 3 జీవోలు ఉపాధ్యాయుల ఆశలను అడియాసలు చేశాయి. 317 జీవో కారణంగా ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ఒక ప్రహసనంగా మారింది. స్థానికతకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల సొంత జిల్లాకు ఎందరో దూరమయ్యారు. ఈ పరిస్థితిని దూరం చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కొంత కృషి చేసింది. కానీ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ఆ కృషి ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. జీవో నెం.3 కూడా ఉపాధ్యాయులకు పదోన్నతుల పట్ల నిర్లిప్తతతను కలిగించింది. జిల్లా స్థాయిలోని ప్రధానోపాధ్యాయ పోస్టును ఒకేసారి మల్టీజోన్ స్థాయికి మార్చడంతో ఖమ్మం జిల్లా నుంచి మెదక్ జిల్లాకు, మెదక్ నుంచి ఆదిలాబాద్‌కు పదోన్నతిలోనో, బదిలీలోనో వెళ్లక తప్పని పరిస్థితి. హెచ్‌ఎం పోస్టుల భర్తీలో మల్టీజోన్ల వ్యవస్థ ఉపాధ్యాయుల పదోన్నతి ఆశలకు నీళ్లొదిలేలా చేస్తోంది.


కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రాతిపదికన 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే అందాలని గత ప్రభుత్వం సంకల్పించింది. తొలిదశలో 31 జిల్లాలతో కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించారు. ఈ ప్రతిపాదనకు 2018 ఆగస్టు 29న నాటి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత నారాయణపేట, ములుగు జిల్లాలు ఏర్పాటయ్యాయి. జోగుళాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపడంతో పాటు, కొత్తగా ఏర్పడిన ఆ రెండు జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటూ నాటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి సవరణలు పంపింది. ‘371–డి’లోని 1, 2 క్లాజుల కింద తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌–2018 ప్రకారం వీటికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. తర్వాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం మల్టీ జోన్‌–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు వస్తాయి. మల్టీజోన్‌–2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు వస్తాయి. ఈ వ్యవస్థకు అనుగుణంగా విద్యాశాఖ కూడా కొన్ని మార్పులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009 జనవరి 23న వెలువడ్డ నెం. 10 జీవో ప్రకారం గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టుకు భర్తీ యూనిట్‌ను జిల్లాగా పేర్కొన్నారు. ఆ తర్వాత సరిగ్గా 14 ఏళ్ల తర్వాత 2023 జనవరి 23న ఈ జీవోకు సవరణ చేస్తూ తెచ్చిన జీవో నెం. 3 ఉపాధ్యాయ వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఈ సవరణ గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులను మల్టీజోనల్ పరిధిలోకి తెచ్చింది. నియామకాలు, సీనియారిటీ, బదిలీలు మొదలైన వాటన్నింటికీ ఈ జీవో వర్తిస్తుంది. ఈ జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లుగా విభజించారు. పై విధంగానే మల్టీ జోన్‌–1 కిందికి కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లను; మల్టీజోన్‌–2 కిందికి యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లను తెచ్చారు. ఈ విధంగా విభజించడం వల్ల హెచ్‌ఎం పోస్టు మల్టీజోన్ స్థాయికి రావడంతో మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత జిల్లాలో ఖాళీలు లేకపోవడంతో బదిలీ అయిన జిల్లాలోనే బతుకీడుస్తున్న ఉపాధ్యాయులెందరో!


వివిధ జిల్లాల సెలక్షన్ కమిటీల ద్వారా ఉద్యోగాలు పొంది, తర్వాత పదోన్నతుల్లో జోన్, మల్టీ జోన్ స్థాయిలో కామన్ సీనియారిటీ ఉండడం వల్ల కొన్ని జిల్లాల వారు తీవ్రంగా నష్టపోతారు. భర్తీ ప్రక్రియ వివిధ జిల్లాల్లో ఏకకాలంలో జరగకపోవడం, ఒకే డీఎస్సీ వారు నెలలు, సంవత్సరాల తేడాతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు పొందడం వల్ల కొన్ని జిల్లాల ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. రెండు దశాబ్దాలు ఒకే క్యాడర్‌లో పని చేసినా పదోన్నతి దక్కని పరిస్థితులు ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పటికే పదోన్నతుల కారణంగా వివిధ జిల్లాల్లోని పోస్టులను స్థానికేతరులైనవారు పొందారు. వారి జిల్లాలో అవకాశం లేకపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లడం వల్ల అక్కడున్న వారి పదోన్నతి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఉదాహరణకు ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, హనుమకొండ, వరంగల్ తదితర జిల్లాల్లో పదోన్నతి పొందిన వారు– ఖాళీలు తక్కువ ఉండడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్ వంటి జిల్లాల్లోని ఖాళీలు అధిక శాతం ఇతర జిల్లాల ప్రధానోపాధ్యాయులతో నిండిపోయాయి. తత్ఫలితంగా తాము తమ జిల్లాకు వెళ్లడానికి అనువుగా ముందుగా బదిలీలు నిర్వహించాలన్న డిమాండ్ ఆయా ఉపాధ్యాయుల నుంచి వస్తోంది.


ఇలా హెచ్‌ఎం పోస్టులు ఇతర జిల్లాల వారితో నిండిపోవడం వల్ల భవిష్యత్తులో ఆయా జిల్లాల్లో కింది క్యాడర్లలో పనిచేస్తున్న వారి పదోన్నతి ఆశలు అడుగంటుతాయి. నిరుద్యోగులకు తర్వాతి డీఎస్సీల్లో పోస్టులు భారీగా తగ్గిపోవడమో, అసలే లేకుండా పోవడమో జరుగుతుంది. ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు ప్రతికూల ప్రభావాన్ని కలిగించే మల్టీ జోనల్ వ్యవస్థ వల్ల ఏర్పడుతున్న సమస్యల నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. హెచ్‌ఎం పోస్టులకు భర్తీ యూనిట్‌ను ఉమ్మడి జిల్లా స్థాయికి మార్చాలి. పదోన్నతి, బదిలీ కారణంగా గతంలో ఇతర జిల్లాలకు వెళ్లిన ప్రధానోపాధ్యాయులకు మొదట సొంత ఉమ్మడి జిల్లాకు బదిలీ సౌకర్యం కల్పించాలి. తర్వాత ఉమ్మడి జిల్లా స్థాయిలోనే పదోన్నతి కౌన్సిలింగ్ నిర్వహించాలి. 317, 3 జీవోల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హెచ్‌ఎంలకు, పదోన్నతుల ఆశావహులకు ప్రభుత్వం న్యాయం చేయాలి.

-డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు

Updated Date - Aug 09 , 2025 | 04:28 AM