Share News

Support Needed for Growth: ఎంఎస్‌ఎంఈలతోనే వికసిత భారత్‌ సాధ్యం!

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:16 AM

దేశం అభివృద్ధి చెందాలంటే పెద్ద ప్రాజెక్టులు మాత్రమే కాదు, చిన్న పరిశ్రమలు కూడా బలపడాలి. కానీ ప్రభుత్వాల దృష్టి అంతా లార్జ్, మెగా ఇండస్ట్రీస్ వైపునకే పోతోంది..

Support Needed for Growth: ఎంఎస్‌ఎంఈలతోనే వికసిత భారత్‌ సాధ్యం!

దేశం అభివృద్ధి చెందాలంటే పెద్ద ప్రాజెక్టులు మాత్రమే కాదు, చిన్న పరిశ్రమలు కూడా బలపడాలి. కానీ ప్రభుత్వాల దృష్టి అంతా ‘‘లార్జ్, మెగా ఇండస్ట్రీస్’’ వైపునకే పోతోంది. పెద్ద పరిశ్రమలకు, అంతర్జాతీయ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, భూములు, టారిఫ్‌ రాయితీలు లభిస్తున్నాయి. అదే సమయంలో కోట్లాది ఉద్యోగాలు కల్పించే ఎంఎస్‌ఎంఈలు నిశ్శబ్దంగా మూతపడుతున్నాయి. భారతదేశంలో సుమారు 2.9 కోట్ల ఎంఎస్‌ఎంఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా 20 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి లభిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మూడు లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఎంఎస్‌ఎంఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా 15 లక్షలకు పైగా ప్రజలకు ఉపాధి లభిస్తోంది. ఈ రంగంలో పనిచేసేవారు ప్రధానంగా తక్కువ, మధ్య ఆదాయ వర్గాలవారు, గ్రామీణ యువత, మొదటి తరానికి చెందిన పారిశ్రామికవేత్తలు. ఎంఎస్‌ఎంఈలు కేవలం వ్యాపారాలు మాత్రమే కాదు– స్థానికంగా ఉపాధి, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక చలనం కలిగించే శక్తి కేంద్రాలు. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ప్రాజెక్టులకు ప్రభుత్వం అందిస్తున్న అనేక ప్రోత్సాహకాలు ఈ చిన్న పరిశ్రమలకు కూడా ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు కేటాయించే భూముల్లో 80 శాతానికి పైగా భూములు మెగా ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలకే దక్కుతున్నాయి. చిన్న పరిశ్రమలు భూమి కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాగే పెద్ద పరిశ్రమల వారికి విద్యుత్‌ చార్జీలలో రాయితీలు, వాయిదాలు, సర్దుబాట్లు, సత్వర కనెక్షన్, అభివృద్ధి చార్జీల మినహాయింపు తదితర ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి.


చిన్న పరిశ్రమలకు ఎటువంటి రాయితీ లేకపోగా, డ్యూ డేట్‌ తర్వాత బిల్లు చెల్లించడం ఒక్కరోజు ఆలస్యమైనా పెనాల్టీలు వేయడం, కనెక్షన్‌ తొలగించడం వంటివి చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులకు భవన నిర్మాణ చార్జీల నుంచి మినహాయింపులు, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌, ప్రోత్సాహక ప్యాకేజీలు లభిస్తుంటే, చిన్న పరిశ్రమలవారు వీటన్నింటినీ తామే భరించవలసి వస్తోంది. ఇక పెద్ద కంపెనీలు అధిక నైపుణ్య ఉద్యోగులను నియమిస్తాయి, అదే ఎంఎస్‌ఎంఈలు తక్కువ ఆదాయ వర్గాల యువతకు, మొదటి తరం ఉద్యోగార్థులకు అవకాశాలు ఇస్తాయి. ఒక కోటి రూపాయల పెట్టుబడితో ఎంఎస్‌ఎంఈ రంగం 10 నుంచి 15 ఉద్యోగాలు కల్పిస్తే, మెగా, భారీ పరిశ్రమలు కల్పించే ఉద్యోగాలు ఒకటి రెండు మాత్రమే. ప్రతి సంవత్సరం వందల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు మూతపడుతున్నాయి. దీనికి కారణాలు మార్కెట్‌ పోటీ, చెల్లింపుల ఆలస్యం, ఫైనాన్స్‌ లోపం, బ్యాంకుల కఠిన విధానాలు, పెరిగిన విద్యుత్‌ చార్జీలు. పెద్ద కార్పొరేట్‌లకు ఓటీఎస్‌, అప్పు మాఫీలు లభిస్తే, ఎంఎస్‌ఎంఈలకు అలాంటి అవకాశాలు లేవు. ప్రతి బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఆర్థిక నిపుణులతో చర్చలు చేస్తుంది. కానీ ఎంఎస్‌ఎంఈ యజమానులు, రోజువారీ పోరాటం చేస్తున్న పరిశ్రమలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఆ అవకాశం లేదు. ఇకనుంచైనా ప్రభుత్వాలు పెద్ద పరిశ్రమల వారికిచ్చే ప్రోత్సాహకాలు ఎంఎస్‌ఎంఈలకు కూడా కల్పించాలి. అవి ఇలా కల్పించవచ్చు. 1) ఉద్యోగ సృష్టి ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాటిని ఎప్పటికప్పుడు డైరెక్ట్‌గా కంపెనీల అకౌంటుకు బదిలీ అయ్యేలా చూడాలి. 2) జిల్లా స్థాయిలో ఎంఎస్‌ఎంఈ యజమానులతో ప్రత్యక్ష సమీక్షలు నిర్వహించాలి. 3) సమస్యల్లో ఉన్న యూనిట్ల పునరుద్ధరణకు సెల్స్‌ ఏర్పాటు చేయాలి. 4) బ్యాంకులు, డిస్కం సంస్థలు ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక సహకార విధానం అమలు చేయాలి. విద్యుత్ సబ్సిడీ ఆయా నెలల బిల్లుల్లో సర్దుబాటు చెయ్యాలి. 5) ల్యాండ్ బ్యాంక్‌లలో కనీసం 30 శాతం భూములు ఎంఎస్‌ఎంఈ పార్కులకు రాయితీ ధరకు కేటాయించాలి. ఒక చిన్న యూనిట్‌ మూతపడితే, దాని వెనుక ఒక కుటుంబం, ఐదారు ఉద్యోగాలు, ఒక గ్రామ ఆర్థిక చలనం ఆగిపోతాయి. ఎంఎస్‌ఎంఈలు కేవలం వ్యాపారాలు మాత్రమే కాదు– సామాజిక స్థిరత్వానికి మూలాధారం. తక్కువ, మధ్య ఆదాయ కుటుంబాలకు ఉపాధి, స్థానిక ఆర్థిక చలనం, నైపుణ్యాభివృద్ధి ఇవన్నీ ఈ రంగం ద్వారా వస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలే భారత ఆర్థిక స్వరూపానికి పునాది. అందుకే కష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈ యజమానుల గళం వినాలి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా పాలసీలు రూపొందించాలి. అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్‌ భారత్‌ అవుతుంది. ప్రభుత్వాలు ఆశిస్తున్న వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతుంది.

-జి. నానిబాబు చౌదరి ప్రధాన కార్యదర్శి, మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్

Updated Date - Oct 23 , 2025 | 04:16 AM