Share News

MSME Sector: ఆర్థిక పరిపుష్టికి కీలకం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలే

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:51 AM

దేశ ఆర్థిక మూలలను నిలబెడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు) నేటికీ తగిన ప్రభుత్వ ప్రోత్సకాలు అందటం లేదు. నిజానికి భారత స్థూల జాతీయోత్పత్తిలో సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమల వాటా 30 శాతం.

MSME Sector: ఆర్థిక పరిపుష్టికి కీలకం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలే

దేశ ఆర్థిక మూలలను నిలబెడుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు) నేటికీ తగిన ప్రభుత్వ ప్రోత్సకాలు అందటం లేదు. నిజానికి భారత స్థూల జాతీయోత్పత్తిలో సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమల వాటా 30 శాతం. ఇది రాబోయే రెండేళ్లలో, అంటే 2027 వరకు, 35శాతం వరకు పెరగవచ్చునని నిపుణుల అంచనా. దేశ మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 40శాతం. అలాగే ఉద్యోగ కల్పనలో కూడా వీటి వాటా సింహాభాగమే. దాదాపుగా 11 కోట్ల మందికిపైగా సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమలలో ఉపాధి పొందుతున్నారు. రాబోయే ఐదేళ్ళల్లో ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా. అంతేగాక మొత్తం పారిశ్రామిక ఉత్పత్తుల్లో 45శాతం వీటి నుంచే వస్తున్నాయి. వీటి పాత్ర ఆర్థిక గణాంకాలకే పరిమితం కాదు. ఇవి ఎక్కువగా చిన్న లేదా మధ్య తరహా పట్టణాల్లో విస్తరించి ఉండటం వలన ఆయా ప్రాంతాల స్థానిక ఆర్థిక సామాజిక అభివృద్ధిలోనూ, ఉద్యోగ ఉపాధి కల్పనలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో ముఖ్యపాత్ర పోషిస్తూ ఆయా ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గిస్తున్నాయి. దేశీయ అంతర్జాతీయ వ్యాపార ప్రపంచం, మార్కెట్ అవసరాలు రోజు రోజుకీ చాలా వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత కాలంలో ఆ మార్పులకు అనుగుణంగా, అంతే వేగంతో అందుబాటులో ఉన్న స్థానిక మానవ వనరులతో, తక్కువ పెట్టుబడితో నూతన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు చేయడం కూడా ఎమ్‌ఎస్ఎమ్ఈల వల్లనే సాధ్యం. వేగంగా మారుతున్న వినియోగదారుల, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తక్షణమే స్పందించి అంతే వేగంగా సునిశితమైన సృజనాత్మకతతో ఉత్పత్తులను, సేవలను అందించగల నిర్మాణ సామర్థ్యం గలవి ఈ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలే.


అలాగే ఆర్థిక మాంద్యం వంటి ప్రతికూల పరిస్థితులలోనూ వేగంగా తిరిగి నిలబడే శక్తి సామర్థ్యాలు వీటికే ఉన్నాయి. చైనా లాంటి దేశాలు ఈ రంగం ప్రాధాన్యతను ఎంతో ముందుగానే గుర్తించాయి. అక్కడ ఈ రంగానికి తక్కువ వడ్డీతో తక్షణ రుణాల మంజూరు, పన్ను మినహాయింపులు, సాంకేతిక శిక్షణ, అంతర్జాతీయ మార్కెట్‌కు చేరువ చేసేలా డిజిటల్ మేళాల నిర్వహణ, భూమి నీరు విద్యుత్ రహదారి మార్గాల వంటి మౌలిక సదుపాయాల కల్పన... ఇవన్నీ ప్రభుత్వమే అందించి స్థానికంగా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఈ చర్యల వల్ల చైనా నేడు రాజకీయంగా, ఆర్థికంగా యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంది. కానీ మన దేశంలో ఈ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, పథకాలు, సబ్సిడీలు ఇంకా క్షేత్ర స్థాయికి చేరడానికి ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఉన్నాయి. అందువలనే ఈ రంగం నుంచి పూర్తి స్థాయిలో ఫలితాలు పొందలేకపోతున్నాం. బ్యాంకుల నుంచి రుణాల మంజూరులో జాప్యతని తగ్గించి, తగిన మౌలిక సదుపాయాలు కల్పించి, స్థానికంగా లభించే ముడి సరుకుని బట్టి పారిశ్రామిక క్లస్టర్‌లను ఏర్పాటు చేసి, డిజిటల్ వర్చువల్ మేళాలు నిర్వహించడం వంటి చర్యలు ఇక్కడ కూడా చేపట్టాలి. వాటిని వ్యవస్థీకృత మార్కెట్‌కి అనుసంధానించే చర్యలు చేపట్టాలి. ఈ రంగానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్లలో ఇతోధిక స్థాయిలో కేటాయింపులు జరపాలి. దేశ యువత ఉద్యోగార్థులుగా మాత్రమే మిగిలిపోకుండా, ఉద్యోగదాతలుగా మారేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలి. పాఠశాల కళాశాల స్థాయి నుంచి అవగాహన, ప్రోత్సాహం అందించాలి. సూక్ష్మ–చిన్న–మధ్యతరహా సంస్థల విజయగాథలను పౌరులు పాఠశాల దశ నుండే తెలుసుకునేట్టు వాటిని పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ రంగానికి ప్రభుత్వాలు, విద్యావ్యస్థ, బ్యాంకింగ్ రంగం, వ్యాపార సంఘాలు, మీడియా కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తే మన దేశానికి ఉన్న అపరిమిత సహజ మానవ వనరులతో అనతి కాలంలోనే భారత్‌ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదు.

– కందుల నరేంద్రనాథ్ దత్

లఘు ఉద్యోగ భారతి జనరల్ సెక్రెటరీ,

తెలంగాణ (నేడు అంతర్జాతీయ సూక్ష్మ,

చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం)

Updated Date - Jun 27 , 2025 | 04:53 AM