Share News

Moosi River Environmental Impact: మూసీ ప్రక్షాళన మరిచినట్టేనా

ABN , Publish Date - May 20 , 2025 | 02:21 AM

మూసీ నది పరిశుభ్రతపై పాలకులు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని విమర్శ ఉంది. పరిశ్రమల వ్యర్థాల వల్ల నది మురికిగా మారడంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది.

Moosi River Environmental Impact: మూసీ ప్రక్షాళన మరిచినట్టేనా

పాలకుల పలుకుల్లో ఉన్నంత గాఢత వారి చేతల్లో ఉండదు. ‘మూసీ నదిని గంగలా గలగలా పారిస్తాం’ అని గతంలో పలికిన పాలకులు ఇప్పుడు మిన్నకుండిపోయారు. మూసీని థేమ్స్ నదిలా మార్చేస్తామంటూ మాటిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ మాటే మరిచిపోయినట్లున్నారు. మూసీ ప్రక్షాళన కోసం కేటాయించిన బడ్జెట్ పేపర్లకే పరిమితం అయిందా? ఎందుకు ఈ జాప్యం? మూసీ నది హైదరాబాద్‌కే పరిమితమైనది కాదు. ఏపీలోని గుంటూరు జిల్లా వరకు తన ప్రవాహాన్ని కొనసాగిస్తూ వ్యవసాయానికి కూడా ఆదరువుగా ఉన్నది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ నది పరిశ్రమల వ్యర్థాల వల్ల మురికికూపంగా మారింది. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురై విషపు నదిగానే మిగిలిపోయింది. ఫలితమే నల్లగొండలో ఫ్లోరైడ్ భూతం. నీటికి సహజంగా రంగు ఉండదు అని చదువుకున్నాం. కానీ మూసీలో ప్రవహించే నీరు మాత్రం తెల్లగా నురగలు కక్కుతూ ఉంటుంది. ఈ నీటిని తాగి పశుపక్ష్యాదులు మృత్యువాత పడుతున్నాయి. నీటిని శుద్ధి చేసే యంత్రాలు ఉన్నాయి. యంత్రాంగం ఉంది.


విదేశాలకు వెళ్లి అక్కడి సాంకేతికత, మెళకువలు నేర్చుకుని వచ్చిన మంత్రులు, అధికారులూ ఉన్నారు. మరెందుకు ఇంకా కాలయాపన? మూసీ సుందరీకరణ మొదలుపెడితే పరిశ్రమల యజమానుల నుంచి ఒత్తిడులు ఉంటాయా? ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన విధంగా ప్రభుత్వం తక్షణమే మూసీ సుందరీకరణ మొదలుపెట్టాలి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు మూసీలో చేరకుండా చూడాలి.

– ప్రొఫెసర్ వెంకట్ దాస్

డా. పోటు నారాయణ

Updated Date - May 20 , 2025 | 02:23 AM