Modern Life: కరుణై కరిగే పంక్తులు
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:56 AM
మోహన్ రుషి కవితల్లో కవిత్వం బ్లెండెడ్ ఫిల్టర్ కాఫీలో చికోరిలా మహా ఎక్కువంటే ఇరవై శాతానికి మించదు. మిగతాదంతా మానవత్వమే.
మోహన్ రుషి కవితల్లో కవిత్వం బ్లెండెడ్ ఫిల్టర్ కాఫీలో చికోరిలా మహా ఎక్కువంటే ఇరవై శాతానికి మించదు. మిగతాదంతా మానవత్వమే. కాదంటే మనిషితత్వమే. ఆర్కే లక్ష్మణ్ ‘కామన్‌మ్యాన్’ కార్టూన్ సిరీస్‌లో ఒక కార్టూన్‌లో– ‘పాలిస్టర్ ఎనభై శాతం, కాటన్ ఇరవై శాతం’ అని రాసి ఉన్న ఒక షర్ట్ హోర్డింగ్ యాడ్ ముందు గోచీ పెట్టుకున్న కామన్‌మ్యాన్ నిల్చుని దానివైపు చూస్తుంటాడు. చూసీ చూసీ తనలో తాను– ‘పది శాతం కాటన్, తొంభై శాతం మై సెల్ఫ్’ అనుకుని నవ్వుకుంటాడు. మోహన్ రుషి ‘జీరో డిగ్రీ’ కవిత్వ సంపుటిలోని కవిత్వమూ అంతే. కవిత్వమంతా కరుణా, దయలే.
కవిత్వంలోని అమ్మదనంతో మన హృదయాల్ని ద్రవింపచేస్తాడు మోహన్ రుషి. ఈ పుస్తకాన్ని తన మాతృమూర్తికి అంకితమిస్తూ: ‘‘లోకం మెచ్చని నా బతుకుని లోకంగా చేసుకున్న అమ్మ రాజమల్లమ్మకు,’’ అనేసి ఆమెను మానవజాతికే ప్రతినిధిగా నిలిపేసాడు. పుస్తకంలో మొదటి కవిత ‘పాతయంత్రం’లో అమ్మల కడగండ్లకు కళ్ళు చెమర్చి, ‘‘అమ్మ ముఖం మీది ముడుతలు తనుపడ్డ కష్టాలకు ప్రతీకలు/ పాదాల పగుళ్లు రొటీన్ బతుకు మీది రోతకు ఆనవాళ్లు/ ఆ బట్టలన్నీ మా వీపులకేసి ఉతికినా మాకా శిక్ష చాలదు,’’ అంటూ తన అపరాధ భావనను వెల్లడిస్తాడు. ‘లెక్కలేదు పత్రంలేదు’ అనే మరో కవితలో– ‘‘గోస ముందు బుట్టిందో, అమ్మ ముందు బుట్టిందో/ ఏ సెన్సెస్‌లల్ల పత్తాలేదు’’ అని అమ్మల గోస నివేదిస్తాడు.
‘లేనివాళ్ల కోసం ఉండేవాళ్ళు’ అనే కవితలో మనల్ని కనిపెంచిన అమ్మల పట్ల మన అలక్ష్యం, take it for granted attitude లను గుర్తు చేస్తాడు: ‘‘నువ్వే ప్రపంచంగా, నీ కడుపులో ఇంత సల్ల నింపడమే లక్ష్యంగా/ అవిశ్రాంతంగా. అమ్మగా’’... ‘‘అమ్మలుకాక మరెవరైనా నీకోసం నిద్రలో ఉలిక్కిపడి లేస్తారా?’’ అని మనల్ని నిలేసి, ‘‘రాత్రంతా కురుస్తున్న వాన. జీవితమంతా తడుస్తున్న అమ్మ./ ఇవి రెండు మాత్రమే నిజాలు’’ అని ముగిస్తాడు కవి. అమ్మల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేసే పుత్రరత్నాలతో ఈ కవితను, ‘అమ్మల కన్నీళ్లు అబద్ధం కాదు’ అనే కవితను రెండో ఎక్కంలా పైనుంచి కిందకు, కిందనుంచి పైకి రోజుకు పదిసార్లయినా చదివిస్తే గుణం మారుతుందేమోనని చిన్న ఆశ.
మోహన్ రుషి ఎప్పుడో ఊరు విడిచి హైదరాబాద్ వచ్చేసినప్పటికీ, రాణివాసం కోసం పట్నవాసంపోయిన మల్లీశ్వరి తన బావనూ ఊరునూ మరవనట్లే, అతని మనసు మిర్యాలగూడ జ్ఞాపకాల ముసురును వీడలేదు. అందుకే ఎప్పుడు ఊరెళ్ళివచ్చినా– ‘‘ఎందుకో తెల్వదు/ వూరికెల్లి పట్నమొచ్చిన కానించి/ దేనిమీద నెనరు లేకుండయ్యింది’’ అని నాస్టాల్జియా ‘శెర’ కవితలో బందీ అవుతాడు.
‘ఎందుకో తెలీదు’ కవితలో ఆధునిక కృత్రిమ జీవనాన్ని ప్రదర్శించలేక, హిపోక్రసీని నటించలేక తన అంతర్మధనాన్ని– ‘‘ప్రేమ లేదని కాదు కానీ,/ తేపకోసారి తేమను నిరూపించడం నావల్ల కాదు’’ అని చేతులెత్తేస్తాడు. ‘గో... మై ఫ్రెండ్..!’ అనే కవితలో– ‘‘సెల్‌ఫోన్లో ఉన్న నెంబర్లన్నీ మనవి కానట్టే.../ ఫీడైన నెంబర్లు చాలానే ఉంటాయి కానీ/ ఫీలయ్యే మనుషులు లేకపోవడమే అసలు విషాదం-’’ అనే వాక్యాలు చదవగానే నా మిత్రుడొకరు ‘‘కోటి జనాభా దాటిన ఈ మహానగరంలో అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫోన్ చేసుకోగల ఇద్దరు మిత్రులైనా ఉన్నారా?’’ అని తరచుగా అనే మాట గుర్తొచ్చి, మనందరం ఒంటరి సమూహాలమేనా అన్న ప్రశ్న వేధించింది. ‘‘రంగు, రుచి, వాసన లేని స్నేహం/ ఇరవయ్యొకటవ శతాబ్దపు జీవితసత్యం’’ అంటూ ఈ కవిత ముగుస్తుంది.
‘బతికిన మనుషులు!’ అనే కవితలో దంపతుల మధ్య వైవిధ్యాన్ని ‘మిస్సమ్మ’ సినిమాలో ‘‘మనము మనదను మాటే... అననీయదు తాననదోయ్’’ పాటలో చెప్పిన తీరుగా– ‘‘ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని/ అప్పట్నుంచీ వాళ్ళు/ కలిసిమెలిసి జీవించలేదు’’ అని వారి అనైక్యతా రాగాన్ని ముక్తాయిస్తాడు. ఈ కవిత చదువుతుంటే ఆచార్య రజనీష్ ‘‘Wife and husband are intimate enemies’’ అన్నది కాలజ్ఞానం తోనే అని నమ్మవలసిందే.
‘మేడ్ ఇన్ మిర్యాలగూడ’ కవితలో కపట ప్రేమల్ని మిర్యాలు నూరినట్లు నూరి పారేస్తాడు. ఇది చదివి incarnations of hypocrisy వంటి జీవులు కొందరైనా దాన్ని వొదిలించుకుని re–incarnate అయితే బాగుండు– ‘‘జేబుల్నిండా రాళ్లు నింపుకుని/ పూల గురించి మాట్లాడలేను’’ అని నగర జీవన రంగస్థలం మీదకు కసిగా రాళ్లు విసిరి, ‘‘నిజం చెప్తున్నా.../ రెండుగా ఉండలేకే ఇప్పటికీ ఇలా రేయిలో మిగిలిపోయాను’’ అని తన అశక్తతను, సహజత్వాన్ని చాటుతాడు.
‘వాళ్ళు బంగారం, మనం ఇనుము’ కవితలో స్త్రీ పక్షపాతిగా అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అనురాగానికి పూర్తిగా ఫిదా ఐపోయి– ‘‘బతుకు మీద భరోసానిచ్చే శరణార్థి శిబిరాలయ్యేందుకూ.../ అమ్మల తర్వాత అమ్మలై/ మనల్ని పిల్లల్లా కాచుకోవడానికే అవతరిస్తారనుకుంటాను’’ అని కవి వారికి మొక్కేస్తాడు.
AI యుగంలో మనుషుల్ని ఆవహించి గడ్డకట్టించేసిన కృత్రిమ హృదయాల్ని కాస్తయినా వెచ్చబెట్టి కరిగించాలన్న కవి తపన టైటిల్ కవిత ‘జీరో డిగ్రీ’లో కనబడుతుంది. కొంత ఆశావాదంతో– ‘‘మనుషుల్లో ఒరిజినాలిటీ కోసం వెదికాడు’’. అది ఎక్కడా తగలకపోవడంతో– ‘‘ఉహూ... లాభం లేదు. అనుకరణ/ ఆకాశం నుండి అవని దాకా కమ్మేసింది’’ అంటూ గొణుక్కున్నాడు. ‘‘లేనివి ఉన్నవిగా చూపెట్టేకొద్దీ ఉన్నాయనుకుంటున్నవి/ లేనివిగా తెల్సిపోతుంది’’ అని బయటకే అన్నాడు.
ఈ సంకలనం మొత్తంలో బాగా నచ్చిన కవిత ‘విజేతలు వాళ్ళు!’. ఆకుకూరలు అమ్ముకునే అల్పజీవి సంస్కారం ముందు ఓడిపోయిన వ్యక్తి true confession ఈ కవితాంశం:
అల్కాపురి వీధుల్లో ఆకుకూరల్తో ఆప్యాయంగా నవ్వుతూ
ఆమె అడిగింది ఒక్కటే: ‘‘గంప కిందికి దించాలి సారూ.’’
బేరం సారం మొత్తం... తన గెలుపు, నా ఓటమి. అడిగిన ఒక
అదనపు కట్టనూ హాయిగా చేతుల్లో పెడ్తూ.
లెక్కల్లో తప్పిపోయిన నాకు గుర్తుచేసి మరీ చిల్లరంతా ఇస్తూ
నోరారా కోరింది ఒక్కటే: ‘‘గంప మల్ల నెత్తి మీద పెట్టాలి సారూ’’.
బరువు నిభాయించుకుంటూ, నాదొక కష్టంగా తలపోస్తూ, తను అన్న మాట
కొండలా మోస్తున్నా: ‘‘ఏమనుకోవద్దు సారు. పెద్దవారు’’.
అడుగడుగునా ఫిర్యాదులతో అలమటించే జీవితం తల్లీ!...
ఒక మూలన ఒదిగి కూర్చున్న కరివేపాకు విలువ చెయ్యదు–
– అని unconditional apology చెప్పేసి, పశ్చాత్తాప హృదయంతో వాళ్ళను విజేతలుగా ప్రకటించడం కవి సున్నితత్వ ఔన్నత్యమే.
‘జీరో డిగ్రీ’ కవితలన్నీ సమీక్షిస్తే నోట్ కంటే ఫుట్‌నోట్ పెద్దదైనట్లు అవుతుంది. కొన్ని మోహన్ రుషి మార్క్ వాక్యాలతో ముగిస్తాను:
‘‘గునపానికీ గుండె ఉంటుందని చూడ్డం అత్యాశ’’
‘‘షేరింగ్ ఆటో గుండా ప్రయాణిస్తాం. మరో రోజులోకి.’’
‘‘ముత్యమై మెరిసేదే జ్ఞాపకం’’
‘‘రాత్రులన్నీ దిగులుటకే’’
‘‘ముసుగులే ఎక్కువ లొసుగుల్ని చూపిస్తాయి’’
‘‘మొద్దుబారిన చర్మాలదే మోనోపలి’’
చివరగా ఒక్కమాట-– మోహన్ రుషి ‘జీరో డిగ్రీ’ కవితలన్నీ మసిబారిన మన హృదయ లాంతరు చిమ్నీని ముగ్గేసి తోమేసి మసకను, మాయను తుడిచేసి, మన చర్మ చక్షువుల్ని పదునెక్కిస్తాయి. మరింత మొద్దుబారి గడ్డకట్టకముందే ‘జీరో డిగ్రీ’ చదివితే మేలు.
- వంగల హర్షవర్ధన్
99499 92880