Share News

GST Reform: జీఎస్టీ వ్యవస్థలో విప్లవం

ABN , Publish Date - Sep 20 , 2025 | 06:00 AM

నిజాయితీ, పరిపాలనలో అసాధారణ దక్షత, దేశం పట్ల స్పష్టమైన దార్శనికత– నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఇవి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

GST Reform: జీఎస్టీ వ్యవస్థలో విప్లవం

నిజాయితీ, పరిపాలనలో అసాధారణ దక్షత, దేశం పట్ల స్పష్టమైన దార్శనికత– నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఇవి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిత్వంలో సహజంగా కనిపిస్తాయి. గతంలోని సంక్లిష్టమైన, అవినీతికి ఆస్కారమిచ్చే పన్నుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, జీఎస్టీ వంటి పారదర్శక, ఏకీకృత వ్యవస్థను ప్రవేశపెట్టడం ఆయన బలమైన సంకల్పానికి స్పష్టమైన నిదర్శనం. ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఇటుక మీద ఇటుకను జాగ్రత్తగా ఎలా పేరుస్తారో, అంతకన్నా శ్రద్ధగా మోదీ దేశ ఆర్థిక రంగాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆ అభివృద్ధి ఫలాలను ప్రతి పౌరుడికీ సమానంగా అందించాలన్నదే ఆయన అంతిమ లక్ష్యం. విమర్శలు చేసేవారు, గులామీ మనస్తత్వంతో ఉండే మేధావులు ఈ నిర్మాణాత్మక మార్పులను గుర్తించకపోవచ్చు, కానీ వాస్తవానికి విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు– ప్రతి దాంట్లోనూ మోదీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. పన్ను చెల్లించే సామాన్యుడికి భారాన్ని తగ్గిస్తూ, అదే సమయంలో దేశ ఖజానాను బలోపేతం చేసి, అభివృద్ధి ప్రయోజనాలను సమాజం దిగువ వర్గాల వరకు చేర్చడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం. ద్వేషపూరిత దూషణలు, హేళనల కన్నా, దేశ ప్రజల ఆశీర్వాదాలు, అభిమానమే గొప్ప శక్తి అని మోదీ పాలన పదే పదే నిరూపిస్తోంది. ఇది కేవలం రాజకీయ విజయం కాదు. దేశాభివృద్ధికి అంకితమైన ఒక నిజమైన నాయకుడి విజయగాథ. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పన్నుల విధానం ఒక కీలక అంశం. ఇది కేవలం ప్రభుత్వ ఖజానాను నింపే మార్గం మాత్రమే కాదు, దేశ ప్రగతిని, పౌరుల జీవన ప్రమాణాలను నిర్దేశించే శక్తిమంతమైన సాధనం కూడా. ఈ నేపథ్యంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పన్నుల సంస్కరణలు, గత కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలతో పోల్చి చూసినప్పుడు, ఒక సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన మార్పుగా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్‌ చేసే విమర్శలకు అతీతంగా, వాస్తవాలను పరిశీలిస్తే, మోదీ ప్రభుత్వం పన్నుల వ్యవస్థను సరళీకరించి, పారదర్శకంగా మార్చి, దేశ ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు ఎలా లబ్ధి చేకూర్చిందో అర్థమవుతుంది.


మోదీ అధికారంలోకి రాకముందు, యూపీఏ ప్రభుత్వ హయాం(2004–2014)లో పన్నుల వ్యవస్థ బహుళ పన్నులు, అధిక రేట్లు, సంక్లిష్టతలతో నిండి ఉండేది. ‘పన్ను మీద పన్ను’ అనేది సర్వసాధారణం. ఈ విధానం కేవలం వ్యాపారులకే కాక, అంతిమంగా వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపేది. అంతేకాకుండా, ప్రత్యక్ష పన్నుల విషయంలో, ముఖ్యంగా ఆదాయపు పన్నులో కాంగ్రెస్‌ హయాంలో పన్ను మినహాయింపు పరిమితి చాలా తక్కువగా ఉండేది. ఉదాహరణకు– ఒకప్పుడు కేవలం రూ.2 లక్షల వార్షిక ఆదాయం దాటితేనే పన్ను పరిధిలోకి వచ్చేవారు. ఇది మధ్యతరగతి, వేతన జీవులకు భారంగా ఉండేది. అయితే, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పన్నుల సంస్కరణలతో దేశాన్ని సరికొత్త మార్గంలో నడిపించింది. జీఎస్టీ వంటి ఏకీకృత పన్ను వ్యవస్థ, ఆదాయపు పన్ను రాయితీలు, రాష్ట్రాలకు నిధుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడం... మోదీ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన సానుకూల నిర్ణయాలు. మోదీ ప్రభుత్వం వచ్చాక, ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టకుండా సేవింగ్స్‌ చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తున్నప్పటికీ, ఈ సంస్కరణలు దేశ ఆర్థిక ఊతానికి దోహదపడ్డాయి. మోదీ దూరదృష్టి వల్ల ప్రజలు తక్కువ పన్ను భారంతో జీవిస్తున్నారు. మోదీ ప్రభుత్వం 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టి, బహుళ పన్నులను ఒకే వ్యవస్థగా మార్చారు. దీని వల్ల వ్యాపారాలు సులభతరమయ్యాయి, ఆర్థిక వృద్ధి పెరిగింది. ప్రారంభంలో స్లాబ్‌లు 5, 12, 18, 28 శాతంగా ఉండేవి.


మోదీ ప్రభుత్వం కేవలం పన్నుల వ్యవస్థను సంస్కరించడమే కాకుండా, ఆ ఫలాలను సామాన్య ప్రజలకు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఈ నెలలో మోదీ ప్రభుత్వం జీఎస్టీ 2.0ను తీసుకొచ్చి, స్లాబ్‌లను కేవలం రెండుకు (5, 18 శాతానికి) తగ్గించింది. గతంలో 18 లేదా 28 శాతం పన్ను శ్లాబులలో ఉన్న నూనెలు, సబ్బులు, టూత్‌పేస్టులు వంటి అనేక నిత్యావసర వస్తువులను 5 లేదా 12 శాతం శ్లాబులలోకి మార్చారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. అంటే నిత్యావసరాలపై సున్నా పన్ను విధించారు. ప్యాక్‌ చేయని ఆహారధాన్యాలు, పాలు, కూరగాయలు వంటి వాటిపై జీఎస్టీ ఉండదన్నమాట. విద్యకు అవసరమైన పుస్తకాలు, నోట్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లపై పన్నును జీరో చేశారు. అలాగే, ఆరోగ్య, వ్యక్తిగత ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై పన్ను తొలగించడం, వైద్య పరీక్షల కిట్లపై పన్నును 5 శాతానికి తగ్గించడం వంటి చర్యలు ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చాటుతున్నాయి. జీఎస్టీలో సగం రాష్ట్రాలకు, సగం కేంద్రానికి వెళ్తుంది. కేంద్రానికి వచ్చిన పన్నుల్లో 42 శాతం మళ్లీ రాష్ట్రాలకు ఇస్తుంది. జీఎస్టీని కాంగ్రెస్‌ ‘గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌’ అని విమర్శించింది, రేట్లు అధికమని చెప్పింది. కానీ బీజేపీ స్పందిస్తూ, కాంగ్రెస్‌ పార్టీయే జీఎస్టీని ఆలస్యం చేసిందని, ఇప్పుడు రాహుల్‌గాంధీ ఒత్తిడి వల్లే సంస్కరణలు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమని అంటోంది. వాస్తవానికి, మోదీ నాయకత్వంలోనే జీఎస్టీ సఫలమైంది. కాంగ్రెస్‌ హయాంలో 13వ ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రకారం రాష్ట్రాలకు 32 శాతం టాక్స్‌ డెవల్యూషన్‌ ఉండేది. మోదీ ప్రభుత్వంలో 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ దానిని 42శాతానికి పెంచింది (ఎఫెక్టివ్‌ 41శాతం). రూపాయి టాక్స్‌లో కేంద్రానికి సుమారు 26 పైసలు మాత్రమే వస్తాయి, మిగతా 74 పైసలూ రాష్ట్రాలకు వెళ్తాయి. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాలు 20–30శాతం వ్యాట్‌ వేస్తాయి, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ తక్కువ (పెట్రోల్‌పై రూ.19.90/లీ, డీజిల్‌పై రూ.15.80/లీ). రాష్ట్రాలు దోపిడీ చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవమేమిటంటే, మోదీ ప్రభుత్వం ఫెడరలిజాన్ని బలోపేతం చేసింది. విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం ఇలా... ప్రతి రంగంలో మోదీ ముద్ర కనిపిస్తుంది. కాంగ్రెస్‌ అధిక పన్నులు, అవినీతితో దేశాన్ని దెబ్బతీసింది. మోదీ ప్రభుత్వం పన్నుల సంస్కరణలు దేశానికి ఆర్థిక ఊతం, ప్రజలకు లాభం అందిస్తున్నాయి.

-జయప్రకాశ్ నారాయణ వల్లూరు బీజేపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్

Updated Date - Sep 20 , 2025 | 06:00 AM