Share News

Narendra Modi Reform Governance: అటల్‌ బాటలో మోదీ ‘రిఫామ్ ఎక్స్‌ప్రెస్’

ABN , Publish Date - Dec 25 , 2025 | 02:49 AM

అజాత శత్రువు, భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్‌బిహారీ వాజ్‌పేయి శతజయంతి సంవత్సరం పూర్తవుతున్న సందర్భమిది. భారతదేశంలో సుపరిపాలనకు మార్గదర్శనం చేసిన...

Narendra Modi Reform Governance: అటల్‌ బాటలో మోదీ ‘రిఫామ్ ఎక్స్‌ప్రెస్’

అజాత శత్రువు, భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్‌బిహారీ వాజ్‌పేయి శతజయంతి సంవత్సరం పూర్తవుతున్న సందర్భమిది. భారతదేశంలో సుపరిపాలనకు మార్గదర్శనం చేసిన ఆయన ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా కొనసాగిన తొలి కాంగ్రెసేతర రాజకీయవేత్త. ప్రజాసంక్షేమంపై శ్రద్ధ, దేశ భద్రతపై రాజీలేని విధానంతోపాటు సంస్కరణల విషయంలో పూర్తి నిబద్ధతతో దేశాన్ని పాలించారు. సంకీర్ణ సర్కారును నడుపుతూనే వివిధ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేశాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వాజ్‌పేయి బాటలోనే నడుస్తూ ‘సుపరిపాలన’ను సంస్కరణల ద్వారా ఆచరణలో చూపిస్తున్నారు.

మూడోసారి అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారు సంస్కరణల విషయంలో మరింత స్పష్టమైన విధానంతో పనిచేస్తోంది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలను చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఈ ఏడాదిలోనే క్రీడలు, మినరల్ ఎక్ఛేంజ్, పోర్ట్స్, వైద్యం మొదలైన రంగాల్లో సుమారు 20 కీలకమైన బిల్లులను తీసుకొచ్చింది. ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 10 కీలక బిల్లులు తీసుకురాగా, ఎనిమిది బిల్లులు ఉభయసభల ఆమోదం పొందాయి. ఈసారి సమావేశాల్లో ఉపాధి కల్పన, అణుశక్తి, బీమా, పన్నుల హేతుబద్ధత, దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వం తదితర అంశాలపై బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. వచ్చే రెండు దశాబ్దాలపాటు దేశానికి ఏమేం అవసరమో గుర్తించి.. దేశహితం కోసం వాటిని చట్టరూపంలోకి తీసుకొచ్చింది. ఇవి కాకుండా.. ‘రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్–2025’ ద్వారా.. 1886 నాటి ఇండియన్ ట్రామ్ వేస్ బిల్ వంటి దాదాపు 70 కాలం చెల్లిన చట్టాలను కూడా తొలగించింది.

వాజ్‌పేయి హయాంలో గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2001లో ‘సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన’ పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, ఆహార భద్రతకు బాటలు వేశారు. ఆ తర్వాత ‘ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన’ ద్వారా గ్రామాలకు అనుసంధానం పెంచారు. వాజ్‌పేయి సంపూర్ణ గ్రామ స్వరాజ్య స్వప్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ సర్కారు వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్–2025 బిల్లు (జీ రామ్ జీ)ను తీసుకొచ్చింది. ఉపాధి హామీ, నైపుణ్యం, జీవనోపాధి, కార్మికులకు గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించడం ద్వారా వికసిత భారత్‌ నిర్మాణానికి బాటలు వేసేలా ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లుకు రూపకల్పన చేసింది. ఈ పథకంలో ఉన్న 100 రోజుల పనిదినాలను 125కు పెంచి భరోసా ఇచ్చింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 15 రోజుల్లోగా పని తప్పనిసరిగా కల్పించాలని, లేదంటే వారికి పరిహారం అందించాలని స్పష్టం చేసింది. చట్టం అమల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు సాంకేతికత వినియోగాన్ని తప్పనిసరి చేసింది. చెల్లింపులకు సంబంధించి బయోమెట్రిక్ ధ్రువీకరణ, ప్రణాళికల తయారీ, నిర్వహణ కోసం జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగం, పనిని ట్రాక్ చేసేందుకు మొబైల్ అప్లికేషన్‌ను ఈ చట్టం తప్పనిసరి చేసింది. కొత్త చట్టంలో ఉపాధి హామీతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో గ్రామాల్లో నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాల మెరుగు, అటవీకరణ పెంచడం, గ్రామీణ రహదారులు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ధాన్యం నిల్వ కేంద్రాల వంటి మౌలిక వసతులు చేపట్టవచ్చు. దీంతో గ్రామీణ కార్మికులకు జీవనోపాధి మెరుగుపడి, వ్యవసాయ రంగానికి మేలు జరగనుంది.


వాజ్‌పేయి హయాంలో అంతర్జాతీయ ఒత్తిడులను లెక్కచేయకుండా భారతదేశం అణుపరీక్షలను నిర్వహించింది. ‘‘భారత్ ఇప్పుడు అణ్వస్త్రదేశం. భారతదేశ భద్రతకు, ఆత్మనిర్భరతకు ఈ ప్రయోగం అత్యవసరం’’ అని అప్పుడు వాజ్‌పేయి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో మోదీ సర్కారు అణు ఇంధన రంగంలో మరింత పురోగతి సాధించేందుకు శాంతి (ద సస్టేనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫామింగ్ ఇండియా) బిల్లు–2025ను తీసుకొచ్చింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి, 2070 నాటికి కర్బన ఇంధన వినియోగం నిలిపివేత లక్ష్యంగా ఈ బిల్లును రూపొం దించారు. కఠినమైన, భద్రతాపరమైన నిబంధనల పరిధిలో.. అణు ఇంధన రంగంలో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు ఈ బిల్లు బాటలు వేసింది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ దిశలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను పూర్తిచేసేందుకు ఈ బిల్లు ఉపయుక్తం కానుంది.

పోటీ ప్రపంచంలో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సెమీకండక్టర్ల తయారీ మొదలైన అధునాతన సాంకేతికతల వినియోగానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్ అవసరం. అణువిద్యుత్‌తోనే ఇది సాధ్యం. అందుకే ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అణుశక్తి చట్టం–1962, అణు నష్టానికి పౌర బాధ్యత చట్టం–2010లను రద్దు చేయడం ద్వారా, అంతర్జాతీయ అణుశక్తి పర్యావరణ వ్యవస్థ సహకారాన్ని పొందుతూ దేశీయ అణుశక్తిని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. ఈ ప్రయత్నంలో ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, నష్టనివారణ కోసం ‘న్యూక్లియర్ లయబిలిటీ ఫండ్’ను ఏర్పాటు చేసింది.

అందరికీ బీమా భరోసా ఉండాలనేది బీజేపీ ఆలోచన. వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ (ఐఆర్‌డీఏ)ను తీసుకొచ్చింది. బీమా రంగంలో ప్రైవేటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (26శాతం) బాటలు వేస్తూనే ఓ చట్టబద్ధమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మోదీ సర్కారు అందరికీ బీమా, అందరికీ రక్ష (బీమా సవరణ) బిల్లు–2025ను తీసుకొచ్చింది. దీంతో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 నుంచి 100శాతానికి పెంచడం ద్వారా అంతర్జాతీయంగా అవలంబిస్తున్న పద్ధతులు అమల్లోకి వస్తాయి. బీమా కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది. తద్వారా బీమా కవరేజ్ పెరిగి, ప్రీమియం తగ్గుతుంది. దీంతో మారుమూల ప్రాంతాల వారు కూడా బీమా చేయించుకునే వీలు కలుగుతుంది.


వాజ్‌పేయి ప్రభుత్వం వైద్య రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది. తద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్యసేవలకు బాటలు వేసింది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ‘ఆరోగ్య భద్రతతో జాతీయ భద్రత సెస్ బిల్లు–2025’ను తీసుకొచ్చింది. ఇది ‘ఆరోగ్య భారత్’ నిర్మాణం కోసం వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

‘‘మా అభివృద్ధిపథం సంస్కరణల ఆధారంగా ఉంటుంది. మా విధానాలు ప్రజాకేంద్రితంగా ఉంటాయి. గత 11 ఏళ్లుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో మరిన్ని తీసుకొస్తాం. ప్రజాసంక్షేమం, దేశ గౌరవం, వాణిజ్య ప్రయోజనాలు, భద్రత వంటి విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదు’’ అని ప్రధాని నరేంద్రమోదీ వివిధ సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అందులో భాగమే ఈ శీతాకాల సమావేశాల్లో మోదీ సర్కారు తీసుకొచ్చిన సంస్కరణల ఎక్స్‌ప్రెస్.

జి.కిషన్‌రెడ్డి
కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి

(నేడు జాతీయ సుపరిపాలన దినోత్సవం)

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..

Updated Date - Dec 25 , 2025 | 02:49 AM