Ramachandra Guha: మోదీపై అక్కసుతోనే ఇన్ని అవాస్తవాలు
ABN , Publish Date - May 24 , 2025 | 05:38 AM
రామచంద్ర గుహ వ్యాసంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తూ, మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని హిందుత్వాన్ని తక్కువ చేయడం, భారత్‌ను తిరోగమనంలో చూపించాలనే ప్రయత్నం జరిగిందని వ్యాసకర్త ఉల్లి బాలరంగయ్య పేర్కొన్నారు. దేశ భద్రత, ఆర్థిక పురోగతి, లౌకికతపై గుహ వ్యాఖ్యలు వక్రీకృతంగా ఉండాయని తెలిపారు.
‘తిరోగమనంలో పురోగామి భారత్!’ శీర్షికతో మే 17వ తేదీన రామచంద్ర గుహ రాసిన వ్యాసంలో మోదీ ప్రభుత్వ వ్యతిరేకత, హిందూ సమాజంపై ద్వేషం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. తమ మత ఔన్నత్యం ఉత్కృష్టమైనదని హిందూ మత దురభిమానులు విశ్వసిస్తారని గుహ అన్నారు. వాస్తవంగా హిందూ మతానికి సంబంధించిన ఏ గ్రంథాలైనా, ఏ పీఠాధిపతి అయినా హిందూ మతమే అన్ని మతాల కంటే శ్రేష్ఠమైనదని, ఈ మతాన్ని అనుసరిస్తే మాత్రమే స్వర్గానికి అర్హత పొందుతారని చెప్పలేదు. మన మహర్షులు ‘ఏకం సత్ విప్రా బహుదా వదన్తి’ (సత్యం అంటే భగవంతుడు ఒక్కడే, ఆయనను అనేక రూపాల్లో కొలుచుకోవచ్చు) అని ఉద్బోధించిన మార్గాన్ని హిందూ సమాజం నేటికీ అనుసరిస్తూనే ఉంది. హిందువులకు ఉండే ఈ ఔన్నత్యమే మైనారిటీలైన ముస్లింలు, క్రైస్తవులు హిందూత్వ విలువలను ద్వేషించడానికి, దూషించడానికి మార్గాన్ని సుగమం చేసిందంటే అతిశయోక్తి కాదేమో! మతం ఆధారంగా రెండు భూభాగాలు ఈ దేశం నుంచి విడిపోయిన తర్వాత ఈ దేశం లౌకిక విలువలకు పట్టం కట్టిందంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల ఆలోచన విధానమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని ఒప్పుకొనే మానసిక స్థితి వ్యాసకర్త రామచంద్రగుహకు ఉన్నట్లు కనిపించలేదు. రిపబ్లిక్ సంస్థాపక విలువలైన ప్రజాస్వామ్యం, బహుళత్వవాదం ఈ దేశంలో ఆచరించబడలేదని ఒక పేరాలో చెప్పి, ఈ విలువలు సుస్థిరంగా ఉన్నాయని మరొక పేరాలో చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత ఉండాలి కదా? భారత రాజ్యాంగం పురాతన హిందూ రాజరికపు నమూనాను తిరస్కరించిన మాట వాస్తవమే. కానీ ఆచరణలో 1947 నుంచి 2014 వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబ పరిపాలన కొనసాగిందనే విషయం దేశ ప్రజలకు బాగా ఎరుక. ఇక మతాన్ని రాజ్య వ్యవస్థలో మిళితం చేయలేదని చెప్పడం పచ్చి అబద్ధం. మతం ఆధారంగానే దేశాన్ని పంచారు. కొన్ని మతాల వాళ్లకు ప్రత్యేక చట్టాలు కూడా తయారు చేసి ఇచ్చారు. రాజ్యాంగం సాక్షిగా ప్రజలందరూ కట్టిన పన్నుల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఒక మతం వారికి విదేశీ యాత్రలకు ఖర్చు చేయడం, రాష్ట్రపతి భవనాన్ని ఇఫ్తార్ విందులకు కేంద్రంగా మార్చడం మన ప్రజాస్వామ్యంలో భాగమే! ఇక కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్‌ను, ఇండియాను ఒకే గాటన కట్టేసి మాట్లాడడానికి కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం అమెరికా చెప్పినట్లు వినాల్సిందే. అక్కడ ప్రభుత్వంలో ట్రంప్ ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు. అమెరికాకు భారత్ కంటే పాకిస్థాన్ ప్రియమైన దేశం.
దక్షిణాసియాలో అమెరికా పెత్తనం కొనసాగాలంటే పాకిస్థాన్‌కు ఆ దేశ సహాయ సహకారాలు అందాల్సిందే. మరొక కోణంలో భారత్ ఆర్థికంగా ఎదగడం అమెరికాకు ఇష్టం ఉండదు. క్రయోజనిక్ టెక్నాలజీని రష్యా మనకు ఇవ్వకుండా అమెరికా మోకాలొడ్డింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో 562 సంస్థానాలు సులభంగా విలీకరణ చెందితే, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జోక్యంతో కశ్మీర్ సంస్థానం అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ కోణంలో ఆలోచిస్తే వాస్తవం బోధపడుతుంది. కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ భారత్‌తో మూడు యుద్ధాలు కాదు, నాలుగు యుద్ధాలు చేసింది. ఇక పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని తీవ్రవాద కేంద్రాలపై దాడి మాత్రమే చేసింది. దానిని యుద్ధంగా కొందరు స్వయంప్రకటిత మేధావులు, దేశ వ్యతిరేక మీడియా ప్రచారం చేయడం, ‘యుద్ధాన్ని నేనే నిలుపుదల చేసినాను’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు ఇచ్చుకోవడం బుద్ధి మాంద్యంగా భావించాలి. భారత సైన్యం జరిపిన లక్ష్య నిర్దేశిత దాడులకు బెదిరిపోయిన పాక్ నాయకులు, సైన్యం తోక ముడిచి ట్రంప్‌కు దాసోహం అయింది. ఈ విషయంలో తీవ్రవాద శిక్షణా కేంద్రాలు మాత్రమే తమ టార్గెట్ అని భారత్ ముందుగానే ప్రకటించింది ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నది. ట్రంప్ మాటలు అబద్ధాలని ప్రపంచంలోని రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు. అన్ని విధాల చెడిపోయిన పాకిస్థాన్‌పై యుద్ధం చేయాలని మోదీ ప్రభుత్వం కోరుకోలేదు. ‘నా మాట వినకపోతే వాణిజ్య సంబంధాలను తెంచేసుకుంటాన’ని ట్రంప్ చెప్పిన మాటలను భారత ప్రభుత్వం లెక్క చేయలేదు అనే విషయం ఇక్కడ గమనార్హం. పోఖ్రాన్ అణుపరీక్షల తర్వాత అమెరికా మన దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించి, భంగపాటుకు గురైందనే విషయం ట్రంప్‌కు తెలుసు. ఇక కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో రాజ్య హింస ఉందని చెప్పడం వాస్తవాలను దాచడమే. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదుల దుశ్చర్యల వల్ల మూడు లక్షల మంది హిందువులు లోయ నుండి పారిపోయి వచ్చారు. అనేక మంది హిందువులు హత్య గావించబడ్డారు.
ఇక నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలలో అంతర్జాతీయ ప్రాయోజిత వేర్పాటువాద గ్రూపుల వల్ల అక్కడ హింస చెలరేగి, శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతున్నది. వాస్తవ విషయాలు ఇలా ఉంటే రాజ్య హింస అని బుకాయింపు ఏమిటి? ఈ వ్యాసంలో అత్యంత సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ ఎక్కడంటే– ఈ దశాబ్ది కాలంలో అంటే మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం తిరోగమించిందని చెప్పడం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో తొమ్మిదవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానానికి వచ్చింది. కరోనా విపత్కర పరిస్థితిని తట్టుకొని, గుణాత్మకమైన ఆర్థికాభివృద్ధిని సాధించింది. కరోనా టీకాలను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు అందించి, వసుధైక కుటుంబ భావనకు నాంది పలికింది మోదీ ప్రభుత్వం అనే విషయం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇక పహల్గాం దాడి తర్వాత కశ్మీర్‌లో అమాయకులపై కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం వ్యాసకర్త వక్రబద్ధికి పరాకాష్ఠ! తీవ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్న వారిని మాత్రమే ప్రభుత్వం అరెస్టు చేసింది. వాస్తవంగా కశ్మీర్‌లో వేర్పాటువాదులు, తీవ్రవాదులు పేట్రేగిపోవడానికి ప్రధాన కారణం కశ్మీరీ ముస్లింల భారత వ్యతిరేకత. మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లౌకికవాద ముసుగు వేసుకున్న హిందూ వ్యతిరేక హిందువులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఇలాంటి వారి వలన భారతదేశం భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి, దేశాన్ని అతలాకుతలం చేయడానికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు వీరి ఆలోచనలు బాగా ఉపయోగపడతాయి. ఈ విషయంలో దేశ హితాన్ని కోరే ప్రజా సమూహం అప్రమత్తంగా ఉండాలి. l
-ఉల్లి బాలరంగయ్య