Share News

Caste in Disguise: ఆధునిక ముసుగుల్లో కులం!

ABN , Publish Date - Oct 17 , 2025 | 01:46 AM

ఇటీవలి మూడు సంఘటనలు నాకు పాతికేళ్ళ క్రితం విన్న గుడ్‌చనా పల్లీబెల్లం కథనాన్ని గుర్తుచేశాయి. నాకు పరిచయం ఉన్న ఒక ఉత్సాహవంతుడైన

Caste in Disguise: ఆధునిక ముసుగుల్లో కులం!

ఇటీవలి మూడు సంఘటనలు నాకు పాతికేళ్ళ క్రితం విన్న ‘గుడ్‌చనా’ (పల్లీబెల్లం) కథనాన్ని గుర్తుచేశాయి. నాకు పరిచయం ఉన్న ఒక ఉత్సాహవంతుడైన దళిత విద్యార్థి పోటీ పరీక్షలో ఉత్తీర్ణుడై అధికారిగా చేరాడు. అతని వివాహం తర్వాత కొంతకాలానికి అతన్ని నేను కలుసుకున్నాను. అతని భార్య సాపేక్షంగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ‘ఎస్సీ’ ట్యాగ్‌ వదిలేసి అధికారుల సాధారణ సమాజంలో కలిసిపోవాలని ఆమె ఆసక్తి చూపింది. అతనూ బహుశా అలాగే అనుకొని ఉండవచ్చు. నేను అతని మారిన స్వభావంపై వ్యాఖ్యానించే ముందే, అతను సిగ్గుపడుతూ ‘‘అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాను సార్’’ అన్నాడు. ఈ మాట పైకి సాధారణంగా కనిపించినా – ఇది సర్దుబాటు, అనుసరణ, లొంగిపోవడం వరకు దేనినైనా కవర్ చేస్తుంది.


రెండేళ్ళ తరువాత అతని ఇంటికి మళ్ళీ వెళ్ళాను. డ్రాయింగ్ రూమ్‌లో అంబేడ్కర్ చిత్రపటం చూసి ఆశ్చర్యపోయాను. నా కళ్లలోని ప్రశ్నను గమనించి, నేను అడగకముందే అతను ఆ పల్లీచెక్క కథ చెప్పాడు. వారి మొదటి బిడ్డ నడవడం మొదలుపెట్టిన రోజు అధికారుల కాలనీలోనివారితో అతనూ, అతని భార్యా తమ సంతోషాన్ని పంచుకున్నారు. వారి ఆచారం ప్రకారం ఆ తీపిపదార్థాన్ని పంచారు. సాయంత్రం నడకకు వెళ్లినప్పుడు, ఒకరిద్దరు పొరుగువారు వీరు ఇచ్చిన ‘గుడ్-చనా’ను బయట చెత్తకుప్ప మీద పడేసినట్టు గమనించారు. ఎవరూ ఏమీ అనలేదు, ఏ కుల దూషణా లేదు. అయినా, ఒక్క క్షణంలో ఈ దంపతులకు సామాజిక సత్యం తెలిసిపోయింది. వదిలించుకోవాలనుకున్నా ఆ ట్యాగ్ వారిని వదలదు. కాబట్టి, వారు దాన్ని మళ్ళీ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఘటన మూడు విషయాలు స్పష్టం చేస్తున్నది. మొదటిది, కులం మన గతం మాత్రమే కాదు; అది మన ప్రస్తుత జీవిత వాస్తవికత. అంతేకాదు, భవిష్యత్తులో కూడా భాగమయ్యేది. రెండవది, ఇది గ్రామీణ లేదా ‘వెనుకబడిన’ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు; ఆధునిక సమాజంలో కులం కొత్త ముసుగులు ధరిస్తోంది. కుల ఆధారిత వివక్ష, అణచివేత అనేక పొరల్లో చుట్టబడి వస్తున్నది. మూడవది, కులం అంటిపెట్టుకొని ఉంటుంది, దాని ప్రభావాలను తొలగించడం అంత సులభం కాదు. కుల అసమానతలను ఎదుర్కోవడానికి విద్య, ఉద్యోగాలు అవసరమే కానీ, అవి మాత్రమే సరిపోవు. ఈ మూడు పాఠాలూ ఇటీవలి మూడు ఘటనల తర్వాత నాకు మళ్లీ గుర్తొచ్చాయి. రాయ్‌బరేలీలో హరిఓమ్ వాల్మీకి హత్య, చండీగఢ్‌లో ఐపీఎస్‌ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బి.ఆర్. గవాయ్ మీద బూటు విసిరే ప్రయత్నం. ఈ మూడూ భిన్నమైన సంఘటనలు, ఈ ముగ్గురు వ్యక్తులూ చాలా భిన్నస్థాయిల్లో ఉన్నవారు... వారందరూ దళితులు అనేది తప్ప. అయితే, బాధితులు దళితులు అనే వాస్తవం ఒక్కటే ఈ మూడు వేర్వేరు ఘట్టాలను ‘కుల ఆధారిత అణచివేత’ కేటగిరీలోకి తేలేదు. హరిఓమ్‌ను దళితుడు అని కాక, దొంగగా అతడిని అనుమానించిన గుంపునకు సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయాడు కాబట్టి చంపేశారు. గవాయ్ మీద దాడి చేసినవాడు కూడా ఎదుటివారి కులాన్ని ప్రస్తావించలేదు, కానీ హిందూత్వానికి అవమానం అని అన్నాడు. అధికారవర్గం గుసగుసల ప్రకారం, ఐపీఎస్‌ అధికారి పూరన్‌కుమార్ అతను తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్న కుల వివక్ష కంటే, వృత్తిగత, అంతర్గత పోటీకి ఎక్కువగా బలైపోయాడు. ఇదీ, ప్రధాన, ప్రాబల్య ఆలోచనాధోరణి మనల్ని నమ్మమని చెబుతున్నది.


ఈ మోసపు పొరను తొలగించాలంటే మనం ఒక కాల్పనిక ప్రశ్న వేయాలి. ఈ వ్యక్తులు దళితులు కాకపోతే వారు అదే గతిని పొందేవారా? తనను దొంగ అని అనుమానించిన గుంపు మధ్యలో హరిఓమ్ నిలబడి, నేను ఠాకూర్‌ని అని అరిచాడనుకుందాం. అవమానం, దెబ్బలనుంచి అతను తప్పించుకోలేకపోవచ్చు కానీ, ఏకంగా చంపేస్తారా? ఎవరూ రక్షించడానికి ముందుకురాని స్థితి ఉంటుందా? అతని శరీరం మరుసటిరోజు పోలీసులు వచ్చేవరకూ రోడ్డుమీద పడివుంటుందా? పోలీసులు అంత ఆలస్యంగా చర్య తీసుకుంటారా? హరిఓమ్‌కు ఈ దుర్గతి పట్టడానికి అతడు ఓ దొంగ అన్న అనుమానం కాదు, అతడు వాల్మీకి కాబట్టి. చీఫ్‌ జస్టిస్‌ గవాయ్ సంఘటనను తీసుకోండి. జడ్జి సామాజిక నేపథ్యం ఏదైనప్పటికీ, ఒక పిచ్చివాడు ఏ కోర్టులోనైనా ఇలాంటి పనిచేయవచ్చునన్నది వాస్తవం. కానీ, మానసికస్థితి సరిగా ఉన్న ఒక లాయర్ సీజేఐ కోర్టులో ఇలా చేస్తాడా? సీజేఐ స్థాయిని తగ్గించే ఇతరత్రా ప్రాతిపదికలేమీ లేకపోతే ఈ ఘటన జరుగుతుందా? సదరు లాయర్‌ చెబుతున్న ‘సనాతనానికి అవమానం’ కేవలం మత సంప్రదాయానికి మాత్రమేనా, లేదా కుల హిందూ ఆధిపత్యం ఉపసందేశం కూడా అందులో ఉందా? మరోవిధంగా చెప్పుకోవాలంటే, సదరు న్యాయవాది ఎదుటివ్యక్తి మాటలకు మాత్రమే ప్రతిస్పందించాడా, లేదా ఎవరు అన్నదానిని బట్టి కూడా ప్రతిస్పందించాడా? ఈ ‘కులవాద ద్వేషం ఉపరితల ప్రదర్శన’ మన కాలంలో సాధారణమైపోయింది. ఈ సంఘటన డి.వై. చంద్రచూడ్ కోర్టులో జరిగి, దాడి చేసినవాడు ముస్లిం అయితే మొత్తం దేశం ఇప్పటిలాగానే నిశ్శబ్దంగా ఉంటుందా? హోమ్, జాతీయ భద్రతావ్యవస్థలు ఇలాగే ప్రతిస్పందిస్తాయా? టీవీ చానెల్స్ రోజుల తరబడి దానిపై విందు చేసుకోవూ? దాడి చేసినవాడు వరుస ఇంటర్వ్యూలతో సులువుగా తప్పించుకోగలడా? సోషల్ మీడియాలో అతన్ని సపోర్ట్ చేసే క్యాంపెయిన్లు ఊహించగలమా, ఈ ఘటనలో జరిగినట్టుగా..?. గవాయ్ రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతస్థానాన్ని ఆక్రమించినా, సామాజిక వ్యవస్థలో ఆయన స్థానం మారలేదని ఈ ఘటన గుర్తుచేస్తోంది. పూరన్ కుమార్ దళితుడు కాకపోతే ఏమవుతుంది? అధికారుల మధ్య పోటీ, తమకు గిట్టని గొంతుకల అణచివేత ఆ వ్యవస్థలో అరుదైనదేమీ కాదు. కానీ కుమార్ చివరి లేఖ అతని ఒంటరితనం, పై అధికారుల వరుస అణచివేతల సత్యాన్ని చెబుతోంది.


కేవలం ధిక్కారం, భిన్నస్వరం అయినందువల్లనే అతడు ఈ ఒంటరితనం ఎదుర్కొన్నాడా లేక అందులో సామాజిక వెలి కూడా ఉందా? తన సామాజికవర్గానికే చెందిన అధికారుల నెట్‌వర్క్ చుట్టూ ఉండివుంటే అతను ఇదే పరిస్థితి ఎదుర్కొనేవాడా? ఈ ఘటనపై విస్తృత ఆందోళన, మీడియా కవరేజ్ జరిగింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అసోసియేషన్లనుంచి కాస్తంత ఆలస్యంగానే అయినా మద్దతు కూడా ఉంది. కానీ, ఈ ఘటనలో కులం కోణంపై అంగీకారం, చర్చ లేవు. ‘కులరహిత అధికారస్వామ్యం ఒక మిథ్య’ అని ఈ సంఘటన మరోమారు నిరూపిస్తోంది. నేను చెప్పిన ‘పల్లీ బెల్లం’ ఘటన సదరు యువ అధికారి ఇంట్లో బాబాసాహెబ్ చిత్రపటం పునఃస్థాపనకు దారితీసింది. మరి, ఈ మూడు ఘటనలు కులనిర్మూలన కోసం బాబాసాహెబ్ సంకల్పాన్ని తిరిగి అందుకొనేలా చేస్తాయా?

-యోగేంద్ర యాదవ్

Updated Date - Oct 17 , 2025 | 01:46 AM