Telangana Farmer Issues: కనీస మద్దతు ధరలో రైతులకు ద్రోహం
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:02 AM
రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఇటీవల కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP)ను గమనిస్తే రైతాంగాన్ని మోసం చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. 2025–26 ఖరీఫ్ సీజన్ కోసం రూ. 2.07 లక్షల కోట్ల ఎంఎస్పీ ప్యాకేజీని ఆమోదించడం ద్వారా రైతులకు ఎంతో ఉపశమనం కలిగించామని బీజేపీ ప్రభుత్వం భారీగా ప్రచారం చేసింది.
రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఇటీవల కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP)ను గమనిస్తే రైతాంగాన్ని మోసం చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. 2025–26 ఖరీఫ్ సీజన్ కోసం రూ. 2.07 లక్షల కోట్ల ఎంఎస్పీ ప్యాకేజీని ఆమోదించడం ద్వారా రైతులకు ఎంతో ఉపశమనం కలిగించామని బీజేపీ ప్రభుత్వం భారీగా ప్రచారం చేసింది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుపై కొత్త ఎంఎస్పీ కనీసం 50 శాతం లాభాన్ని నిర్ధారిస్తుందనే వాదనను కార్పొరేట్ మీడియా వెంటనే ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఎం.ఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని ‘జాతీయ రైతుల కమిషన్ 2006’ నివేదికలో రైతులకు వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి సమగ్ర సాగు వ్యయం (సి2) కంటే కనీసం 50 శాతం ఎక్కువ గిట్టుబాటు ధర ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. అయితే రెండు దశాబ్దాల తర్వాత కూడా ఈ సిఫారసులు అమలు కావడం లేదు. రైతులు పొందే ధరకు, ఎంఎస్పీకి మధ్య భారీగా వ్యత్యాసం ఉంది. సాగు ఖర్చు సర్వే ప్రకారం వరి రైతులు అందుకున్న సగటు ధర 2021–22లో ఎంఎస్పీ ఎ2+ఎఫ్ఎల్ (ప్రాథమిక ఖర్చు, కుటుంబ శ్రమ) కంటే 36శాతం తక్కువగా ఉంది. అదే ఏడాది తెలంగాణలో కంది పంటకు ఎంఎస్పీ 11 శాతం తక్కువగా ఉంది. వ్యవసాయ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఎంఎస్పీపై దాదాపు అన్ని పంటలకు, ముఖ్యంగా వరికి నిజమైన ఎంఎస్పీ వృద్ధిలో మందగమనాన్ని చూపిస్తోంది.
ఖరీఫ్ పంటల్లో వరిపై ప్రస్తుతం ఎంఎస్పీ క్వింటాలుకు కేవలం రూ. 69 పెరిగింది. సీఏసీపీ అంచనా వేసిన జాతీయ సగటు ధర ప్రకారం వరికి సి2+50శాతం ధర క్వింటాలుకు రూ.3,135, కానీ ప్రకటించిన ఎంఎస్పీ కేవలం రూ. 2,369. అంటే క్వింటాలుకు రూ. 766 నష్టం. తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఎంఎస్పీ ఇలాగే ఉంది. రాగులకు రూ. 596, పత్తికి రూ. 589, నువ్వులకు రూ. 579, నైజర్ సీడ్ ఎంఎస్పీని క్వింటాల్‌కు రూ. 820 పెంచినట్లు ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ ఈ పెరిగిన ధరలు కూడా సి2+50 శాతం స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దీని ద్వారా రైతులకు ఒరిగే ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ. జొన్న పంటకు ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీతో పోలిస్తే రైతుకు రూ.1,110 నష్టం. సజ్జలు, మొక్కజొన్నల ఎమ్మెస్పీ కూడా అలాగే ఉంది. సీఏసీపీ అంచనా వేసిన ఖర్చు కంటే వాస్తవ ఉత్పత్తి వ్యయం చాలా ఎక్కువ. నిత్యం పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయం రైతుల ఖర్చులను ఇంకా పెంచుతోంది. కానీ వారు తమ ఉత్పత్తులకు న్యాయమైన ధరను పొందడం లేదు. దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలకు ఇదే కారణం. రైతులను తప్పుదోవ పట్టించకుండా పంటలకు న్యాయమైన ధర కల్పించేందుకు బీజేపీ చిత్తశుద్ధితో సంకల్పించాలి.
– ఎమ్. శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి