Operation Sindhoor: సిందూర్ విజయాలు, పాలకుల వైఫల్యాలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:44 AM
పార్లమెంటు ఉభయ సభలలో గత వారం ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరిగింది. ఆ సైనిక చర్య లక్ష్యాలు నెరవేరాయని, తత్కారణంగా
పార్లమెంటు ఉభయ సభలలో గత వారం ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరిగింది. ఆ సైనిక చర్య లక్ష్యాలు నెరవేరాయని, తత్కారణంగా దాన్ని తుదకు (తాత్కాలికంగా) విరమించడం జరిగిందని, మన సైనిక కార్యకలాపాలు సాధారణమైన క్రమ పద్ధతికి వచ్చాయనే అభిప్రాయాన్ని ప్రభుత్వం కలిగించింది. పరిస్థితి నిజంగా అలా ఉన్నదా? లేదు. ప్రభుత్వం కలిగించిన అభిప్రాయం తప్పు. నిజమేమిటంటే మన సైన్యం ఒక కఠినమైన ఆట ఆడుతుండగా ప్రభుత్వం బలవంతంగా బంతిని లాక్కోవడం జరిగింది! మన సైనిక దళాల ధైర్య సాహసాలకు జేజేలు. ఆపరేషన్ సిందూర్ కొన్ని కట్టుకథలను బద్దలుగొట్టింది. అపోహలు, తప్పుడు నమ్మకాలను తొలగించింది. పాకిస్థాన్‌పై యుద్ధం, విజయ సాధన చాలా సులభం; సంప్రదాయ యుద్ధంలో భారత్ ఆధిక్యత చెక్కు చెదరకుండా కొనసాగుతుంది; భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా మిత్ర దేశాలు ఉన్నాయి, పాకిస్థాన్‌కు శ్రేయోభిలాషులు ఎవరూ లేరు మొదలైనవే ఆ కట్టుకథలు.
మన సైనిక దళాల నాయకత్వం విలక్షణరీతిలో వ్యవహరించింది. సైనిక చర్యలకు ఉదాహరణప్రాయంగా ఆపరేషన్ సిందూర్‌ను అవి నిర్వహించాయి. సైనిక కార్యాచరణ విషయంలో స్వేచ్ఛనివ్వాలని ప్రభుత్వాన్ని సైన్యం కోరింది. సైన్యం అభ్యర్థనను సర్కార్ అంగీకరించింది. సైనిక చర్యకు సంకల్పించింది, తొట్ట తొలుత రంగంలోకి దిగింది భారత సైన్యమే గనుక దానికి సహజంగానే ప్రారంభ సానుకూల ప్రయోజనాలు దక్కాయి: పాకిస్థాన్ భూభాగాలలోను, ఆక్రమిత కశ్మీర్‌లోను ఉన్న తొమ్మిది వేర్వేరు ఉగ్రవాద స్థావరాలపై కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో చేసిన దాడులు సంపూర్ణంగా విజయవంతమయ్యాయి. ఉగ్రవాద కార్యకలాపాల సదుపాయాలు, సాధనాలు సమస్తమూ ధ్వంసమైపోవడంతో పాటు పలువురు ఉగ్రవాదులు హతులయ్యారు. అయితే పాకిస్థాన్ సైనిక దళాలు త్వరితగతిన కోలుకున్నాయి. చైనాలో తయారైన యుద్ధ విమానాలు (జె–10), చైనా ఉత్పత్తి చేసిన మిస్సైల్స్ (పి–15), తుర్కియే సరఫరా చేసిన డ్రోన్‌లతో మే 7–8 రాత్రి, పాకిస్థాన్ ప్రతిదాడులు నిర్వహించింది.
తమ వ్యూహ సంబంధిత లోపాలు, లొసుగులను మన సైనిక దళాల నాయకత్వం వెన్వెంటనే గుర్తించి, కొత్త యుద్ధ తంత్రంతో పాకిస్థాన్‌ను ఎదుర్కొన్నది. అదీ సరైన, సమర్థ నాయకత్వం. పునః ప్రారంభమైన సైనిక చర్యలు మే 9, 10 తేదీల్లో పాకిస్థాన్‌లోని 11 సైనిక వైమానిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సహజంగానే భారత సైన్యానికి కొన్ని నష్టాలు వాటిల్లాయి. అత్యున్నతస్థాయి సైనికాధికారులు ఈ వాస్తవాన్ని అంగీకరించారు. ఇది, సమర్థ నాయకత్వానికి మరొక ఉదాహరణ. మరి మన రాజకీయ నాయకత్వం కూడా సైనిక నాయకత్వం మాదిరిగా వ్యవహరించిందా? లేదు. తన తప్పులను అంగీకరించలేదు. నష్టాలు వాటిల్లినట్టు ఒప్పుకోలేదు (తలను ఇసుకలో దూర్చి తననెవరూ చూడటం లేదని భావించే) ఉష్ట్రపక్షిలా మన రాజకీయ నాయకత్వం వ్యవహరించింది. ఆపరేషన్ సిందూర్‌లో ఒక ‘నిర్ణయాత్మక విజయం’ సమకూరిందని పదే పదే ప్రకటించింది. నిజమేనా? నిర్ణయాత్మక విజయం సమకూరి ఉన్నట్టయితే తనకు సానుకూలంగా ఉన్న పరిస్థితులను మరిన్ని సైనిక విజయాల సాధనకు ఎందుకు ఉపయోగించుకోలేదు? పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి రాజకీయ రాయితీలను డిమాండ్ చేసి ఎందుకు పొందలేదు? పాకిస్థాన్ డీజీఎమ్‌ఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) ఫోన్ చేసీ చేయగానే ఎందుకు సానుకూలంగా ప్రతిస్పందించారు? కాల్పుల విరమణకు షరతులు ఎందుకు విధించలేదు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు లేవు (యుద్ధంలో ఒక నిర్ణయాత్మక విజయానికి తిరుగులేని ఉదాహరణ డిసెంబర్ 16, 1971న పాకిస్థాన్ సైనికాధికారి జనరల్ నియాజీ భారత సైనికాధికారి జనరల్ అరోరాకు లొంగిపోవడం).
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా నెలకొన్న ఒక వాస్తవాన్ని మన రాజకీయ నాయకత్వం అంగీకరించలేదు: పాకిస్థాన్, చైనాలు తమ సైనిక, రాజకీయ సంబంధాలను మరింతగా పటిష్ఠం చేసుకున్నాయి. పాకిస్థాన్‌కు కొత్త తరం యుద్ధ విమానాలు, మిస్సైల్స్‌ను చైనా సరఫరా చేస్తోంది. తాము ఉత్పత్తి చేసిన సైనిక సామగ్రి మన్నికను ఆపరేషన్ సిందూర్ సందర్భంగా చైనా పరీక్షించుకున్నది. బీజింగ్–ఇస్లామాబాద్ సైనిక బంధం ఆపరేషన్ సిందూర్‌లో స్పష్టంగా కనిపించింది. రాజకీయ రంగంలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి ‘ఉగ్రవాదంపై పాకిస్థాన్ నిశ్చయాత్మక చర్య’ను ప్రశంసించారు. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసేందుకు చైనా సంపూర్ణ మద్దతునిచ్చింది.
అమెరికాతో పాకిస్థాన్ (కనీసం పాకిస్థాన్ సైన్యం) బంధం మరింతగా దృఢతరమవడం మరొక వాస్తవం. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌ను అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో విందుకు ఆహ్వానించారు. దేశ సార్వభౌమాధినేత లేదా ప్రభుత్వాధినేత కాని వ్యక్తులకు మున్నెన్నడూ ఇటువంటి గౌరవం లభించలేదు. ‘యుద్ధాన్ని కొనసాగించకుండా, ముగించినందుకు జనరల్ మునీర్‌కు ట్రంప్ కృతజ్ఞతలు చెప్పారు. తన విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్‌లు అంగీకరించాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే నివారించానని ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. ఆపరేషన్ సిందూర్ విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలను ప్రధానమంత్రి, హోం మంత్రి ఘాటుగా విమర్శించారే గానీ అమెరికా, చైనా అధ్యక్షులు, వారి విదేశాంగ మంత్రుల ప్రకటనలను ఖండించే సాహసం చేయలేకపోయారు. ప్రతిపక్షాల విమర్శలు నిరాధారమైనవని ఎందుకు నిరూపించలేకపోయారు? అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిక్యతకు పోటీపడుతున్న అమెరికా, చైనాలు పాకిస్థాన్‌ను సైనికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకోవడంలో ఒకే విధంగా వ్యవహరించాయన్నది మరొక విస్మరించలేని వాస్తవం. ఈ రెండు దేశాలు తమ విభేదాలు విస్మరించి పాకిస్థాన్‌కు మద్దతునిచ్చేందుకు, ప్రోత్సహించేందుకు అంగీకరించాయి. మరింత ఘోరమైన విషయమేమిటంటే పహల్గాం దాడిలో పాకిస్థాన్ ప్రమేయాన్ని చాటి చెప్పేందుకు ప్రపంచ దేశాలకు భారత ప్రభుత్వం పంపిన దౌత్య ప్రతినిధుల బృందాలు తమ లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించలేక పోయాయి. ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని, భారత్‌కు సానుభూతిని వ్యక్తం చేశాయేగానీ ఆ దుర్మార్గానికి పాకిస్థాన్‌దే బాధ్యత అని ఏ ఒక్క దేశమూ ఖండించనేలేదు. ఈ వాస్తవాలను అంగీకరించేందుకు భారతదేశ రాజకీయ నాయకత్వం తిరస్కరిస్తోంది. పాకిస్థాన్‌కు మిత్ర దేశాలు లేవని, భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మిత్రులు ఉన్నారనే భ్రమలోనే ఇప్పటికీ ఉన్నది! జమ్మూ–కశ్మీర్‌లో ఉగ్ర ఆవరణం (టెర్రర్ ఎకోసిస్టమ్ – ఉగ్రవాద ఆవిర్భావం, వ్యాప్తి, నిలకడకు దోహదం చేసే పరస్పర అనుసంధానిత కారకాల సంక్లిష్ట వ్యవస్థ) ధ్వంసమై పోయిందనే భ్రమలో కూడా దేశ రాజకీయ నాయకత్వం ఉన్నది. సత్యం భిన్నంగా ఉన్నది, సందేహం లేదు. పహల్గాం ఉగ్రదాడి (ఏప్రిల్ 22, 2025) సంభవించిన రెండు రోజుల అనంతరం (ఏప్రిల్ 24) ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో హోం మంత్రిత్వ శాఖ ఈ క్రింది వివరాలు వెల్లడించింది: జూన్ 2014– మే 2024 మధ్య కశ్మీర్‌లో 1643 ఉగ్రవాద సంఘటనలు, 1925 చొరబాటు ప్రయత్నాలు, 726 సఫల చొరబాట్లు సంభవించాయి; 576 మంది భద్రతా సిబ్బంది హతమయ్యారు. అటల్ బిహారీ వాజపేయి (1998–2004), మన్మోహన్‌సింగ్ (2004–2014) ప్రధాన మంత్రిత్వాల కాలంలో కూడా ఉగ్రవాద దాడులు సంభవించాయి, హతులు, క్షతగాత్రులు గణనీయంగా ఉన్నారు.
ఉగ్ర ఆవరణంలో ఉన్నదెవరు? పాకిస్థాన్ నుంచి భారత భూభాగాల్లోకి చొరబడినవారు, భారత్‌లో, ముఖ్యంగా కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నవారు. ఈ రెండు వర్గాలవారు తరచు కలిసికట్టుగా పనిచేస్తున్నారు, కలిసికట్టుగా ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నారు, పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. ఏప్రిల్ 26, 2025న ప్రభుత్వం కశ్మీర్ లోయలో పలు గృహాలను కూల్చి వేసింది. ‘పహల్గాం ఊచకోతతో సంబంధమున్న ఉగ్రవాదులు’ అని అనుమానించిన వారి గృహాలను కూల్చివేసినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కూల్చివేతకు గురైన గృహాల యజమానులు భారతదేశానికి చెందిన ఉగ్రవాదులే. జూన్ 2025లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారికి ఆశ్రయమిచ్చినందుకు ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసింది. జూలై 27–28న ఉగ్రవాదులు అని శంకిస్తున్న వ్యక్తులను నిరాయుధులను చేసి, వారు చొరబాటుదారులు అని గుర్తించారు. భారతదేశానికి చెందిన ఉగ్రవాదులు గతంలో ఉగ్రవాద హింసాకాండకు పాల్పడ్డారు. 2006లో ముంబై సబర్బన్ రైలులో బాంబు పేలుళ్లు, 2008లో తాజ్‌మహల్ హోటల్‌పై దాడి, 2011లో జావేరీ బజార్ ఘటన సదరు ఉగ్రవాద హింసాకాండకు ఉదాహరణలు. 2006 ఉగ్రవాద దుర్మార్గానికి పాల్పడింది భారత్‌కు చెందిన ఉగ్రవాదులే. 2008 ఘటనకు పాల్పడినవారు కసబ్‌తో సహా పది మంది పాకిస్థానీ చొరబాటుదారులు. 2011 ఘటన భారత్‌కు చెందిన ఉగ్రవాదుల క్రూర కృత్యమే. భారత్‌లో ఉగ్ర ఆవరణాన్ని (టెర్రర్ ఎకోసిస్టమ్) నిర్మూలించినట్టు ప్రభుత్వం చేస్తున్న వాదన నిస్సందేహంగా తప్పు. ప్రభుత్వ వాదన నిజమే అయితే పహల్గాం దాడి ఎలా సంభవించింది? గూఢచార వర్గాల వైఫల్యం, పహల్గాంలో భద్రతా దళాలు లేకపోవడం వల్లే ఏప్రిల్ 22న ఆసేతు హిమాచలం ప్రతి ఒక్కరినీ కలచివేసిన బీభత్స విషాదం చోటుచేసుకున్నది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఏ ఒక్కరూ ఆ అమానుష హింసాకాండకు బాధ్యత తీసుకోలేదు. ఇది గర్హనీయం కాదా? పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సాధించిన విజయాలు దుస్సాహసాలకు పాల్పడకుండా పాకిస్థాన్‌ను నిరోధించవచ్చు. అయితే మన ప్రత్యర్థి దేశానికి అమెరికా, చైనాల కుటిల మద్దతును ఎండగట్టడంలో భారత్ రాజకీయ నాయకత్వం పిరికితనం ప్రదర్శించింది. దీనివల్ల మన సైనిక విజయాలు వ్యర్థమైపోయి పాకిస్థాన్ మరోసారి మనపై కాలుదువ్వేందుకు సాహసించవచ్చు.
-పి. చిదంబరం (వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)