Unemployment in India: యువతకు ఉద్యోగాలు ఎందుకు లేవు
ABN , Publish Date - May 24 , 2025 | 05:45 AM
భారతదేశ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం రుణాల లోటు, నైపుణ్యాల కొరత, యువత ఆసక్తి లేకపోవడం వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. ఉద్యోగావకాశాలు ఉన్నా, అవసరమైన విద్యార్హతలు లేకపోవడం నిరుద్యోగితకు ప్రధాన కారణంగా మారింది.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ – ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగంపై ఇటీవల రెండు నివేదికలు విడుదలయ్యాయి. ఒకటి ‘స్మాల్ ఇండస్ట్రీస్ డెవెలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం కాగా మరొకటి నీతిఆయోగ్ రూపొందించినది. రెండూ అధికారిక నివేదికలే. ఇవేకాక మరొకటి– ‘యాన్యువల్ సర్వే ఆఫ్ అన్‌ఇన్‌కార్పొరేటెడ్ సెక్టోర్ ఎంటర్‌ప్రైజెస్’ నివేదిక కూడా ఉన్నది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల గురించి ఈ రెండు అధికారిక నివేదికలు వెల్లడించిన ప్రాథమిక వాస్తవాలు ఏమిటి? ప్రస్తుత వర్గీకరణ ప్రకారం సూక్ష్మ పరిశ్రమలలో పెట్టుబడుల గరిష్ఠ పరిమితి రూ.2.5 కోట్లు కాగా అవి చేసే మొత్తం వ్యాపారం గరిష్ఠంగా రూ.10 కోట్ల మేరకు ఉంటుంది; చిన్న తరహా పరిశ్రమలలో మదుపుల గరిష్ఠ పరిమితి రూ.25 కోట్లు కాగా, వాటి మొత్తం వ్యాపారం గరిష్ఠంగా రూ.100 కోట్లు దాకా ఉంటుంది; మధ్యతరహా పరిశ్రమలలో పెట్టుబడుల గరిష్ఠ పరిమితి రూ. 125 కోట్లు కాగా, వాటి గరిష్ఠ వ్యాపారం రూ.500కోట్లు దాకా ఉంటుంది. ఈ వర్గీకరణ ప్రకారం భారతదేశంలో పరిశ్రమలు అత్యధికం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలేనని స్పష్టమవుతుంది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో సూక్ష్మ పరిశ్రమలే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో సూక్ష్మ పరిశ్రమలు 98.64 శాతం కాగా, చిన్నతరహా పరిశ్రమలు 1.24 శాతంగా ఉంటే, మధ్యతరహా పరిశ్రమలు కేవలం 0.12 శాతం మాత్రమే. యాజమాన్యం విషయానికి వస్తే ఒక వ్యక్తి లేదా కుటుంబ యాజమాన్యంలో ఉన్నవి 59 శాతం కాగా భాగస్వామ్య కంపెనీలు 16 శాతం మేరకు ఉన్నాయి. ఎల్‌ఎల్‌పి 1 శాతం కాగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు 23 శాతం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు 1 శాతం మేరకు ఉన్నాయి.
యావద్భారతదేశంలో ఇంచుమించు 7,34,00,000 ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఉన్నాయి. మార్చి 2025 నాటికి ఉద్యామ్ పోర్టల్‌లో నమోదయి ఉన్న కంపెనీలు 6,20,00,000. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల రంగంలో పరపతి లోటు (అవసరమైన ఆర్థిక వనరులు, వాస్తవంగా అందుతున్న రుణ సదుపాయం మధ్య వ్యత్యాసం) 24 శాతం (రూ. 30లక్షల కోట్లు) కాగా, సర్వీసెస్ సబ్ సెక్టార్‌లో ఈ లోటు 27 శాతం కాగా మహిళల యాజమాన్యంలో ఉన్న కంపెనీలకు పరపతి లోటు 35 శాతం మేరకు ఉన్నది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సరుకుల ఎగుమతులలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వాటా 45 శాతం. 2024–25లో తమ ఉత్పత్తులను ఎగుమతి చేసిన కంపెనీలు 1,73,350 మాత్రమే. (మొత్తం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో ఇవి కేవలం 1 శాతం మాత్రమే) ఇవి ఎగుమతి చేస్తున్న ప్రధాన సరుకులు రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలు, చర్మ ఉత్పత్తులు, చేతి వృత్తుల ఉత్పత్తులు, ప్రాసెస్‌డ్ ఆహారాలు, ఆటోమోబైల్స్ విడిభాగాలు. వీటిలో ఒకటి మినహా మిగతావన్నీ ఉత్పత్తికి ఖరీదైన సాంకేతికతలు అవసరం లేని సామాన్య వస్తువులే. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పురోగతికి రుణ సదుపాయ పథకాలు, అభివృద్ధి సహాయ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రస్తావిత అధికారిక నివేదికలను బట్టి కనీసం రెండు సబ్సిడీ పథకాలు, నాలుగు క్రెడిట్ గ్యారంటీ పథకాలు, కనీసం 13 అభివృద్ధి సహాయ పథకాలు ఉన్నట్టు నాకు అర్థమయింది. 2025–26 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన వారికి ఒక సబ్సిడీ పథకాన్ని, ఒక క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రకటించింది. అంతేకాకుండా ఒక కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఒక డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, వీథుల్లో బళ్లపై వివిధ సరుకులు పెట్టుకుని అమ్ముకునే వారికి ఒక నిధి (పీఎమ్ స్వనిధి)ని ప్రకటించింది. ఉద్యోగాల సృష్టికి ప్రధాన ఆధారం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలే. ఈ రంగం మొత్తం 26 కోట్ల మందికి ఉద్యోగ సదుపాయాన్ని కల్పిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇప్పుడు ఒక ప్రధాన ప్రశ్నను తరచి చూద్దాం. ప్రస్తావిత అధికారిక నివేదికల ప్రకారం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు: నిపుణ కార్మికుల కొరత, నైపుణ్యాల లోటు, ప్రతిభావంతులను ఆకట్టుకోవడంలో కష్టసాధ్యాలు. ఈ నివేదికలు వెల్లడించిన వాస్తవాలు మన దేశంలో నిరుద్యోగిత సంపూర్ణ కథను విశదం చేస్తున్నాయి. రూ.125 కోట్ల గరిష్ఠ పెట్టుబడులతో మొత్తం రూ.500 కోట్ల వ్యాపారం చేస్తున్న పెద్ద పరిశ్రమలు ఉన్నత విద్యార్హతలు, మెరుగైన నైపుణ్యాలు ఉన్నవారిని కార్మికులుగా, ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. నిరుద్యోగులుగా ఉన్నవారిలో అత్యధికులకు అటువంటి విద్యార్హతలు, నైఫుణ్యాలు కొరవడడం ఒక వాస్తవం. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు కార్మికుల అవసరం చాలా ఉంది.
అయితే ఈ పరిశ్రమలు కూడా కార్మికుల కొరత నెదుర్కొంటున్నాయి, ప్రతిభావంతులను ఆకర్షించలేకపోతున్నాయి. ఎందుకని? మొదటి కారణం– ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నవారికి సంబంధిత ఉద్యోగాలకు అవరమైన విద్యార్హతలు, నైపుణ్యాలు ఉండడం లేదు; రెండో కారణం– ఈ పరిశ్రమలు సమకూరుస్తున్న ఉద్యోగాలలో చేరేందుకు యువజనులు ఆసక్తి చూపడం లేదు. అవి ఇవ్వజూపుతున్న వేతన భత్యాలు సంతృప్తికరంగా లేకపోవడం వల్లే ఆ ఉద్యోగాల పట్ల యువత విముఖత చూపుతోంది. పైగా ఈ పరిశ్రమలు నిర్వహిస్తున్న కంపెనీలలో చేరడమనేది సమాజంలో ప్రతిష్ఠాకరం కాకపోవడం కూడా ఆ విముఖతకు కారణమవుతోంది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వ్యవస్థాగత వాస్తవాలు, ఉద్యోగిత పరిణామాలను బట్టి యువ భారతీయులలో నిరుద్యోగిత అధికంగా ఎందుకు ఉన్నదో తెలుసుకోవడం కష్టమేమీ కాదు. ఏప్రిల్ 2025లో భారత జనాభా 146 కోట్లు. కార్మిక శక్తి భాగస్వామ్యం (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ – ఎల్‌ఎఫ్‌పిఆర్) అంటే ఉద్యోగాలలో ఉన్నవారు, ఉద్యోగం కోసం క్రియాశీలంగా ప్రయత్నిస్తున్నవారు వెరసి మొత్తం ప్రజలు 81 కోట్లు (55.6 శాతం). ఉపాధి పొందుతున్న జనాభా నిష్పత్తి (వర్కర్ పాపులేషన్ రేషియో –డబ్ల్యుపిఆర్) 52.8 శాతం (77 కోట్లు). ఈ రెండు గణాంకాల మధ్య వ్యత్యాసం (4 కోట్లు) నిరుద్యోగుల సంఖ్యను వెల్లడిస్తుంది. వీరంతా నిరుద్యోగులు. నిరుద్యోగుల సంఖ్య చాలా హెచ్చుగా ఉన్నది, సందేహం లేదు. అయితే ఈ నిరుద్యోగులు అదరూ ‘ఉద్యోగానికి క్రియాశీలంగా ప్రయత్నిస్తున్న జనాభా’లోని వారేనన్న విషయాన్ని విస్మరించకూడదు. వివిధ కారణాలతో ఉద్యోగ ప్రయత్నాలను విరమించిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారనేది కూడా మరువకూడదు. 81 కోట్ల శ్రామిక జనావళిలో నిరుద్యోగులు 4 కోట్ల మంది అంటే నిరుద్యోగిత 5.0 శాతం. ఇది అధికారిక గణాంకం. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో అత్యధికం (98.64 శాతం) సూక్ష్మ పరిశ్రమలే. యాజమాన్యం, భాగస్వామ్యం మొత్తం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో 75 శాతం మేరకు ఉన్నదనే వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ రంగం కంపెనీలలో ఉద్యోగులు లేదా కార్మికులుగా ఉన్న 26 కోట్ల మందిలో చాలా మంది కుటుంబ సభ్యులు లేదా యాజమానుల బంధువులే అయివుంటారన్నది స్పష్టం. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల (మొత్తం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో 1.36 శాతం లేదా ఇంచుమించు 10,00,000)లో మాత్రమే కుటుంబ, బంధుత్వాల వెలుపలి వారిని నియోగించుకోవడం జరుగుతోంది. దీన్నిబట్టి యజమాని– సేవకుడు సంబంధం ఉన్నది చిన్న, మధ్యతరహా పరిశ్రమలలోనే అని విశదమవుతుంది. పది లక్షల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు తమ వ్యాపారాలను పెంపొందించుకుంటూ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. పాఠశాల విద్యను మధ్యలోనే ఆపివేసినవారు లేదా పాఠశాల విద్యార్హతలు మాత్రమే ఉన్నవారు లేదా ఒక ప్రాథమిక ఆర్ట్స్ లేదా సైన్స్ డిగ్రీ ఉన్న వారి నుంచి ఉద్యోగాలకు డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. మరి వీరికి ఉద్యోగ సదుపాయం కల్పించగల చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమానులు రుణ సదుపాయంలోటు, పరిశ్రమల నిర్వహణకు సంబంధించిన కఠిన నిబంధనలతో నానా సమస్యల నెదుర్కొంటున్నారు. ఉద్యోగాలను కోరుకుంటున్నవారికి సరైన విద్యార్హతలు, నైపుణ్యాలు ఉండడం లేదు. వృత్తిపరమైన శిక్షణ లేకపోవడం వారి ఉద్యోగావకాశాలకు అవరోధంగా ఉన్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఉద్యోగాభిలాషులలో ‘ప్రతిభా లోపం’ సమృద్ధిగా ఉన్నది. ఈ లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఏమి చెయ్యాలి? తొలుత నైపుణ్యాల శిక్షణతో కూడిన పాఠశాల విద్యను సమకూర్చాలి. ఆ తరువాత సూక్ష్మపరిశ్రమలను వదిలివేసి చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యవస్థాపకులకు ఉదారంగా స్వల్ప వడ్డీతో కూడిన పరపతి సదుపాయాన్ని సమకూర్చాలి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)