Government Schools: గణితానికి సమయమేదీ
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:43 AM
పాఠశాల విద్యలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సబ్జెక్టులు గణితం, ఆంగ్లం. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు రాణించాలంటే..
పాఠశాల విద్యలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సబ్జెక్టులు గణితం, ఆంగ్లం. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు రాణించాలంటే వారికి ఈ సబ్జెక్టులపై అవగాహన తప్పనిసరి. కానీ ఉన్నత పాఠశాలల్లో గణితానికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. విద్యార్థులకు ఈ సబ్జెక్టుపై పూర్తి అవగాహన కల్గించాలన్నా, సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలన్నా గణిత ఉపాధ్యాయునికి అదనపు పీరియడ్స్ అవసరం. కానీ విద్యాశాఖ తగిన స్థాయిలో గణితానికి పీరియడ్స్ కేటాయించడం లేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణితానికి ఎక్కువ పీరియడ్స్ కేటాయించిన పాఠశాలల్లో విద్యార్థులు లెక్కల్లో గణనీయమైన ప్రగతి సాధించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
విద్యా క్యాలెండర్ ప్రకారం.. ఉన్నత పాఠశాలల్లో (వారానికి) ప్రథమ భాషకు–6, ద్వితీయ భాషకు–4, తృతీయ భాషకు–6, గణితం–8, సామాన్య శాస్ర్తం–6, భౌతిక శాస్ర్తం–5, జీవశాస్ర్తం–4, సాంఘిక శాస్ర్తం–6 ఇలా ‘సబ్జెక్టుల ప్రాధాన్యాన్ని బట్టి’ పీరియడ్స్‌ను కేటాయించాలి. కానీ అలా జరగడం లేదు. అన్ని సబ్జెక్టులకూ వారానికి 6 పీరియడ్స్‌ను కేటాయిస్తున్నారు. దీంతో గణితశాస్ర్త ఉపాధ్యాయులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సమయాభావం వల్ల విద్యార్థులకు గణితం పట్ల సరైన అవగాహన కలిగించలేకపోతున్నామన్న బాధతో పాటు, సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయలేకపోతుండడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో గణితంలో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులను చూసినా గణితంలో అవి తక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. మరో విషయమేమంటే.. 6 నుంచి 10 తరగతుల వరకూ గణితశాస్ర్త ఉపాధ్యాయుడే గణితాన్ని బోధించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 6, 7 తరగతులకు భౌతికశాస్ర్త ఉపాధ్యాయుడు గణితాన్ని బోధించడంలో సహకారం అందించాలి. కేవలం 8, 9, 10 తరగతులకు మాత్రమే గణితశాస్ర్త ఉపాధ్యాయుడు గణితాన్ని బోధించాలి. కానీ అలా జరగడం లేదు. విద్యార్థులకు సహపాఠ్య కార్యక్రమాలైన ఆరోగ్య, వ్యాయామ విద్య, కంప్యూటర్ విద్య వంటి వాటికి తగు స్థాయిలో ఉపాధ్యాయులు ఉండడం లేదు. వాటికి సంబంధించిన పుస్తకాలూ విద్యార్థులకు అందుబాటులో లేవు. బోధించని సహపాఠ్య కార్యక్రమాలకుగానూ 1–10 తరగతులకు మార్కులు కేటాయించడం, వాటికి అధికారులు ఆమోదం తెలపడం ప్రతి ఏడాదీ జరిగిపోతున్న ప్రక్రియ! ఇప్పటికైనా విద్యాశాఖ, ప్రభుత్వం స్పందించి గణితశాస్ర్తానికి ఎక్కువ పీరియడ్స్‌ను కేటాయించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అవసరమైన ఈ సబ్జెక్టుపై దృష్టి పెట్టాలి.
– కాంచనపల్లి విజయ్‌కుమార్,
తెలంగాణ గణిత ఫోరం