Marwaris Business Dominance: వ్యాపారంలో తనామనా తకరారు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:36 AM
ఆర్థిక పరిస్థితుల్లో తేడాలొస్తే ఆలోచనలు తలకిందులు అవుతాయి. ఆందోళనలు పుడతాయి. కొత్త వాదాలు వస్తాయి. బలబలాల ప్రదర్శనలు మొదలవుతాయి....
ఆర్థిక పరిస్థితుల్లో తేడాలొస్తే ఆలోచనలు తలకిందులు అవుతాయి. ఆందోళనలు పుడతాయి. కొత్త వాదాలు వస్తాయి. బలబలాల ప్రదర్శనలు మొదలవుతాయి. చరిత్ర అంతా ఇదే జరిగింది. దాన్ని ఈ కోణం నుంచి చూస్తే వైవిధ్యభరిత జీవితం కనపడుతుంది. రాజవంశాలతో విసుగుపుట్టించే చరిత్ర పోయి సాధారణ ప్రజల ప్రయాణంలో వెలుగుచీకట్లు వెల్లడవుతాయి. వివిధవర్గాల సంఘర్షణలు, సమైక్యతలపై సమగ్రచిత్రం అందుతుంది. తెలంగాణలో మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై తలెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో చరిత్రను తడిమితే ఎన్నో ఆసక్తికరమైన అంశాలూ బయటపడతాయి. వ్యాపారాల్లో మార్వాడీల ఆధిపత్యం నిన్నమొన్నటిది కాదు. దీని వెనుక 250 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నిజానికి మార్వాడీ పేరుతో ఒక కులం లేదు. ఒక తెగ లేదు. రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతం నుంచి వ్యాపారాల కోసం తరలి వచ్చిన వాళ్లందరినీ మార్వాడీలు అనటం ఒక నానుడిగా మారిపోయింది. మార్వార్ నుంచే గాక రాజస్థాన్‌లోని ఇతర చోట్ల నుంచి వచ్చిన వాళ్లని కూడా అదే పేరుతో పిలవటం మొదలైంది. మార్వాడీలుగా మనందరం పిలిచే వాళ్లందరూ ఎక్కువగా వైశ్యవర్గంలోని వివిధ కులాలకు చెందినవారే. ఆ వర్గంలో 30కి పైగా కులాలు ఉన్నాయి. అందులో ఆరు ప్రధాన కులాలను సూచించే పేర్లు ఏదో విధంగా మనకు నిత్యం తారసపడుతూనే ఉంటాయి. అగర్వాల్, మహేశ్వరి, ఓస్వాల్, పోర్‌వాల్, ఖండేల్‌వాల్, శ్రీమాలి అనే వాటిని ఆ ఆరు కులాలుగా చరిత్రకారులు చెబుతారు. ఈ కులాలకు చెందినవారే ఇప్పటికీ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బిర్లా, గోయంకా, సింఘానియా, బజాజ్, ఖేతాన్, మిత్తల్, గోయల్, ముంద్రా, జలాన్, పొద్దార్, ఝున్‌ఝున్‌వాలా, కనోరియా ఇంటిపేర్లున్న వారందరూ అగర్వాల్ కులానికి చెందినవారు. దాల్మియా, కొటారి, తపాడియా, పారీఖ్, బంగూర్, ధూత్, కేడియా, రాటీ, చింట్లాంగియా ఇంటిపేర్లు మహేశ్వరీ కులంలో కనపడతాయి. ఇక కులం పేరు అయిన మహేశ్వరీ చాలా మందికి ఇంటిపేరు గానూ ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 30కి పైగా వెంచర్లు ఉన్న మహేశ్వరీ గ్రూప్ మార్వాడీలకు చెందిందే. డి–మార్ట్ కూడా మహేశ్వరీలకు చెందిన మార్వాడీలదే. లోధా, భన్సాలీ, జవేరీ, భండారీ, కొటారీ, దుగ్గర్, సురానా లాంటి ఇంటిపేర్లు ఓస్వాల్ కులంలో ప్రధానమైనవి. దోషి, పరేఖ్, మెహతా, కాసిల్‌వాల్, బొహ్ర, శాంక్ల అనే ఇంటిపేర్లు పోర్‌వాల్ కులంలో కనపడతాయి. బన్సాల్, సింఘాల్, ఖండేల్‌వాల్, కన్సాల్, శ్రీమాల్ బైడ్, భుటాడ మొదలైన ఇంటిపేర్లు మిగతా రెండు ప్రధాన కులాల్లో ఉంటాయి. మార్వాడీల్లో 30 నుంచి 35 శాతం వరకూ జైనమతాన్ని, మిగతావారు హిందూ మతాన్ని అనుసరిస్తారు. మార్వార్ ప్రాంతాన్ని అసలు మరుదేశం అని పిలిచేవారు. మరు అంటే ఎడారి ప్రాంతం. థార్ ఎడారిలో భాగంగానే మార్వార్‌ను చూసేవారు.
1948కి ముందు మూడు భాషా ప్రాంతాల్లో విస్తరించిన నిజాం సంస్థానంలోని కులాలు, జాతుల గురించి ఆసక్తికరమైన విషయాలను అందించిన వారిలో సయద్ సిరజ్ ఉల్ హస్సన్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 1920 నాటికే నిజాం సంస్థానంలో పాతుకుపోయిన మార్వాడీల గురించి ఆయన చాలా సమాచారాన్ని ఇచ్చారు. హైదరాబాద్‌తో పాటు ఔరంగాబాద్, జాల్నా, పర్భణీ, నాందేడ్, గుల్బర్గా నగరాలతో పాటు వాణిజ్య వ్యవహారాలు సాగే అన్నిచోట్లకు మార్వాడీలు విస్తరించారనీ తెలిపారు. వడ్డీ, ధాన్యం, బట్టల వ్యాపారులుగా, బ్యాంకర్లుగా, మిల్లులు, దుకాణాల యజమానులుగా, డీలర్లుగా స్థిరపడినప్పటికీ జీవిత చరమాంకంలో మార్వార్‌కు వెళ్లేవారూ ఉండేవారు. అగర్వాల్, మహేశ్వరీ, ఓస్వాల్, పోర్‌వాల్ కులాలతో పాటు జైనమతాన్ని అనుసరించే శ్రావక మార్వాడీల ఆచార వ్యవహారాల గురించి కూడా హస్సన్ వివరించారు. మరో నాలుగు మార్వాడీ కులాలు కూడా నిజాం సంస్థానంలో ఆనాడు ఉండేవి. వివాహాల్లో కులపట్టింపులను అందరూ పాటించేవారు. ఒకే కులంలో జైన, హిందూ సంప్రదాయాలను అనుసరించే వారి మధ్య వివాహాలు జరిగేవి. భర్త మతాన్ని బట్టి భార్యల మతం మారిపోయేది. నిజాం పాలన (1724) ఆరంభమైన నాటి నుంచి మార్వాడీల ప్రాబల్యం పెరిగినా అంతకుముందు మొగల్ కాలంలో కూడా కొందరు ఉండేవారు. బుర్హాన్‌పూర్, ఔరంగాబాద్‌ల నుంచి క్రమేపీ నిజాం సంస్థానంలోకి వచ్చి 1800ల నాటికి హైదరాబాద్‌లో పట్టు సంపాదించారు.
బేగంబజార్, రికాబ్‌గంజ్, శాలిబండ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేవారు. నవాబులు, జాగీరుదార్ల కుటుంబాలు నగదు అవసరాలకు వీళ్ల మీద ఆధారపడేవి. హోల్‌సేల్ వ్యాపారంలో మార్వాడీలకే గుత్తాధిపత్యం ఉండేది. వస్త్ర, కిరాణా, ఇనుము, హార్డ్‌వేర్, నగల పరిశ్రమల్లోనూ వారిదే పైచేయి. సీతారామ్‌బాగ్ ఆలయాన్ని నిర్మించిన గనేరీవాలా కుటుంబం నిజాంకు బ్యాంకరుగానూ వ్యవహరించేది. కొంచెం అటూఇటుగా 300 ఏళ్ల నుంచి మార్వాడీలు తెలంగాణ ప్రాంతం వ్యాపారాల్లో కీలకపాత్రను పోషిస్తూనే ఉన్నారు. నగర పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా వడ్డీ, ధాన్యం వ్యాపారాల్లో పట్టు సంపాదించారు. పర్భణీ చుట్టుపక్కల రైతులు మార్వాడీల అధిక వడ్డీలకు వ్యతిరేకంగా 1906లో పెద్దఎత్తున ఆందోళన చేశారు. హైదరాబాద్‌కు 1980ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలూ, వ్యాపారులూ రావటం ఎక్కువైనా రిటైల్ రంగంలో మార్వాడీల పాత్ర క్షీణించలేదు. 1990ల తర్వాత అదింకా పెరిగింది. హార్డ్‌వేర్, కిరాణ, ఎలక్ట్రికల్, ప్లమింగ్, నగలు, వజ్రాల వ్యాపారంలో మార్వాడీల విస్తరణ ఎక్కువగానే కనపడుతుంది. వీరితో పోటీకి నిలబడలేని పరిస్థితి స్థానిక కిరాణా వ్యాపారులకు వచ్చింది. ఇటీవల ఆందోళనలకు అదే కారణం. వ్యాపార పోటీలో కొందరు పతనం అవ్వటం, నష్టపోవటం సాధారణమైనా దానికి అన్ని సందర్భాల్లోనూ సమాధానపడటం ఉండదు. ప్రాంతీయ భావనలు ప్రబలంగా ఉన్నచోట అధికార బలంతో పోటీని కట్టడిచేయాలనే డిమాండ్లు రావటం సహజం. ప్రాంతీయ, కులశక్తులు కొన్ని సందర్భాల్లో పోటీని ఎదుర్కొంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోటీని నిలువరించటానికి ప్రయత్నిస్తాయి. అస్తిత్వ పోరాటాలకూ ఆరాటాలకూ వెనుక ప్రధానంగా ఉండేది ఈ ఆర్థిక అంశాలే. వాటిని కప్పిపుచ్చటానికి ఎన్ని ఇంద్రజాలాలు చేసినా అసలు విషయాలు ఆర్థికాలే. అవి కూడా కొన్ని వర్గాలకే పరిమితం.
ఎడారి ప్రాంతమైన మార్వార్ నుంచే ఎక్కువ మంది వ్యాపారులు ఎందుకు వచ్చారని ప్రశ్నించుకుంటే లభించే సమాధానం ఆసక్తిగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో పరిస్థితుల ప్రభావంతో ఏదో ఒకరంగాన్ని ఎంచుకున్న ఒక తరం వాళ్ళు.. దాన్ని తరాలపాటు కొనసాగేలా తదుపరి తరాలకు కొన్ని అలవాట్లు, పద్ధతులను ఒక సంస్కృతిగా మార్చి ఉగ్గుపాలలా అందించగలగటం చాలా అరుదనే చెప్పాలి. యూరపులో యూదులు అది చేశారు. అందుకే వాణిజ్య, బ్యాంకింగ్ రంగాల్లో అక్కడ ఆ పట్టును సాధించారు. ఎంతటి సమాచారాన్నైనా, ఎంతటి చిక్కు పరిస్థితులనైనా సరళీకరించి అర్థంచేసుకుని, తదనుగుణంగా వ్యవహరించి తమ ప్రయోజనాలను కాపాడుకోవటంలో యూదులు అగ్రగాములుగా ఉండేవారు. పలుదేశాల ఆర్థికరంగంలో కీలకపాత్ర పోషించినా ఎక్కడా రాజకీయ ఆధిక్యతను సంపాదించటానికి కనీస సంఖ్యాబలం లేకపోవటం, ప్రత్యేకతను కాపాడుకోటానికి నిరంతరం ప్రయత్నించటం, కొన్ని విషయాల్లో అసాధారణ ప్రతిభ.. అవన్నీ కలగలసి మిగతా ప్రజల్లో ఈర్ష్యనూ, ద్వేషాన్నీ కలగచేశాయి. యూరపులోని ఆధిపత్య రాజకీయాలకూ, నాజీయిజానికీ బలిపశువులయ్యారు. మార్వాడీలు కూడా వ్యాపార సంస్కృతిని తదుపరి తరాలకు అందించటంలో, తమ సొంతకులం వాళ్లను చేరదీసి, ప్రోత్సాహం ఇవ్వటంలో, లాభనష్టాల గణనలో అసాధారణ ప్రతిభను చూపించటంలో విశిష్టత సాధించారని చెప్పే పరిశోధనలు చాలానే వచ్చాయి. మార్వాడీలపై ఎంతో పరిశోధన చేసిన థామస్ ఎ టింబర్గ్ అభిప్రాయమూ అదే.
వ్యవసాయానికి అనుకూలంగాలేని మరుదేశం మార్వాడీలను వ్యాపారం వైపు మొగ్గేలా చేసింది. కానీ అలా మొగ్గటానికి వాళ్లున్న ప్రాంతం ఎడారిగా ఉంటే సరిపోదు. అది ఇతరత్రా కూడా వ్యాపారానికి అనుగుణంగా ఉండాలి. అరేబియా సముద్ర ఓడరేవుల నుంచి వచ్చే ఉత్పత్తులనూ, మరోవైపు ముస్లిం దేశాల నుంచి భూమార్గం ద్వారా వచ్చే వస్తువులనూ అటూఇటూ చేరవేయటానికి కావాల్సిన భౌగోళిక అనుకూలత మరుదేశానికి ఉండటం మార్వాడీలకు కలిసివచ్చింది. 18వ శతాబ్దంలో రాజస్థాన్ 20–22 పెద్ద సంస్థానాలుగా విడిపోయి ఉండేది. మరికొన్ని చిన్న జమిందారీలు ఉండేవి. వీటన్నిటి మధ్యా పోటీతో పాటు యుద్ధాలూ జరిగేవి. అప్పటికే ఆర్థిక వ్యవహారాల్లో నగదు వాడకం బాగా పెరిగింది. సంస్థానాధీశుల నగదు అవసరాలు విపరీతంగా ఉండేవి. వీటిని తీర్చటానికి ముందుకు వచ్చిన మార్వాడీ వ్యాపారులకు పరిపాలనలో కూడా పెద్దపీట వేశారు. తీసుకున్న అప్పులకు బదులుగా జాగీర్లు కట్టబెట్టారు. కొన్ని పట్టణాలపై పన్ను వసూళ్ల అధికారం ఇచ్చారు. కొన్ని చోట్ల ఖజానాపై పర్యవేక్షణను అప్పగించారు. వీటన్నిటితో మార్వాడీల చేతుల్లో నగదు పోగుపడింది. మొగలు సైన్యాల వెంట అప్పటికి కొంతకాలం ముందే యూపీ, బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్‌లకు కొందరు మార్వాడీలు వెళ్లారు. ఇక బ్రిటిష్ పాలనతో వ్యాపారభద్రత రావటంతో వారి వలసలు బాగా పెరిగాయి. ఈస్టిండియా కంపెనీకీ, ఆ తర్వాత బ్రిటిష్ వ్యాపారులకూ మధ్యవర్తులుగా పనిచేశారు. వాళ్లకీ అప్పులిచ్చారు. బ్రిటిష్ పాలన నిలదొక్కుకోటానికి సహాయమూ చేశారు. ప్లాసీ యుద్ధంలో బ్రిటీష్ వారితో చేతులూ కలిపారు. కాంగ్రెస్ బలం పుంజుకున్నప్పుడు దానికి అండదండలూ ఇచ్చారు. వ్యాపారానికి అనువుగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు. అన్నిచోట్లా వ్యాపార నిర్వహణకు సొంతకులం వారిపైనే ప్రధానంగా ఆధారపడి మెట్టుమెట్టుగా ఎదిగారు. వడ్డీలూ, సరుకుల కొనుగోలు, అమ్మకాల స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన తర్వాత ఆధునిక మేనేజ్‌మెంట్ పద్ధతులను పాటిస్తున్నా ఇప్పటికీ కులాభిమాన సంస్కృతి మార్వాడీల్లో బలంగానే ఉంటుంది. సోషలిస్టు విధానాల పేరుతో వ్యాపార, పరిశ్రమ రంగాల విస్తరణపై కాంగ్రెస్ ఆంక్షలు పెట్టినప్పుడు స్వతంత్ర పార్టీ వైపునకు మొగ్గారు. ఆ తర్వాత బీజేపీకీ మద్దతు పలికారు. కొన్నిచోట్ల హిందూత్వ రాజకీయాలకు ఛాంపియన్లుగా మారారు. ఇక హిందీ భాషా విస్తరణను వందేళ్ల నుంచీ మార్వాడీలు సమర్థిస్తూనే ఉన్నారు. జాతీయస్థాయిలో ఎటువంటి అడ్డంకుల్లేని మార్కెట్ ఉండాలని కోరుకునే వాళ్లకూ ప్రాంతీయ మార్కెట్‌పై ఆధిపత్యం ప్రాంతీయులకే ఉండాలని వాదించే వర్గాలకూ మధ్య సంఘర్షణ ఈనాటిది కాదు. అది ఇప్పట్లో ముగిసిపోయేదీ కాదు. నినాదాలు ఏవైనా రెండిటి వెనకాలా ఉన్నది ఆర్థికతంత్రమే!
-రాహుల్ కుమార్ (ఆంధ్రజ్యోతి ఎడిటర్)