Manipur Violence: పాపం ప్రాయశ్చిత్తం
ABN , Publish Date - May 03 , 2025 | 03:04 AM
రెండేళ్లుగా మణిపూర్‌లో జరుగుతున్న హింస, సామాజిక చీలికలకు బీరేన్‌సింగ్ నాయకత్వం కారణమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం మళ్లీ సామరస్యానికి రావాలంటే ప్రజాప్రభుత్వం అవసరమని ప్రజాప్రతినిధులు, మేథావులు అభిప్రాయపడుతున్నారు
రెండేళ్ళక్రితం మణిపూర్ మండిపోవడం ఆరంభమైంది ఈ రోజే. జాతులమధ్య ద్వేషంతో, అవిశ్వాసంతో, పరస్పరం ఊచకోతలకు, అఘాయిత్యాలకు గురైన ఈ రాష్ట్రం మే 3ను మాత్రం మరిచిపోదు. హింసావలయంలోకి జారుకొని ఇప్పటికీ ఆ ఊబినుంచి బయటకు రాలేకపోతున్నదీ రాష్ట్రం. ఈ రెండేళ్ళకాలంలో తాము నష్టపోయిందేమిటో, ఇకపై ఆశిస్తున్నదేమిటో వివరించడానికి ఆయా తెగలకు చెందిన సంస్థలు నేడు కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు, పౌరసంస్థలు ఈ సందర్భాన్ని సానుకూల మార్పు దిశగా అడుగులువేయడానికి వాడుకోవాలని అంటున్నాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో ఉద్రిక్తతలు, అవిశ్వాసాలు తగ్గి, వాతావరణంలో మార్పు మొదలుకావాలంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని 21మంది ఎమ్మెల్యేలు లేఖ రాసిన నేపథ్యంలో, కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మేథావులు కోరుతున్నారు. మణిపూర్ మూడునెలలుగా రాష్ట్రపతిపాలన ఉన్నా, పరిస్థితుల్లో మార్పురాలేదని, రాదని, రావాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఆ ఎమ్మెల్యేలు తమ లేఖలో తేల్చేశారు. రాష్ట్రపతిపాలనను ప్రజలు, మేథావులు వ్యతిరేకిస్తున్నారని, ప్రజాదరణ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితి మారుతుందని వారి వాదన. హింస ఆగిందనో, తగ్గిందనో వస్తున్నవాదనలను ఈ ఎమ్మెల్యేలు కొట్టిపారేశారు, మళ్ళీ మళ్ళీ హింసరేగే అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేస్తున్నారు. బీజేపీనుంచి 14, ఎన్సీపీనుంచి ముగ్గురు, నాగా పీపుల్స్‌ఫ్రంట్‌నుంచి ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు ఈ లేఖమీద సంతకాలు చేసినవారిలో ఉన్నారు. బీజేపీకి అక్కడ ముప్పై ఏడుమంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. తెరవెనుక రాజకీయాలు తెలియదు కానీ, ఆరవైమంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో మూడోవంతుమంది ఈ ప్రతిపాదన చేయడం కొట్టిపారేయాల్సిన విషయమైతే కాదు. మూడునెలల క్రితం వరకూ మణిపూర్‌ను ఏలి దానిని అగ్నిగుండంగా మార్చిన ఘనత బీరేన్‌సింగ్‌కు దక్కుతుంది. మీతీలకు ఎస్టీ హోదా ప్రతిపాదన అగ్గికి కారణంగా కనిపిస్తున్నా, అప్పటికే కుకీ–జో తెగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అప్రదిష్ఠను మీతీ బీరేన్ మూటగట్టుకున్నారు. తమ నివాసాలు, భూములు, హక్కులను హస్తగతం చేసుకొనే విస్తృతమైన కుట్రకు బీరేన్ పాల్పడుతున్నాడన్న అనుమానాలు అప్పటికే ఉన్నాయి.
సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్న ఆ టేపుల్లో ఉన్నది బీరేన్‌గొంతేనని ట్రూత్‌ల్యాబ్స్ నిర్థారించిన తరువాత, సుప్రీంకోర్టుతో తమ ముఖ్యమంత్రి నేడోరేపో అభిశంసన ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇంతలోగా విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో బీజేపీ పెద్దలు ఎట్టకేలకు బీరేన్‌ను గద్దెదింపేశారు. తెగలమధ్య తగవులుపెట్టి 650రోజులపాటు రాష్ట్రాన్ని రగల్చిన బీరేన్‌కు ఆదినుంచీ అండగా నిలిచినవారు, ఆయన నిష్క్రమణ తరువాత అధికులకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని కూచోబెట్టినా బాగుండేది. స్పీకర్ కేంద్రంగా అసమ్మతి రాజుకుంటూ, అంతర్గత తిరుగుబాట్లతో తీసుకుంటున్న సొంతపార్టీని చక్కదిద్దుకోవడం సాధ్యంకాదని అర్థమైపోవడంతో రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలనలోకి నెట్టేశారు. అగ్గిరాజుకున్న వెంటనే బీరేన్‌ను తప్పించివుంటే, రాష్ట్రం ఈ దుస్థితిలోకి జారుకొనేది కాదు. బీరేన్ కారణంగా నిలువునా చీలిన సమాజం ఇప్పటికీ ఏకం కాలేకపోతోంది. రెండేళ్లపాటు మణిపూర్‌కు కేంద్రప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్దడం అంత సులభం కాదు. మిలిటెంట్ గ్రూపులనుంచి ఆయుధాల స్వాధీనం మరింత వేగంగా, నిబద్ధతతో జరగాలి. పరస్పర అవిశ్వాసం, అనుమానాలు, భయాలతో బతుకుతున్న తెగలూ, జాతులూ సయోధ్యతో జీవించేట్టు చేయగలిగే స్థానిక నాయకత్వం అవసరం ఆ రాష్ట్రానికి ఉంది.