Share News

Mana Bharosa Pensions: మన భరోసా దేశానికే ఆదర్శం!

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:08 AM

దేశంలో పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరుపేద కుటుంబాల సామాజిక భద్రత కోసం కేంద్రం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం...

Mana Bharosa Pensions: మన భరోసా దేశానికే ఆదర్శం!

దేశంలో పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరుపేద కుటుంబాల సామాజిక భద్రత కోసం కేంద్రం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (ఎన్‌ఎస్‌ఏపీ) ద్వారా అందిస్తున్న మొత్తాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో జీవనోపాధికి ఈ మొత్తాలు సరిపోకపోవడంతో దేశంలోని అనేక రాష్ట్రాలు అదనపు నిధులు కేటాయించి తమ స్వంత పింఛన్ పథకాలను అమలు చేస్తున్నాయి. ఆ కోవలోనే ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ పథకం’ సామాజిక సంక్షేమాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్తున్నది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు, మూడవ ఫైల్‌గా పింఛన్ పెంపు ఫైలుపై సంతకం చేశారు. అమలుకు వెంటనే చర్యలు ప్రారంభించారు. పింఛన్ రాబడి మీద ఆధారపడే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి సామాజికంగా బలహీనవర్గాల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇది సజీవ సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పింఛన్ వ్యవస్థకు పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రజల ఆర్థిక భద్రత కోసం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఒక ఆర్థిక అండగా నిలిచింది. 1980లలో నెలకు కేవలం రూ.35తో ప్రారంభమైన ఈ పథకం, ఆ సమయంలోనే ప్రజా పరిపాలనలో మానవీయతకు సంకేతంగా నిలిచింది. తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పింఛన్లను రూ.75కు పెంచి, పథకాన్ని మరింత తీర్చిదిద్దారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ భారీ హామీలు ప్రకటించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు.


రూ.200 చేస్తామని ప్రచారం చేసిన ఆయన, చివరకు కేవలం రూ.25 మాత్రమే పెంచి, పింఛన్ మొత్తాన్ని రూ.175గా నిర్ణయించడం నిరాశను కలిగించింది. 2014లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జూన్ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పింఛన్ పెంపు ఫైల్‌పై సంతకం చేశారు. ఆ రోజు నుంచే పింఛన్ మొత్తాన్ని రూ.1,000కు పెంచడం, తరువాత దాన్ని రూ.2,000కు పెంచడం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వంటి వర్గాల ఆర్థిక స్థితిని మారుస్తూ, దేశంలోనే అత్యధిక పింఛన్ అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టింది. కేవలం ఐదేళ్లలో పింఛన్లను 10 రెట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడిదే. అయితే, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ‘పెన్షన్లను రూ.3,000కు పెంచుతాం’ అని ప్రకటించారు. ఈ మాటను ఆయన చేసిన పాదయాత్రల్లోనూ, పార్టీ మేనిఫెస్టోలోనూ మళ్లీ మళ్లీ ప్రస్తావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత, పింఛన్ మొత్తాన్ని కేవలం రూ.250మాత్రమే పెంచి, రూ.2,000 నుంచి రూ.2,250గా నిర్ణయించారు. ఈ నిర్ణయం వృద్ధులలో నిరాశను రేకెత్తించింది. ఆర్థికంగా లెక్కలు వేసుకుంటే– మొత్తం మూడేళ్ళల్లో ఒక్కొక్కరు రూ.18,000 నష్టపోయారు. వాస్తవానికి జగన్ రెడ్డి ఇచ్చిన హామీ, ఆ సమయంలో టీడీపీ అప్పటికే అమలు చేసిన పథకానికి పోటీగా ఇచ్చినదే. ఇదే సమయంలో, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే పింఛన్ పెంపు ఫైల్‌పై సంతకం చేశారు. వృద్ధులకు రూ.3,000 నుంచి రూ.4000కు, వితంతువులు, వికలాంగులకు రూ.4000 నుంచి రూ.6000కు, ఆరోగ్య సమస్యలున్న వారికి రూ.10,000 నుంచి రూ.15,000కు పెంచారు. ఏఆర్‌టీ (హెచ్ఐవీ పాజిటివ్) బాధితులకు, సీకేడీ, తలసేమియా, సికిల్ సెల్, లివర్, కిడ్నీ మార్పిడి బాధితులకు కూడా ప్రత్యేక పింఛన్లు మంజూరు చేస్తోంది. మొత్తం 28 వేర్వేరు వర్గాల ప్రజలకు ఈ పథకం వర్తింపచేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఒక సమగ్ర సంక్షేమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళుతోంది. ఈ ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.32,143 కోట్లు కేటాయింపులు చేసింది. ఇది రాష్ట్ర బడ్జెట్‌లో సుమారు 12–14 శాతం.


సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం సామాజిక భద్రతపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నది. 2024 జూలై నుంచి 2025 అక్టోబర్ వరకు పింఛన్ పంపిణీ గణాంకాలను విశ్లేషిస్తే– మొత్తం రూ.47,996.21 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.47,118.38 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంటే, సగటున 98 శాతానికి పైగా లబ్ధిదారులకు పెన్షన్ అందింది. సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వాలలో కూటమి సర్కార్ దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వంగా నిలిచింది. ఉదాహరణకు తెలంగాణలో పింఛన్ మొత్తం రూ.2,016 మాత్రమే కాగా, లబ్ధిదారుల శాతం కూడా తొమ్మిది లోపే ఉంది. తమిళనాడు, మహారాష్ట్రలలో పింఛన్‌ లబ్ధిదారుల శాతం నాలుగు కూడా లేకపోగా, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఈ శాతం తొమ్మిదికి చేరినప్పటికీ పింఛన్ మొత్తాలు కేవలం రూ.400 మాత్రమే ఉన్నాయి. గుజరాత్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో సైతం వికలాంగులకు కేవలం రూ.600 మాత్రమే ఇవ్వటం ఆశ్చర్యకరం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్ర జనాభాలో దాదాపు 13 శాతం మంది పింఛన్‌ లబ్ధిదారులుగా ఉండటం విశేషం. భరోసా పెన్షన్ల కోసం నెలకు రూ.2,722 కోట్ల వ్యయం జరుగుతోంది. పింఛన్లను కేవలం ఓ సంక్షేమ కార్యక్రమంగా కాకుండా, ప్రజల హక్కుగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ, సామాజిక భద్రతను సమర్థవంతంగా అమలు చేస్తున్నది. ప్రతి లబ్ధిదారుడి వివరాలను సర్వేల ఆధారంగా నిర్ణయించడం, నేరుగా లబ్ధిదారుడి చేతికే పెన్షన్‌ పంపిణీ వంటి సంస్కరణల ద్వారా ఈ పథకాన్ని మరింత విశ్వసనీయంగా మార్చింది. ఆంధ్రప్రదేశ్ పింఛన్ విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.

-గుమ్మడి ప్రభాకర్

Updated Date - Oct 25 , 2025 | 04:08 AM