Share News

Malegaon blast,: మాలేగావ్‌ మిథ్య...

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:33 AM

ఆ ఆరుగురినీ ఎవరు చంపారు? సమాధానం దొరకని ప్రశ్న ఇది. మాలేగావ్‌ పేలుళ్ళ ఘటనకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ

Malegaon blast,: మాలేగావ్‌ మిథ్య...

ఆరుగురినీ ఎవరు చంపారు? సమాధానం దొరకని ప్రశ్న ఇది. మాలేగావ్‌ పేలుళ్ళ ఘటనకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కోర్టు గురువారం వెలువరించిన తీర్పు ఊహకు అందనిదేమీ కాదు. బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్‌, లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా మొత్తం ఏడుగురు నిందితులనూ న్యాయస్థానం నిర్దోషులుగా వదిలేసింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ తప్ప, ఎలాంటి బలమైన ఆధారాలు లేవు అని తేల్చేసింది న్యాయస్థానం. తీర్పు ఇలా ఉన్నప్పుడు, న్యాయస్థానం ప్రకటించిన నష్టపరిహారం మృతుల కుటుంబాలకు ఉపశమనాన్ని ఇచ్చే అవకాశం లేదు. రంజాన్‌ మాసంలో, ప్రార్థనలు జరుగుతున్న ఒక మసీదుముందు పేలుడు సంభవించి ఆరుగురు మరణానికీ, వందకుపైగా గాయపడటానికి కారకులెవ్వరూ లేరనీ, ఎవరూ బాధ్యులు కారనీ చివరకు ఇలా తేలిందన్నమాట. పేలుడుకు వినియోగించిన మోటార్‌బైక్‌ ప్రజ్ఞాఠాకూర్‌కు చెందినదేనని అనడానికి ఆధారాలు లేవన్నారు న్యాయమూర్తి. ఆ వాహనానికి అమర్చిన బాంబువల్లే పేలుడు సంభవించిందని కూడా నిరూపించలేకపోయారట. కల్నల్‌ పురోహిత్‌ కశ్మీర్‌నుంచి మిలటరీ గ్రేడ్‌ ఆర్డీఎక్స్‌ తెచ్చి, తానే బాంబు తయారుచేశారనీ చెప్పలేమట. ఈయనకు మరోనిందితుడు డబ్బు సమకూర్చిపెట్టినప్పటికీ, ఈ ఘాతుకం కోసమే ఆ ఆర్థికసాయం జరిగిందని ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందట. చివరకు, నిందితులంతా కలసిపన్నిన కుట్ర సిద్ధాంతాన్నే న్యాయస్థానం ఆమోదించనప్పుడు తీర్పు ఇలా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు.


మొదట్లో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) తన చార్జిషీటులో అభినవ భారత్‌ వ్యవస్థాపకులైన ప్రజ్ఞాఠాకూర్‌, కల్నల్‌ పురోహిత్‌ కుట్రను వివరిస్తూ, తీవ్ర ఆరోపణలే చేసింది. ఏటీఎస్‌నుంచి ఈ కేసు చేతిలోకి తీసుకున్న ఎన్‌ఐఏ ఐదేళ్ళపాటు నిందితులెవ్వరికీ వీసమెత్తు మినహాయింపులు దక్కనివ్వలేదు. కానీ, 2016లో అనుబంధ చార్జిషీటుదాఖలు చేస్తూ, తగిన ఆధారాలు లేనందున ప్రజ్ఞాఠాకూర్‌ మీద ఆరోపణలు ఉపసంహరించుకోవడమే కాక, నిందితులమీద మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ యాక్ట్‌ (ఎంసీఓసీఏ) ఎత్తివేయాలని సూచించింది. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అవినాష్‌ రసాల్‌కు తెలియకుండా పైనుంచి వచ్చిన ఆదేశాలమేరకు ఎన్‌ఐఏ ఈ పని చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి ఇంకాముందే, ఈ కేసులో నిందితులపట్ల మెతకగా, సానుభూతితో వ్యవహరించమంటూ తనను ఎన్‌ఐఏ ఒత్తిడిచేస్తున్నదని ఆరోపిస్తూ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రోహిణీ సాలియన్‌ పక్కకు తప్పుకున్నారు.


ఈ కేసు వల్లనే పదిహేడేళ్ళపాటు తన జీవితం నాశనమైందనీ, తనను క్షోభపెట్టినవారందరినీ దేవుడు శిక్షిస్తాడని ప్రజ్ఞాఠాకూర్‌ ఇప్పుడు శాపాలు పెడుతున్నారు. కానీ, ఈ కేసును ఏటీఎస్‌ నుంచి ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్నాక ఆమెకు చాలా ఉపశమనాలు దక్కాయి. ఆమెను వదిలేయమని ఎన్‌ఐఏ కోరినప్పటికీ, గతంలో ఏటీఎస్‌ ఇచ్చిన ఆధారాలమేరకు ఎన్‌ఐఏ కోర్టు ఇంతవరకూ విచారణలో కొనసాగించడమే ఈ ఆగ్రహానికి కారణం కావచ్చు. ఇందుకు ప్రధాన కారకుడు, మాలేగావ్‌ కుట్రను శోధించి, ఛేదించిన హేమంత్ కర్కరేను ఆమె గతంలోనే శపించారు. ఆమెమీద ఒకపక్క ఇంకా కేసు ఉండగానే, 2019లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌నుంచి బీజేపీ ఆమెను నిలబెడితే, తన శాపంవల్లనే ముంబై ఉగ్రదాడిలో పాక్‌ టెర్రరిస్టుల చేతుల్లో కర్కరే హతమైపోయారని ఎన్నికల ప్రచారసభలో వ్యాఖ్యానించారు ఆమె. ఎటీఎస్‌ సేకరించిన సాక్ష్యాలూ, వాంగ్మూలాలు శుద్ధతప్పని అంటూ ఎన్‌ఐఏ మళ్ళీ అంతా కొత్తగా ఆరంభించినప్పుడే ఈ తీర్పుకు పునాది పడింది. మళ్ళీ రికార్డుచేసినప్పుడు 164మంది వాంగ్మూలాలు గతానికి భిన్నంగా మారిపోయాయి. ఈ తరహా మారణకాండలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తులూ విచారణలూ సుదీర్ఘకాలం సాగి, తీర్పులు చివరకు ఇలా తేలిపోవడం విషాదం. రెండుదశాబ్దాల నాటి ముంబై రైలు పేలుళ్ళకేసులో నిందితులుగా ఉన్న 12మందిని బాంబే హైకోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటిస్తే, అదేరోజున మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే సాధించింది. మాలేగావ్‌ కేసులోనూ ఇదేరీతిలో పై కోర్టుకు అప్పీలుకు వెడతారా, లేక నిందితుల మతాలూ మా అభిమతాలూ ఇక్కడ పూర్తిగా వేరు అంటారా?.. అంతా తెలిసికూడా కొందరు మేధావులు అమాయకంగా వేస్తున్న ప్రశ్న ఇది.

Updated Date - Aug 01 , 2025 | 05:33 AM