Share News

Maharashtra Assembly Elections: ఈసీపై ఈగిల్ పోరు

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:38 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చెల్లనివిగా ప్రకటించాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను బోంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. గత ఏడాది నవంబరు 20వతేదీ సాయంత్రం ఆరుగంటల తరువాత 76లక్షల బోగస్‌ ఓట్లు పోలయ్యాయన్న పిటిషనర్‌ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు.

Maharashtra Assembly Elections: ఈసీపై ఈగిల్ పోరు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను చెల్లనివిగా ప్రకటించాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను బోంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. గత ఏడాది నవంబరు 20వతేదీ సాయంత్రం ఆరుగంటల తరువాత 76లక్షల బోగస్‌ ఓట్లు పోలయ్యాయన్న పిటిషనర్‌ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు. జాబితాలో అవకతవకలు జరిగాయన్న, పోలింగ్‌ కేంద్రాల్లో దొంగ ఓట్లువేశారన్న ఆరోపణలను రుజువుచేసే కచ్చితమైన, ప్రత్యక్ష రికార్డులేమీ లేనందున న్యాయస్థానం సదరు పిటిషన్‌ను కొట్టిపారేసింది. మరోపక్కన, ఈసీతో తన యుద్ధాన్ని కొనసాగిస్తూ మహారాష్ట్ర ఓటరు జాబితాల డిజిటల్‌ ప్రతిని కాంగ్రెస్‌ గురువారం డిమాండ్‌ చేసింది. మహారాష్ట్ర ఎన్నికలు ముగిసి ఏడునెలలుదాటినా అకారణంగానో, సకారణంగానో వార్తల్లో ఉంటోంది. ఎన్నికలు జరిగినప్పటినుంచి, ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది. పోలింగ్‌బూతుల వెలుపల భారీ క్యూలైన్లు ఏమీ లేకుండానే, ఆఖరునిముషంలో పడిన లక్షలాది దొంగ ఓట్లతో బీజేపీ కూటమి అధికారంలోకి రాగలిగిందని రాహుల్‌ కొన్ని లెక్కల ఆధారంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘంతో వ్యవహారాలూ, అవసరమైతే వివాదాలూ నడిపేందుకు నాయకులు, నిపుణులతో కూడిన ‘ఈగిల్‌’ గ్రూప్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈగిల్‌, ఈసీల మధ్య ఉత్తరప్రత్యుత్తరాల యుద్ధం సాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సాధించి, శోధించి, మధించి ఈసీని నిలదీయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పోతోంది. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా ఓట్లుపడని స్థానాల్లో ఓటర్లసంఖ్య అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక్కసారిగా హెచ్చిందని, ఈ రెండు ఎన్నికల మధ్యకాలంలో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 92.9 మిలియన్‌ నుంచి 97 మిలియన్‌కు పెరిగిందని, ఐదునెలల్లోనే ఈ పెరుగుదల 4.1 మిలియన్‌ ఉన్నదని కాంగ్రెస్‌ లెక్కలు విప్పుతోంది. అంతకుముందు ఐదేళ్ళకాలంలో ఈ పెరుగుదల ౩.1 మిలియన్‌ మాత్రమే ఉన్నందున కాంగ్రెస్‌ విమర్శ పూర్తిగా కాదనలేనిది.


ఈ ఆరోపణలు నిరాధారమని వివరంగా మాట్లాడుకుందాం రమ్మని రాహుల్‌ను ఈసీ పిలిచినా ఆయన వెళ్ళలేదు. ఓటర్‌ డేటా, సిసిటీవీ ఫుటేజ్‌ ఇత్యాది కీలక వివరాలు దక్కేవరకూ ఈసీ మెట్లు ఎక్కేది లేదని కాంగ్రెస్‌ అంటోంది. ఐదునెలల్లోనే ఓటర్ల సంఖ్య అంతగా ఎలా పెరిగిందన్న ప్రశ్న కంటే, పోలింగ్‌ సమయం ముగిసిన ఐదుగంటలకు తాత్కాలిక అంచనాల ప్రకారం పోలైన ఓట్ల శాతం ౫8.22 ఉండగా, మర్నాడు ఉదయానికి అది ౬6.05శాతం ఎలా అయిందన్నది మంచి ప్రశ్న. ఇంకా ఓట్లు వేయాల్సి ఉన్నవారి భారీ క్యూలైన్లు కనిపించకున్నా, 7.83శాతం పెరుగుదల నమోదైందని కాంగ్రెస్‌ గుర్తుచేస్తోంది. అంటే, పోలింగ్‌వేళలు ముగిసిన తరువాత 76లక్షలమంది ఓటేశారని అర్థం. పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి ఓట్లేసిన, ఆ తరువాత ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్ల సంఖ్య మధ్య తేడా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒకశాతం లోపే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలోని లక్షపోలింగ్‌ కేంద్రాల్లో కేవలం 85 నియోజకవర్గాల్లోని 12వేల పోలింగ్‌ బూత్‌లలో మాత్రమే అదనపు పోలింగ్‌ జరగడం కాంగ్రెస్‌ విమర్శలకు కారణం. లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గాల్లోనే ఎన్డీయే కూటమి వెనుకంజవేయడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 85సీట్లలోనే ఆ కూటమి అత్యధికస్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్‌ అనుమానాలకు కారణం. పోలింగ్‌ బూతులకు సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్‌, డిజిటల్‌ ఓటర్‌ లిస్ట్‌ కోసం కాంగ్రెస్‌ పట్టుబడుతున్న ఈ నేపథ్యంలోనే, ఎన్నికల సంఘం మే30వతేదీన జారీ చేసిన ఆదేశాలు ఆశ్చర్యం కలిగించాయి. ఫలితాలు ప్రకటించిన నలభైఐదురోజుల్లోగా కోర్టుల్లో కేసులేమీ నమోదుకాని పక్షంలో అన్ని రకాల విడియో ఫుటేజ్‌ను ధ్వంసం చేయవచ్చునని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. విడియోల దుర్వినియోగాన్ని నివారించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ చెప్పింది. కాంగ్రెస్‌ ఆరోపణలను కొట్టివేయడం వల్లనో, ప్రతివిమర్శలతో సరిపుచ్చడం వల్లనో ఈసీకి ఒనగూరే లబ్ధి ఏమీ ఉండదు. ఎన్నికల ప్రక్రియమీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని వమ్ముచేసే అధికారం కాంగ్రెస్‌ సహా ఏ పార్టీకీ లేదు. మహారాష్ట్రలో అంతా సవ్యంగానే జరిగిందని ఈసీ నమ్మకంలో నిజం ఉండవచ్చు. కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న అక్రమాలు, కుట్రలకు తావులేకుండా ఆ ఎన్నికలు జరిగివుండవచ్చు. కానీ, కాంగ్రెస్‌ ప్రస్తావిస్తున్న అన్ని రకాల డేటా, విడియోలతోనే ఈసీ ఆ విమర్శలను తిప్పికొట్టినప్పుడు ప్రజల్లో నమ్మకం కలుగుతుంది, ఈసీ ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది.

Updated Date - Jun 27 , 2025 | 04:40 AM