Bathukamma Festival: ప్రకృతి బతుకమ్మను బతికించుకుందాం
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:03 AM
భారతదేశం పండగలకు పురిటిగడ్డ. తెలంగాణ ప్రాంతం పండగలు, ఉత్సవాలు, జాతరలకు పుట్టిల్లు. పండగలు రెండు రకాలు. మొదటి రకం పుట్టు పండగలు....
భారతదేశం పండగలకు పురిటిగడ్డ. తెలంగాణ ప్రాంతం పండగలు, ఉత్సవాలు, జాతరలకు పుట్టిల్లు. పండగలు రెండు రకాలు. మొదటి రకం పుట్టు పండగలు. బోనాలు, సదర్, బతుకమ్మ, నాగోబా జాతర, సమ్మక్కసారలమ్మ జాతర వంటివి. రెండో రకం పెట్టు పండగలు. ఇవి తెచ్చిపెట్టుకున్న పండగలు. బతుకమ్మ వంటి పూల పండగలు దేశంలో కేరళ, గుజరాత్ వంటి చోట్లా ఉన్నాయి. కానీ, బతుకమ్మ నేల పొరలలోంచి చీల్చుకువచ్చిన పండగ. పునరుత్పత్తి వంటి పురాభావన, ప్రకృతే దైవంగా పాంచభౌతిక శక్తుల ఆరాధనా రీతులను పుణికిపుచ్చుకున్న, ప్రత్యేకించి స్త్రీల పండగ. ఈ పండగలో పురుషుడు తండ్రైనా, భర్తైనా, కొడుకైనా ప్రేక్షకుడే. వ్యవసాయ భావనకు ఆద్యురాలు, శ్రమలో ముప్పాతిక భాగం, చిందిన చెమటలోంచి రూపొందిన రాగం–తాళం, ఆట–పాట అన్నీ స్త్రీల ముద్రతోనే అలరారుతాయి. ఇలాంటి పండగలు ఏ రూపంలో, ఏ ప్రాంతంలో ఉన్నా వాటిని పరిరక్షించుకునే అత్యయిక పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి మహిళా ప్రధానమైన పండగే. కానీ, పురుషాధిక్య భాగస్వామ్యం వల్ల అది కోడిపందేల, మద్యమాంసాల పండగైంది. తెలంగాణలో ఆడపిల్లలు బొడ్డెమ్మ పండగ ఆడాక బతుకమ్మ పండగ వస్తుంది. ఆ తదుపరి వచ్చే దసరా పురుషుల పండగ అయ్యింది. మద్య మాంస సేవన ప్రాధాన్య దినంగా మారింది. దీపావళి, హోలీ పండగలు దక్షిణాదిన ఎన్నో కారణాల వల్ల అధిక ప్రచారం పొందాయి.
బతుకమ్మ పండగ ప్రకృతి అంత పాతది. దాని చుట్టూ అనేక ఐతిహ్యాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఈనాటికీ ఆదివాసులలో జరపబడే కొత్తల పండగ, టెంకల పండగలు ఉన్నాయి. కొత్త ధాన్యం, కూరగాయలు, తృణధాన్యాలు ఏవి పండినా వాటిని తినే ముందు పండగ జరుపుతారు. అలాగే భాద్రపద మాసంలో ధాన్యం, రకరకాల చిరుధాన్యాలు చేతికి వస్తాయి. అప్పుడే బతుకమ్మ పండగ సంరంభం మొదలవుతుంది. బొడ్డెమ్మ పండగ 9 రోజులు, బతుకమ్మ పండగ 9 రోజులు. ఈ తొమ్మిది రోజులు 9 రకాల ధాన్యాలతో ప్రసాదం తయారుచేసి స్త్రీలందరూ పంచుకుని తింటారు. 9 రకాల పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఐతే అవి ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటాయి! ఈ పండగలో అనేక పాటలు పాడతారు. నృత్యం చేస్తారు. అడుగు వెనక్కి ముందుకి కాదు సుమా, వంగుతూ లేస్తూ మొగ్గ పువ్వుగా మారినట్లు వర్తులాకార (గుండ్రంగా) నృత్యం చేస్తారు. రేలా, ధింసా వంటి ఆదివాసీ నృత్యాలను పోలి ఉంటుంది. ఈ తతంగం అంతా ప్రకృతి సంబంధంగా ఉంటుంది. పునరుత్పత్తి భావన ధ్వనిస్తుంది. ఇలాంటి పండగలు ఏవైనా వాటిని కాపాడుకోవాలి. ఈ పండగలు సామాజిక బాంధవ్యాల్ని పెంచుతాయి. తరతరాల సంస్కృతిక వారసత్వాన్ని కాపాడ్డం కోసం ఇవి ఉనికి కోల్పోవద్దు. సమాజంలో ఈ పండగకి ‘అదేనా ఆడవారి పండగ’ అనే భావన ఉంది. అది పురుషాహంకార సంస్కృతిలోంచి జనించింది. కానీ ఈ పండగ నిర్వహణలో ఎక్కడా, ఏ రూపంలోనూ కలుషితం చేయరు. పైగా పవిత్ర భావనలతో పండగకి వన్నె తెస్తారు. మానవీయ, సాంఘిక విలువలు పాటిస్తారు. గతంలో బతుకమ్మ పండగపై సామాజిక, ఆర్థిక, జెండర్ ప్రభావాలు పడి కొంత సెట్‌బ్యాక్ అయ్యింది. తెలంగాణ రైతాంగ పోరాట కాలానికి ముందే దొరలు స్త్రీలను బట్టలు విప్పి బతుకమ్మ ఆడించారు. కరుడుగట్టిన దొరలు స్త్రీలను అమానుష అవమానాలకు గురిచేశారు. అందుకే గడీల ముందు నుంచి బతుకమ్మలను తీసుకువెళ్ళేవారు కాదు. కొందరు దొరలు బలవంతంగా ఆట ఆడించేవారు. రైతాంగ పోరాటంలో స్త్రీలు తమను హింసించినవారి కళ్ళల్లో కారం కొట్టారు. తుపాకులు అందుకున్నారు. రజాకార్లను సైతం ఎదిరించి నిలబడ్డారు. మళ్ళీ బతుకమ్మ శిరసెత్తి నిలిచింది. వలసకాలంలో బతుకమ్మ పండగ ఒకటుందని కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ రోడ్డెక్కింది. వంటావార్పులో ఒక ఆయుధమైంది. విప్లవీకరించిన పాటకు పల్లవైంది. కేవలం చేత్తో కొట్టే చప్పట్లే గొప్ప సంగీతమై బతుకమ్మ తలెత్తి నిలిచింది.
గత పన్నెండేళ్ళుగా అస్తిత్వ భావనలకు తెలంగాణ రాజకీయాలు దూరంగా నెట్టబడ్డాయి. ప్రకృతి విధ్వంసకర చర్యలను చూసీచూడనట్లు పక్కనపెట్టారు. ఒక దశలో పూలు లభించలేదు. చెరువులు, జలాశయాలు ఆక్రమణలకు గురైనప్పుడు ప్లాస్టిక్ బకెట్లలో బతుకమ్మ నిమజ్జనం జరిగింది. దొరల పాలనలో దొరసానిగారికే బంగారు బతుకమ్మ తలమీది కిరీటం అయ్యింది. అది ప్లాస్టిక్ పూలతో అలంకరించబడింది. లక్షల ప్లాస్టిక్ పూలు, వేలాది టన్నుల ప్లాస్టిక్‌తో చౌరస్తాల్లో అడుగడుగునా బతుకమ్మలు పెట్టారు. కానీ తెలంగాణ స్త్రీల మనోభావాలకు గౌరవం లేదు. మధురంగా రాగయుక్తంగా పాడుకునే పాటల స్థానంలోనే డీజేలు, రంగురంగుల కృత్రిమ వెలుగులు, దాండియా పేర కోలాటాల వికృత క్రీడ. పర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారవర్గాల సంస్కృతి నెత్తిమీద బతుకమ్మని దించేసి కొత్త సంస్కృతిని రుద్దారు. అయినా సాంస్కృతిక శాఖ ఈ వైపు దృష్టిపెట్టలేదు. మానవీయ సంస్కృతికి మారురూపమైన బతుకమ్మకి అవమానం జరిగినా పట్టించుకోలేదు. ఇవ్వాళ ఆ శక్తులు నోరుమూసుకొని అపరాధ భావనతో క్లబ్బుల్లో, పబ్బుల్లో, ఫామ్‌హౌజుల్లో కృత్రిమ బతుకమ్మలకే పరిమితమయ్యాయి. బతుకమ్మ ఒడ్డూపొడవుల గురించే ఆలోచించారు. ఒక్కొక్క పువ్వేసి... తెలంగాణ మహిళలు ఈసారి తమ గౌరవాభిమానాల్ని పరిరక్షించుకోవడం కోసం ఆలోచనలు చేస్తున్నారు. ఈ ఒక్క పండగలోనే వాడవాడంతా బతుకమ్మవుతుంది. ఊరు ఊరంతా పాటవుతుంది. ఇక్కడ కులమతాలు ఉండవు. అందరూ ప్రసాదం తెస్తారు. తెచ్చిన ప్రసాదం ఒక్కచోట పెట్టి పదిమంది కలసి సామూహికంగా తింటారు. కలసి పాడుతూ, ఆడుతూ బతుకుల్ని కలబోసుకునే పండగ ఇది. ఇలాంటి పండగల వల్ల, కలయికల వల్ల, జాతరల వల్ల సాంస్కృతిక వైభవం తరం నుంచి తరానికి అందుతుంది. సమాజంలో ఉత్సాహభరిత, ఉల్లాసపూరిత వాతావరణం నెలకొంటుంది. తద్వారా ఆరోగ్యకరమైన సంతృప్తికరమైన జీవితాలు కాంతి గోళాల్లా వికసిస్తాయి. బహు కుల, మత, అంతరాలున్న చోటే ఇలాంటి పండగలు కొత్త ఉత్సాహానికి హేతువులవుతాయి.
బహుజన బతుకమ్మ ఆలోచనతో పనిచేసే విమలక్కల సంఖ్య పెరగాలి. బతుకమ్మని ప్రజాస్వామీకరించే దిశగా మరిన్ని అడుగులు పడాలి. అన్ని వివక్షలను దూరంపెట్టే ‘బతుకమ్మ’ కొత్త పాఠం తయారుకావాలి. దొరల చేతల్లో, చేతుల్లో బందీ అయిన బతుకమ్మ ప్రకృతి పరిరక్షణ నినాదం కావాలి. వనరుల విధ్వంసం జీవన విధ్వంసమే అనే యోచనతో మహిళాశక్తి కదలాలని ఆశిద్దాం. పుట్టు పండగల్ని కాపాడుకొందాం. వాటిని పాడుచేసి, పరాయీకరించే పన్నాగాల పని పట్టాలి. వికృతి బతుకమ్మను కాకుండా ప్రకృతి బతుకమ్మను బతికించుకోవడమే అందరి బాధ్యత. కొత్త బట్టలు, పొట్టకింత తినడమే పండగ కాదు. ఇల్లలికితే పండగ కాదు. సమాజాన్ని, ప్రకృతిని కాపాడుకున్న రోజే అసలైన పండగ. ప్రభుత్వం పర్యావరణహితంగా ఆలోచించి, చర్యలు తీసుకోవాలి. కాలుష్యాన్ని పెంచే విధానాలకు స్వస్తి చెప్పి, దేశానికి సందేశం ఇవ్వాలి. స్త్రీల పండగకి జాతీయ హోదా కల్పించే దిశగా కేంద్రమంత్రులు ఆలోచించాలి.
-జయధీర్ తిరుమలరావు